గొర్రెల కాపరుల సొసైటీకి ఇచ్చిన భూమిని కాజేసిన్రు

గొర్రెల కాపరుల సొసైటీకి ఇచ్చిన భూమిని కాజేసిన్రు
  •     మేనేజ్​చేసేందుకు ఒక్కో మెంబర్ కు రూ.50 వేల చొప్పున 84 మందికి చెల్లింపు?
  •     కలెక్టర్​కు కొందరు సభ్యుల ఫిర్యాదు 
  •     బీసీ డెవలప్​మెంట్​ఆఫీసర్ విచారణ
  •     క్రిమినల్ కేసు పెట్టడానికి చర్యలు

యాదాద్రి, వెలుగు:  గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించడం కోసం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొల్లూరులో గొర్రెల కాపరుల సొసైటీకి సర్కారు ఇచ్చిన భూమిని కొందరు కాజేశారు. సొసైటీలోని ఇద్దరు మెంబర్లు ఈ వ్యవహారంపై ఈనెల మొదటి వారంలో కలెక్టర్​పమేలా సత్పతికి ఫిర్యాదు ఇచ్చారు. వెంటనే బీసీ డెవలప్​మెంట్​శాఖ విచారణ చేపట్టడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. 

ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన భూమి.. 

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు 2003-–04లో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో భాగంగా ‘కోటి వరాలు’  పేరుతో స్కీమ్స్​అమలు చేసింది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొల్లూరుకు చెందిన ‘శ్రీ మల్లికార్జున షీప్​బ్రీడింగ్​కో ఆపరేటీవ్​సొసైటీ’కి లక్ష రూపాయల బీసీ కార్పొరేషన్​ లోన్​ మంజూరు చేసింది. ఇందులో రూ.50 వేలు సబ్సిడీ ఇచ్చింది. అనంతరం గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.20 వేలకు ఎకరం చొప్పున ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని బీసీ కార్పొరేషన్​కు మార్టిగేజ్​ చేశారు. ఇందులో గొర్రెల కాపరులు తమ జీవాలకు మేత కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. 

రెండేండ్లుగా అమ్మకానికి..

యాదాద్రి జిల్లాలో రియల్​ఎస్టేట్​ బిజినెస్​పుంజుకోవడంతో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఎకరానికి రూ. 25 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పైగా ధర పలుకుతోంది. దీంతో సొసైటీలో మొత్తం 84 మంది మెంబర్లు ఉండగా అందులోని కొందరు మెంబర్లు ఈ ఐదెకరాల భూమిపై రెండేండ్ల కిందటే కన్నేశారు. కానీ సొసైటీ భూములు కొంటే ఇబ్బందులెదురవుతాయని చాలా మంది వెనకడుగు వేశారు. ఈ క్రమంలో సొసైటీలోని ఓ మెంబరే కొనేందుకు ముందుకొచ్చాడు. దీంతో భూమిని అమ్ముకోవడానికి సొసైటీలో తీర్మానం చేశారు. 

ఎకరానికి రూ.40 లక్షలు.. ఒక్కో మెంబర్​కు రూ. 50 వేలు?

ఎకరానికి రూ.40 లక్షల చొప్పున ఐదెకరాలకు రూ. 2 కోట్లు ఇవ్వడానికి ఒప్పంద కుదిరినట్టుగా సమాచారం. అనంతరం సొసైటీలో సభ్యులను మేనేజ్​ చేయడానికి ఒక్కొక్కరికీ రూ. 50 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సొసైటీలోని మొత్తం 84 మంది మెంబర్లకు ముందుగానే రూ. 42 లక్షలు చెల్లించినట్టుగా సమాచారం. ఈ క్రమంలో గతనెల 27న శ్రీ మల్లికార్జున షీప్​ బ్రీడింగ్​కో ఆపరేటీవ్​సొసైటీ పేరుతో ఉన్న  ఐదెకరాల భూమిని ఆలేరు తహసీల్​ ఆఫీస్​లో ఆ మెంబర్​కు రిజిస్ట్రేషన్​ చేస్తే, అందుకు సంబంధించిన పాస్​బుక్​ కూడా వచ్చినట్టుగా తెలిసింది. 

కలెక్టర్​కు ఫిర్యాదు

సొసైటీ మెంబర్ల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఇద్దరు సభ్యులు మార్చి మొదటివారంలో కలెక్టర్​ పమేలా సత్పతికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బీసీ డెవలప్​మెంట్​ఆఫీసర్​యాదయ్యను ఆదేశిం చారు. కొల్లూరు గ్రామంలో సొసైటీ మెంబర్లను, ఆలేరు రెవెన్యూ స్టాఫ్​ను కలిసి విచారణ చేపట్టిన ఆఫీసర్​నివేది కను కలెక్టర్​కు అందించారు. ఈ క్రమం లో సొసైటీ భూమి విక్రయంపై భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్​రెడ్డి  ఎంక్వరీ చేయనున్నారు. క్రిమినల్​చర్యలకు ఆఫీసర్లు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.