
గవర్నర్ తమిళిసై సూచన
రాష్ట్ర మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ట్రైబల్ ప్రజలకు జనరిక్ మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకురావాలని గవర్నర్ తమిళిసై సూచించారు. ఇందుకు ఆయా ప్రాంతాల్లో ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం జన ఔషధి దివాస్ సందర్భంగా రాజ్‌భవన్‌లో జన ఔషధి కేంద్రాల ప్రతినిధులు, ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ మాట్లాడారు. నిత్యం మందులు వాడాల్సి ఉన్నా.. సాధారణ మెడిసిన్స్‌ను ఎక్కువ డబ్బుపెట్టి కొనలేక, పబ్లిక్ వాటిని వాడటం లేదని చెప్పారు. జనరిక్ మందులు వచ్చాక చాలా మంది ప్రాణాలు కాపాడామని ఆమె గుర్తుచేశారు.
పబ్లిక్‌కు మందులు కొనే భారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా జనరిక్ ఔట్‌లెట్స్ పెంచాలని ప్రధాని నిర్ణయించడంపై గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు, జన ఔషది కేంద్రాల నిర్వహకులు పాల్గొన్నారు. మరోవైపు అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు తమిళిసై గ్రీటింగ్స్ తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, కల్చర్‌లో మహిళను శక్తిగా అభివర్ణిస్తున్నారని గుర్తుచేశారు.
నిర్ణయాలు తీసుకునే సమయంలో మహిళలకు పురుషులు సమాన ప్రాధాన్యత ఇస్తూ, వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఫ్యామిలీని చూసుకోవడం నుంచి దేశ నిర్మాణం వరకు అన్ని అంశాల్లో మహిళలు ముందున్నారని చెప్పారు.