
గ్రామ పంచాయతీలు తీవ్ర సమస్యలలో ఉన్నాయి. కానీ, ఏ ఒక్క సమస్యను తీర్చే పరిస్థితిలో సర్పంచులు, వార్డు మెంబర్లు లేరు. వారికి అధికారాలు లేవు. నిధులు లేవు. అంతా అధికారులే నిర్ణయిస్తారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు లేక, ఉన్నా విడుదల గాక అప్పులు చేసిన సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తరువాత పంచాయతీ రాజ్ చట్టం వచ్చింది. చర్చ లేకుండానే, సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో ముందస్తు సంప్రదింపులు చేయకుండా, శాసనసభలో కనీస చర్చ లేకుండా, వాదన లేకుండానే చట్టాన్ని ఆమోదించేశారు.
గ్రామాల ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణించింది. అయితే స్వావలంబన కలిగిన గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. పాలనకు వనరులు పన్నులు. పంచాయతీలకు ఈ ఆదాయం రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా గత 30 ఏండ్లలో టాక్సు నిర్వహణ, సేకరణ తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఫలితంగా, గ్రామాలు, స్థానిక మునిసిపాలిటీలకు ఆదాయం లేకుండా పోయింది. దీనిని అరికట్టడానికి రాజ్యాంగంలో సవరణ వచ్చింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలను దేశంలో మూడవ అంచె ప్రభుత్వాలుగా గుర్తించిన 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆర్థిక కమిషన్ పాత్ర విస్తరించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 (3) (bb), ఆర్టికల్ 280 (3) (c) ప్రకారం సంబంధిత రాష్ట్ర ఆర్థిక కమిషన్ల సిఫార్సుల ఆధారంగా పంచాయతీలు, మునిసిపాలిటీలకు వనరులు అందించే బాధ్యత ఈ కమిషన్ మీద ఉన్నది. అయితే రాష్ట్ర ఆర్థిక కమిషన్లు పని చేయడం లేదు. అవి ఉత్సవ విగ్రహాలుగా మారినాయి. రాజకీయ ఉద్యోగాలకు, ఐఏఎస్ అధికారులను దూరంగా పెట్టడానికి తప్పితే వీటి పాత్ర నామమాత్రం చేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ఆర్థిక కమిషన్ పని చేస్తున్నా, నిధుల సిఫారసులు చేస్తున్నా పంచాయతీలు, మునిసిపాలిటీలకు నిధులు అందించడం లేదు. కేంద్రం జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అవి ఆగిపోతున్నాయి. 2015–-20 మధ్య గ్రామాలకు తెలంగాణలో కేంద్ర ఆర్థిక కమిషన్ కేటాయించిన నిధులు రూ.5,375.28 కోట్లు మాత్రమే. ఈ అరకొర నిధులు కూడా గ్రామాలకు చేరలేదు. నిధులు లేక గ్రామీణ పారిశుధ్యం పడకేసింది.
గ్రామాలలో అధిక శాతం ఉత్పత్తి
గ్రామాలలో జీడీపీ లేదు కనుక ఆదాయం రాదు అని భావిస్తారు. కానీ, అన్ని రకాల ఉత్పత్తులు, సేవలు కూడా గ్రామాలలో జరుగుతున్నాయి. స్థూల అభివృద్ధి సూచికలో ఉండే అన్ని ప్రధాన రంగాలలో ఉత్పత్తి అధికశాతం గ్రామాల పరిధిలో జరుగుతున్నాయి. పంటలు, వ్యవసాయం, పాడి, మత్స్య, పశువులు నుంచి జరిగే లక్షల కోట్ల విలువ గల ఉత్పత్తి గ్రామాలలోనే జరుగుతున్నది. రాష్ట్ర ఆర్థిక పునాది వ్యవసాయం దాని అనుబంధ రంగాలే అని అనేకసార్లు రుజువు అయ్యింది.
2016-17లో వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, మత్స్య రంగాల ద్వారా రూ.83,285 కోట్ల ఆదాయం నమోదు కాగా 2020-–21కి అది రూ.1,76,486 కోట్లకు చేరింది. కానీ, గ్రామాలలో జరిగే ఈ ఉత్పత్తి నుంచి ఒక్క రూపాయి ఆదాయం కూడా గ్రామాలకు రాదు. అన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కైంకర్యం చేస్తాయి. మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రూ.4 వేల కోట్లు. మొత్తం మైనింగ్ రంగం స్థూల ఆదాయం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఉండవచ్చు. గ్రామాలలో మైనింగ్ వల్ల స్థానిక రోడ్లు, జల వనరులు, పొలాలు ధ్వంసం, గాలి కాలుష్యం పెరుగుతున్నది.
ఒక్క రూపాయి కూడా ఆయా గ్రామాలకు ఇవ్వరు. భారీ లారీలు కండ్ల ముందు నుంచే పోతాయి. ఖనిజాల మైనింగ్, ఇసుక, తదితర ఆర్థిక ఉత్పత్తి రంగాల నుంచి గ్రామాలకు రావాల్సిన వాటాలను కూడా ఇవ్వరు. చట్ట ప్రకారం మైనింగ్ సెస్సులో కొంతభాగం ఆయా గ్రామాల అభివృద్ధికి ఇవ్వాలి.
