ధరణిలో విచిత్రం.. ఇతరులు ధరణి పేరుతో రూ.30 కోట్ల విలువైన భూమి రిజిస్ట్రేషన్

ధరణిలో విచిత్రం.. ఇతరులు ధరణి పేరుతో రూ.30 కోట్ల విలువైన భూమి రిజిస్ట్రేషన్
  •     విచిత్రమైన పేరుతో కరీంనగర్ జిల్లా బొమ్మకల్​లో 21.26 ఎకరాల భూమి
  •     విట్స్ కాలేజీ నిర్మించిన స్థలంలో  31 గుంటల అసైన్డ్ ల్యాండ్
  •     స్థలం విలువ రూ.30 కోట్లపైనే
  •     డేటా ఎంట్రీ మిస్టేక్ అంటున్న తహసీల్దార్

కరీంనగర్, వెలుగు : భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పులు..ధరణి పోర్టల్ లో కూడా కనిపిస్తున్నాయి. కొన్ని సర్వే నంబర్లలో పట్టాదారు కాలమ్​లో ఆ భూమితో సంబంధం లేని వ్యక్తుల పేర్లు కనిపిస్తుండగా..మరికొన్ని చోట్ల ఏ పేరు ఉండడం లేదు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ రెవెన్యూ విలేజ్​ పరిధిలో 8 సర్వే నంబర్లలో 21.2605 ఎకరాల భూమి ‘ఇతరులు ధరణి/ఇతరులు ధరణి’ పేరిట నమోదు కావడం ఆలస్యంగా వెలుగు చూసింది. 

పట్టాదారు పేరు దగ్గర ‘ఇతరులు ధరణి’ అని నమోదు కాగా, తండ్రి/భర్త పేరు దగ్గర ‘ఇతరులు 2/ ఇతరులు 2’ అని నమోదు కావడం రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ‘ధరణి’ అని పేర్కొనడాన్ని బట్టి చూస్తే ఈ వివరాలు భూరికార్డుల ప్రక్షాళన పూర్తయి ధరణి పోర్టల్ వచ్చాకే ఎంట్రీ చేసినట్లు తెలుస్తోంది.

విట్స్ కాలేజీ పేరిట కోట్లాది రూపాయల అసైన్డ్​ల్యాండ్​ 

ఉమ్మడి ఏపీలో పేదలు, దళితులు సాగు చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన లావుణీ పట్టాలు జిల్లాలో పక్కదారి పట్టాయి. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 721లోని కోట్లాది రూపాయల విలువైన అసైన్డ్ భూమి వివేకానంద ఎడ్యుకేషనల్ ట్రస్టు పేరిట నమోదైంది. పేదల చేతుల్లో ఉండాల్సిన ఈ భూమి ఓ విద్యాసంస్థ పేరిట రికార్డుల్లో నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

రెవెన్యూ రికార్డుల్లో లావుణీ పట్టాగా చూపుతున్న ఈ అసైన్డ్ భూమి ఎడ్యుకేషనల్ ట్రస్టు పేరు మీదికి ఎలా వచ్చింది? ఇంకా ఆ కాలేజీ నిర్మించిన స్థలంలో ఎంత విస్తీర్ణంలో సర్కార్ భూములు ఉన్నాయి? అనేది తేలాల్సి  ఉంది. అయితే రెవెన్యూ ఆఫీసర్లు మాత్రం అది డేటా ఎంట్రీలో జరిగిన తప్పు అని, ఆ సర్వే నంబర్ లో ప్రభుత్వ స్థలాలు లేవని చెప్తున్నారు. పాత పహాణీలైనా చూపండని అడిగితే.. బొమ్మకల్ రికార్డులేవి తమ దగ్గర లేవని, అన్ని భూరికార్డులు సీబీసీఐడీ ఆఫీసర్లు తీసుకెళ్లారని చెప్తున్నారు. 

ఆ ఇతరులు ఎవరో ? 

బొమ్మకల్ రెవెన్యూ విలేజీ పరిధిలో 60227 ఖాతా నంబర్ తో ‘ఇతరులు ధరణి/ ఇతరులు ధరణి’ అనే పట్టాదారు పేరిట నమోదైన 21.26 ఎకరాల భూమి అంతా ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోనే ఉన్నప్పటికీ.. అతను ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతానికి  ‘ఇతరులు ధరణి’ పేరిట పట్టాదారు పాస్ బుక్ జారీ కానప్పటికీ ఆధార్, ఈ–కేవైసీ మాత్రం పూర్తయినట్టు ధరణి పోర్టల్ లో కనిపిస్తోంది.  భూమి వివరాలకు వస్తే 23/1/G/3/2/2/2వ సర్వే నంబర్ లో 7.37 ఎకరాలు, 82/1/1 సర్వే నంబర్ లో 0.0275 ఎకరాలు,  123/C/3 లో 2.13 ఎకరాలు, 583B/3 లో 1 గుంట, 651/F/2లో 7 గుంటలు, 724/D/3/3/3/1/2 సర్వే నంబర్ లో 17 గుంటలు, 741/F/4/3 సర్వే నంబర్ లో 10.1025 ఎకరాలు, 771/H/3 సర్వే నంబర్ లో 18 గుంటలు నమోదై ఉంది.