నర్సింగ్ హోంల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం : హరీష్ రావు

నర్సింగ్ హోంల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం : హరీష్ రావు

నర్సింగ్ హోంల స్థాపనకు సింగిల్ విండో విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే పరిశ్రమల స్థాపనకు టీఎస్ఐపాస్ తెచ్చామని.. సింగిల్ విండో విధానంలో నర్సింగ్ హోంల స్థాపనకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తెలంగాణలో మూడు మెడికల్ కళాశాలకు అనుమతి రద్దు చేసిందని.. అడ్మిషన్లు పూర్తయ్యాక ఇలా చేస్తే అందులో చదువుతున్న వారి పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. 

బీబీనగర్ ఎయిమ్స్లో బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూం లేకున్నా పీజీ కోర్సులకు అనుమతి ఇచ్చారని.. కానీ రాష్ట్ర మెడికల్ కళాశాలల్లో మాత్రం నిబంధనల పేరిట ఎన్ఎంసీ ద్వంద్వ వైఖరి పాటిస్తోందని విమర్శించారు. జాతీయ మెడికల్ కళాశాలలకు ఒకరకం, రాష్ట్ర కళాశాలలకు మరో రకమైన పాలసీ ఎందుకని ప్రశ్నించారు. వన్ నేషన్, వన్ పాలసీ అంటే ఇదేనా అని నిలదీశారు. 

రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. 70 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో నిజామామాబాద్, ఆదిలాబాద్ లలో మాత్రమే కాలేజీలు ఏర్పాటు చేశారని విమర్శించారు. ఈ విద్యాసంవత్సరమే 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు. అన్ని సౌకర్యాలు ఉన్నా.. మంచిర్యాల మెడికల్ కాలేజీని ఎన్ఎంసీ రెజెక్ట్ చేసిందని మంత్రి తెలిపారు. రూ.500 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే అనుమతి ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.