న్యూఢిల్లీ: అన్ని రంగాల ఎగుమతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రెండు పథకాలకు గ్రీన్సిగ్నల్ఇచ్చింది. వీటికి రూ. 45 వేల కోట్లు కేటాయిస్తారు. ఎగుమతులు పెంచడంతోపాటు, ప్రపంచ మార్కెట్లలో దేశీయ వస్తువుల పోటీ పడేలా చేయడానికి ఇవి సాయపడతాయి. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్‌కు (ఈపీఎం) రూ. 25,060 కోట్లు, క్రెడిట్ గ్యారెంటీ పథకానికి రూ. 20 వేలు కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది.
ఈపీఎం ఎగుమతుల్లో పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుందని, ఎంఎస్ఎంఈలు, తొలిసారి ఎగుమతి చేసేవారికి, లేబర్ ఎక్కువగా అవసరముండే రంగాలకు సహాయపడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్నారు. క్రెడిట్ గ్యారెంటీ పథకంతో వ్యాపార కార్యకలాపాలు సులభంగా జరుగుతాయని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ పథకాలతో భారతదేశ ఎగుమతి రంగానికి కొత్త సపోర్ట్ సిస్టమ్ లభించిందని అన్నారు. క్రెడిట్ గ్యారెంటీ పథకం (సీజీఎస్ఈ) లిక్విడిటీని పెంచుతుందని, ఎంఎస్ఎంఈలకు మేలు చేస్తుందని, ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం దిశగా భారత్ పయనాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. ఫైనాన్స్,పాలనాపరమైన ఇబ్బందులు, బ్రాండింగ్ లోపాలు వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ రెండు పథకాలు సహాయపడతాయని ఎక్స్పర్టులు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు, తొలిసారి ఎగుమతి చేసేవారికి, శ్రమశక్తితో కూడిన రంగాలకు ఈ పథకాలు మేలు చేస్తాయన్నారు.
