7149 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు : సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్

7149 కేంద్రాల్లో  ధాన్యం కొనుగోళ్లు : సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్
  • ఇప్పటి వరకు 1.87 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నం
  • టాప్ ప్లేస్ లో నిజామాబాద్ 

హైదరాబాద్: రాష్ట్రంలో గత నెల 25నే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని రాష్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రైతులు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.  7149 కేంద్రాల్లో కలిపి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 2350 నుంచి 2900 వరకు ధాన్యం కొనుగోలు క్వింటాలుకు ధర పెట్టి కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. 

ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.  త్వరలోనే తాను ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించబోతున్నట్టు చెప్పారు.  జూన్ 30 వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు.  56 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  ధాన్యం కొనుగోలు తరువాత రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులు అందిస్తున్నామన్నారు. రైస్ మిల్లర్ల బకాయిలు మొదలు పెట్టామని... కొందరు మిల్లర్లు వసూళ్లకు భయపడి ఇతర దేశాలకు పారిపోయారన్నారు. మూడు నెలల్లో 6 వేల కోట్ల లోన్స్ తగ్గించామన్నారు. నిబంధనలు పాటించని మిల్లర్లపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.