బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్

బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్

ఢిల్లీ: 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్రం పద్మ అవార్డుల్ని ప్రకటించింది. నలుగురిని పద్మవిభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందిని పద్మ శ్రీతో సత్కరించనుంది. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, రాధేశ్యామ్ ఖేమ్కా, యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ తో పాటు కళా రంగంలో విశిష్ట సేవలందించిన మహారాష్ట్రకు చెందిన ప్రభ ఆత్రేను కేంద్రం పద్మ విభూషణ్ కు ఎంపిక చేసింది.  వీరిలో బిపిన్ రావత్, రాధేశ్యామ్ ఖేమ్కా, కల్యాణ సింగ్ లకు మరణానంతరం ఈ  ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.

కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, కోవిషీల్డ్ వ్యాక్సిన తయారు చేసిన సైరస్ పూనావాలా తదితరులు పద్మ భూషణ్ అవార్డు అందుకోనున్నారు. తెలంగాణ నుంచి భారత్ బయోటెక్ అధినేత, కోవాగ్జిన్ సృష్టికర్త కృష్ణ ఎల్లా ఆయన సతీమణి సుచిత్రా ఎల్లా ఉమ్మడిగా పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, సింగర్ సోనూ నిగమ్, కళా రంగానికి సంబంధించి తెలంగాణకు చెందిన దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, పద్మజా రెడ్డిలను పద్మశ్రీకి ఎంపికయ్యారు. సాహిత్యం,విద్య రంగానికి సంబంధించి ఏపీ నుంచి గరికపాటి నర్సింహారావు, గోసవీడు షైక్ హుస్సేన్, మెడిసిన్ రంగంలో డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావులను పద్మశ్రీ వరించింది. ఏప్రిల్ లో రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో వీరందరికీ పురస్కారాలు అందజేయనున్నారు.