దొంగచాటుగా వచ్చి ప్రాజెక్టు ట్రయల్​ రన్​ చేశారు

దొంగచాటుగా వచ్చి ప్రాజెక్టు ట్రయల్​ రన్​ చేశారు
  • మోటార్ ఆన్ చేసిన ఎమ్మెల్యే 
  • రిజర్వాయర్​లోకి మొదలైన పంపింగ్
  • పెండింగ్ పరిహారాలు చెల్లించాలని  నిర్వాసితుల డిమాండ్

సిద్దిపేట/కోహెడ్, వెలుగు: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ ఆదివారం రహస్యంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సతీశ్​కుమార్ రేగొండలోని పంప్ హౌజ్​లో మోటార్​ను ఆన్ చేసి అరగంట పాటు నీటిని రిజర్వాయర్ లోకి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే సతీశ్​కుమార్ తోపాటు టీఆర్ఎస్ లీడర్లు రిజర్వాయర్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. జూన్​లోనే ట్రయల్ నిర్వహణకు అధికారులు ప్రయత్నాలు చేసినా నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో వాయిదా వేశారు. చైనా నుంచి తెప్పించిన మోటార్లను జులై నెలాఖరు వరకు పరీక్షించకుంటే ఎక్స్పైరీ అవుతాయనే ఉద్దేశంతో ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. గుడాటిపల్లి వద్ద పెండింగ్ పరిహారాల కోసం నిర్వాసితులు ఆందోళనలు కొనసాగిస్తుండడంతో ట్రయల్ రన్ రహస్యంగా నిర్వహించారు. రేగొండ పంప్ హౌజ్ లో 32 మెగావాట్ల కెపాసిటీ కలిగిన మూడు మోటార్లను బిగించినప్పటికీ ఆదివారం ఒక్క మోటార్ ను మాత్రమే ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరో రెండు మోటార్లను పరీక్షించనున్నారు. ట్రయల్ రన్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక ఆటంకాలు ఎదురైనా ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశామని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. నెల రోజుల్లోగా  గౌరవెల్లి ప్రాజెక్టుపై వేసిన ఎన్జీటీ కేసును పరిష్కరించి మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని, 1.06 లక్షల  ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల వద్ద  కుర్చీ వేసుకొని పనులు పూర్తి చేయిస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి గౌరవెల్లి ట్రయల్ రన్ ప్రారంభించామన్నారు. ప్రాజెక్ట్ లోకి 365 రోజులూ నీటిని ఎత్తిపోస్తామని,  దేశంలోనే అత్యంత ఎక్కువ ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పథకంలో గౌరవెల్లి ప్రాజెక్టు అతి పెద్దదని వివరించారు. ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని, హుస్నాబాద్  నియోజకవర్గ ప్రజల తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఎమ్మెల్యేగా గెలిపించినందుకు చెప్పులతో కొట్టుకొని నిరసన

భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ దొంగచాటుగా వచ్చి ప్రాజెక్టు ట్రయల్​ రన్​చేశారని గుడాటిపల్లి నిర్వాసితులు ఆరోపించారు. ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ను గెలిపించినందుకు సర్పంచ్​బద్దం రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వాసితులు చెప్పులతో కొట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ న్యాయమైన పరిహారాల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపైనే కేసులు పెట్టి జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ట్రయల్ రన్ వల్ల నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రాజెక్ట్ చుట్టూ కాలువలు తవ్వకుండా కట్ట పనులు మొత్తం పూర్తి చేయకుండానే ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. నిర్వాసితులకు రావాల్సిన పరిహారాలు ఇవ్వకుండా, అటు నీళ్లు కూడా ఇవ్వకుండా నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ ఎమ్మెల్యే పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. పూర్తి పరిహారాలు అందేవరకు తమ నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు.