ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్​

ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్​
  •    పోలింగ్​ పర్వం.. సర్వం సిద్ధం
  •     ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 1.73 లక్షల మంది ఓటర్లు
  •     227 పోలింగ్ సెంటర్లు
  •     పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

హనుమకొండ/ వరంగల్/​ మహబూబాబాద్/ జనగామ/ ములుగు, వెలుగు: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు వేళయింది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, ఈ మేరకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఆదివారం ఎలక్ట్రోరల్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయగా, ఆఫీసర్లంతా పోలింగ్ కేంద్రాలకు తరిలారు. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించగా, అధికారులకు ప్రత్యేక సెలవు కూడా ప్రకటించారు.  

52 మంది అభ్యర్థులు.. 1,73,406 మంది ఓటర్లు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తంగా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్​ఎస్​ నుంచి ఏనుగుల రాకేశ్​రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి పోటీ చేస్తున్నారు. వారితో పాటు మరో 49 మంది రిజిస్టర్డ్ పార్టీల నేతలు, ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 1,73,406 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 1,08,349 మంది, మహిళలు 65,056 మంది, ఇతరులు ఒకరున్నారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లా పరిధి చేర్యాల సబ్ డివిజన్ లోని మద్దూరు, ధూళ్మిట్ట, కొమురవెల్లి, చేర్యాల మండలాల పరిధి కలిపి మొత్తంగా 227 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  

కేంద్రాలకు తరలిన సిబ్బంది..

వరంగల్ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్​ప్రాంగణం, హనుమకొండ జిల్లాకు సంబంధించిన కాకతీయ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఎలక్ట్రోరల్​ సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను పరిశీలించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి తగిన సూచనలిచ్చారు.మహబూబాబాద్ ఫాతిమా హైస్కూల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్​కుమార్​సింగ్ పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్​కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్, ఆర్డీవో  అలివేలు ఉన్నారు. 

జనగామ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్​ను కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ములుగు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీవో కె.స్యతపాల్​రెడ్డితో కలిసి పరిశీలించారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు ఏడు రూట్లలో సామగ్రిని తరలించినట్లు ఆమె తెలిపారు. 

వరంగల్​కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన 8 కౌంటర్ల ద్వారా 59 పోలింగ్‍ సెంటర్లు కావాల్సిన సామగ్రిని తరలించినట్లు కలెక్టర్​ప్రావీణ్య తెలిపారు. కాగా ఫారం 16, పీవో డైరీ పక్కాగా రాయాలని, ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం నమోదుపై సెక్టోరియల్ అధికారులు నివేదిక అందించాలని సిబ్బందిని కలెక్టర్లు ఆదేశించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలు

జిల్లా    పోలింగ్ స్టేషన్లు    పురుషులు    స్త్రీలు    మొత్తం
హనుమకొండ    67    25,739    17,990    43,729
వరంగల్    59    27,038    16,774    43,812
జనగామ    27    14,915    8,503(ఇతరులు 1)    23,419
మహబూబాబాద్    36    22,948    11,985    34,933
ములుగు    17    6,587    3,712    10,299
జయశంకర్    16    8,000    4,535    12,535
సిద్దిపేట
(చేర్యాల సబ్​డివిజన్)    05    3,122    1,557    4,679
మొత్తం    227    1,08,349    65,057    1,73,406