ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్,వెలుగు: గిరిజన గ్రామాలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్​ రూరల్ మండలం మామిడిగూడ, దర్లొద్ది తదితర గిరిజన గ్రామాలను పరిశీలించి మాట్లాడారు. రోడ్లు లేకపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. భారీ వర్షాలకు ఖరాబైన రోడ్లను రిపేర్​చేయలేని పరిస్థితి దాపురించిందన్నారు. అత్యవసర పరిస్థితిలో ఎటైనా పోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ గ్రామాలను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ మామిడి గూడ దార్లొద్ది వాన్వట్ గ్రామాల్లో కనీస వసతులు లేకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో లీడర్లు రాళ్లబండి మహేందర్, దయాకర్, చిత్రు పాటిల్, సేకు పాటిల్, దవలత్ తదితరులు పాల్గొన్నారు.

పోడు సర్వే నెలాఖరులోగా కంప్లీట్​ చేయాలి 

మంచిర్యాల/ఆసిఫాబాద్​,వెలుగు: పోడు భూముల సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ ఆదేశించారు. చీఫ్​ సెక్రటరీ సోమేశ్​ కుమార్​తో కలిసి శుక్రవారం హైదరాబాద్​ నుంచి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. సర్వేతో పాటు గ్రామ, డివిజన్, జిల్లా సభలు పూర్తిచేయాలన్నారు. కొత్తగా అటవీ భూముల ఆక్రమణలను అనుమతించరాదని, భవిష్యత్​లోనూ ఆక్రమణలు కాకుండా గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు. ధరణి పోర్టల్ ద్వారా 33 మాడ్యుల్స్​లో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్​భారతి హోళికేరి, అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్, డీఎఫ్​వో శివ్ ఆశిశ్​ సింగ్, ఆర్డీవోలు వేణు, శ్యామలాదేవి, డీపీవో నారాయణరావు పాల్గొన్నారు. ఆసిఫాబాద్​లో కలెక్టర్​రాహుల్​రాజ్,​ అడిషనల్​కలెక్టర్​చాహత్ బాజ్ పేయ్, ఎస్పీ మల్లారెడ్డి, డీఎఫ్​వో దినేశ్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమానికే యూరియాపై భారీ సబ్సిడీ

మంచిర్యాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం యూరియాపై భారీగా సబ్సిడీలు ఇస్తోందని బీజేపీ జిల్లా ఇన్​చార్జి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం హాజీపూర్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. విదేశాల నుంచి యూరియా దిగుమతి తగ్గించి స్వదేశంలో ఉత్పత్తి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలోని ఆరు ఫ్యాక్టరీని పునరుద్ధించారని తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని శనివారం జాతికి అంకితం చేయనున్నారని చెప్పారు. దీంతో దక్షిణ దేశంలో యూరియా కొరత పూర్తిగా తీరుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో యూరియా బస్తాపై 94 శాతం సబ్సిడీ ఇచ్చి రూ.240కే  రైతులకు అందిస్తోందని తెలిపారు. లెఫ్ట్​, టీఆర్​ఎస్​ నాయకులు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అసత్య ప్రచారాలను మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి, పెద్దపెల్లి పురుషోత్తం, మోటపలుకుల తిరుపతి, రజినీశ్​ జైన్, వెంకటరమణారావు, బియ్యాల సతీశ్​రావు, మడిపెల్లి సత్యం పాల్గొన్నారు.  

కేసీఆర్​ హామీలపై నిలదీయండి...  

అంతకుముందు రఘునాథ్​రావు పార్టీ జిల్లా ఆఫీసులో ప్రెస్​మీట్​ నిర్వహించారు. వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులకు చిత్తశుద్ధి ఉంటే గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్​ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు. సింగరేణి కార్మికులకు 10వేల కొత్త క్వార్టర్లు, కాంట్రాక్ట్​ కార్మికుల రెగ్యులరైజేషన్​, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, వరద బాధితులకు ఆర్థిక సహాయంపై కేసీఆర్​ను ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ వేస్తున్న బిస్కట్లకు ఆశపడి మోదీ గో బ్యాక్ అనడం సిగ్గుచేటన్నారు.  

‘ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు ఇక సాగవు’

ఆదిలాబాద్,వెలుగు: ఆదిలాబాద్​ఎమ్మెల్యే జోగు రామ‌న్న అవినీతి, అక్రమాల‌పై బరాబ‌ర్ ప్రశ్నిస్తామని, బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేదిలేద‌ని బీజేపీ లీడర్​కంది శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిపై ఎమ్మెల్యేకు చిత్తశుద్ధిలేదన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధంకావాలన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలుకాలేదన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పేదల బతుకులు మారలేదన్నారు. 

అభివృద్ధి కోసమే ప్రధాని పర్యటన

నిర్మల్,వెలుగు: అభివృద్ధి కోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని బీజేపీ జిల్లా ఇన్​చార్జి మ్యాన మహేశ్ ​చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని ఎల్​ఈడీ స్క్రీన్​పై చూపిస్తామన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మీడియాతో మాట్లాడారు. మోడీ పర్యటనను రాజకీయం చేయొద్దన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, లీడర్లు డాక్టర్ మల్లికార్జున్​రెడ్డి, అలివేలు మంగ, కొరుపెల్లి శ్రావణ్ రెడ్డి, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ మహాసభలకు తపస్ లీడర్లు

నిర్మల్, వెలుగు: బెంగళూర్​లో 11, 12, 13 తేదీల్లో జరిగే అఖిల భారత మహాసభలకు  జిల్లాకు చెందిన తపస్ గౌరవాధ్యక్షుడు జి.రాజేశ్వర్, కార్యదర్శులు నవీన్ కుమార్, అజయ్, రాసమలు రాజేశ్వర్ తదితరులు వెళ్లారు. ఈ సభల్లో  విద్యారంగ సమస్యలు, మధ్యాహ్నం భోజనం. అల్పాహారం, జాతీయ విద్యావిధానం అమలు, పాఠ్య పుస్తక ప్రణాళికలో మార్పు, ప్రైమరీ స్కూల్​టీచర్లకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించడం తదితరాలపై చర్చించనున్నారు.

మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ఖానాపూర్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్​ఫండ్స్​తెచ్చి ఖానాపూర్ పట్టణం అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్​తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఐదో వార్డులో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులకు ఆమె భూమి పూజచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, కౌన్సిలర్లు పరిమిలత, కుర్మ శ్రీనివాస్, కావాలి సంతు, షబ్బీర్ పాషా, జన్నారపు శంకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

గిరి ఉత్పత్తుల కేంద్రం ప్రారంభం 

ఆదిలాబాద్,వెలుగు: ఆదిలాబాద్​ రైతుబజార్​లో శుక్రవారం గిరి ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఐటీడీపీవో వరుణ్​రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో గిరి ఉత్పత్తులను సామాన్యులకు అందించాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్, మంచిర్యాలలో కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం ఎల్కే రమణానందం, మార్కెటింగ్​ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.