సెకండ్​ వేవ్​ కట్టడికి ఏం చేస్తున్నరు?

సెకండ్​ వేవ్​ కట్టడికి ఏం చేస్తున్నరు?
  • మంత్రి ఈటలకు ఫోన్​ చేసి వివరాలు తెలుసుకున్న గవర్నర్ తమిళిసై
  • ట్రేసింగ్​కు యాప్ రూపొందించినట్లు మంత్రి వెల్లడి
  • జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు గవర్నర్​ సూచన

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో కరోనా  సెకండ్ వేవ్ పరిస్థితిపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్​కు ఆదివారం ఆమె ఫోన్​ చేసి మాట్లాడారు. కరోనా కట్టడి, ట్రీట్ మెంట్​ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఈటలను వివరాలు అడిగి తెలుసుకున్నారని రాజ్ భవన్  ఒక ప్రకటనలో పేర్కొంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్​పై  ప్రభుత్వ చర్యలను గవర్నర్ కు మంత్రి వివరించారు. ట్రేసింగ్ కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామని, హాస్పిటళ్లలో మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు.  యాప్ ను రూపొందించినందుకు హెల్త్​ డిపార్ట్​మెంట్​ను  గవర్నర్ అభినందించారు. క్రిటికల్ గా ఉన్న వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పబ్లిక్ అలర్ట్ గా ఉండాలని గవర్నర్ తమిళిసై సూచించారు. మాస్క్ లు పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, పబ్లిక్ గుమికూడవద్దని అన్నారు. ప్రైవేట్ , ప్రభుత్వ హాస్పిటళ్లలో పెద్ద సంఖ్యలో కరోనా పేషంట్లు వెంటిలేటర్ పై ఉన్నారని గవర్నర్  గుర్తుచేశారు. కరోనాను  ముందే గుర్తించి, వ్యాక్సిన్ , ట్రీట్ మెంట్ అందిస్తే  సీరియస్ నెస్ ను తగ్గించ వచ్చన్నారు.  45 ఏండ్లు దాటిన వాళ్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్  సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున  ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తలతోనే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చన్నారు.