యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు ఎందుకు ? : తమిళిసై

యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు ఎందుకు ? : తమిళిసై

హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు ఎందుకని ప్రశ్నించారు. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు చెల్లుబాటుపై తమకు అనేక సందేహాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై ఉన్న అనుమానాలను తీర్చాల్సి ఉందని, అందుకే బిల్లుల ఆమోదానికి కొంత సమయం పడుతోందన్నారు. ఈలోపే తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. కావాలనే బిల్లులను ఆపుతున్నారనేది అవాస్తవమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. విద్యార్థి సంఘాలతో రాజ్ భవన్ ముందు ఆందోళనలకు రెచ్చగొడుతున్నారని తమిళిసై చెప్పారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

బిల్లులను తొక్కిపెట్టాననడం సబబు కాదు

‘యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోంది. నేను ఎలాంటి బిల్లులు ఆపలేదు. బిల్లులను తొక్కిపెట్టాననడం సబబు కాదు. కొత్త విధానంపై సందేహాలు ఉన్నాయి.  కొత్త విధానం అవసరమా..? కాదా..? అని పరిశీలిస్తున్నాం. బోధనా పోస్టులను భర్తీ చేయాలని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. కొత్త నియామక బోర్డు అవసరం ఏమొచ్చింది..? వీసీ పోస్టులు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. నేను పదే పదే డిమాండ్‌ చేశాక వీసీలను నియమించారు’ అని చెప్పారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులపై ఇప్పటికే సమగ్ర నివేదిక ఇచ్చానని అన్నారు. 

ప్రగతి భవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయి..

రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా రాజ్‌భవన్‌కు వెళ్లి నిరసన తెలపాలని చెబుతున్నారని తమిళిసై మండిపడ్డారు. రాజ్‌భవన్‌ ఎప్పుడూ అందరికీ అందుబాటులోనే ఉంటుందన్నారు. రాజ్ భవన్ కు వచ్చేవారిని ఎవరూ అడ్డుకోవడం లేదని, ప్రగతిభవన్‌లా కాదని, రాజ్‌భవన్‌ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ఎవరైనా రాజ్‌భవన్‌కు రావొచ్చు... విజ్ఞప్తులు ఇవ్వొచ్చన్నారు. తాను ఎలాంటి సమస్యలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.