గ్రామసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి
పాటలలో, కవితలలో, బతుకమ్మ ఆడే మహిళల గొంతు నుంచి జాలువారే పల్లె వాతావరణం తిరిగి పునరుద్ధరించే ఆశ, హామీ ఈ ఎన్నికలలో ఆశించే అవకాశం ఉన్నది. బహుశా, బంగారు తెలంగాణ నినాదం మాదిరే తెలంగాణలో ప్రతి పల్లెలో ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు ఒక మేనిఫెస్టో ప్రకటించాలి. ఇది కొత్త ఆలోచన కాదు. ఇదివరకు కొందరు చేశారు. చూపించారు. గ్రామాల మధ్య, గ్రామాలకు ప్రజా రవాణా సౌకర్యాలు పెంచాలి.
జాతీయ, రాష్ట్ర రహదారుల వల్ల హక్కులు కోల్పోయిన బాధిత గ్రామాలకు స్థానిక, సమగ్ర పరిష్కారాల అవసరం ఎంతైనా ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ మధ్య జీఎస్టీ పన్నులను పంచుకున్నతీరులో పంచాయతీరాజ్ వ్యవస్థకు కూడా పంచాలి. ప్రతి గ్రామంలో రూపాయి రాక, పోక లెక్కలు పంచాయతీ ఆఫీసులో వెయ్యాలి. ప్రతి గ్రామంలో ప్రతి ఏటా ఆర్థిక, వనరుల బడ్జెట్ తయారుచేసి గ్రామసభలో ప్రవేశపెట్టాలి. గ్రామ సచివాలయం మంచి ఆలోచన. గ్రామస్తులే దీనిని నిర్వహించుకుంటే ఇంకా బాగుంటుంది.
గ్రామీణ ఆర్థిక వనరుల దోపిడీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ఆర్థిక వనరులను దోచుకుంటున్నాయి. రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ విస్తరణకు 2012లో ఏకపక్షంగా హెచ్ఎండీఎ పరిధి 7,527 చదరపు కిలోమీటర్లకు పెంచి, నిర్మాణాల అనుమతులకు వచ్చే ఆదాయం 849 గ్రామ పంచాయతీల నుంచి గుంజుకున్నరు. ఇప్పుడు ఈ సంస్థ పరిధి ఇంకా భారీగా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. పోయిన సంవత్సరం ఒకేరోజు 26 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేసింది.
ఇండ్లు కట్టుకున్నా, లేఔట్ చేసినా ఫీజు రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. స్థానిక సంస్థలకు ఈ నిధులు కూడా రావు. మిషన్ భగీరథలాంటి కేంద్రీకృత నీటి సరఫరా పథకం వల్ల గ్రామాలకు చేరింది ఏమీ లేకపోవడం ఒక ఎత్తు అయితే.. అనేక గ్రామాలలో ఉన్న నీటి సరఫరా వ్యవస్థను నాశనం చేశారు. గ్రామాలలో విద్య, వైద్యం మృగ్యం. రాష్ట్రమంతటా 12 వేలకు పైగా గ్రామాలు ఉంటే కేవలం 600 ప్రాథమిక వైద్య కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల మీద వందల కోట్లు పెట్టుబడి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి కనీస ప్రణాళికలు లేవు.
అసంపూర్తిగా జిల్లా పాలనా వ్యవస్థ
ఇప్పటివరకు జిల్లాలు 10 నుంచి 33 అయినాయి. జిల్లాల సంఖ్య పెరిగినా జిల్లా పాలనా వ్యవస్థ ఇంకా అసంపూర్తిగానే ఉన్నది. అనేక విషయాలలో పాత జిల్లాల ప్రాతిపదికన పాలన సాగిస్తున్నారు. కార్యాలయాలు పూర్తిగా లేవు. ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియదు. జిల్లా కలెక్టర్ కార్యాలయాలే ఇప్పుడిప్పుడు ఒక రూపానికి వస్తున్నాయి. ఒక పార్లమెంటు సభ్యుడు ఎన్ని జిల్లా పరిషత్ సమావేశాలకు వెళ్ళాలి వంటి అంశాలు కూడా తేలలేదు.
ఎన్నికలు అయినాక వచ్చే వందల జిల్లా ప్రజాప్రతినిధులు, వేలల్లో మండల ప్రజా ప్రతినిధులు తమకు సీటు, ఓటు, ప్రొటోకాల్ గురించి రంధి పడటం ఒకటి కాగా వీరి ప్రాతినిధ్యం వలన ప్రజలకు ఒరిగేది ఏమిటి? గ్రామాలలో నిరుద్యోగం పెరుగుతున్నది. వ్యవసాయ కూలి కుటుంబాలకు పని దొరకడం లేదు. ఆదాయం సరిపోవడం లేదు. రైతులు పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు తట్టుకోలేకపోతున్నారు. దాదాపు 90 శాతం గ్రామాలలో అనారోగ్యం ప్రబలుతోంది. పని దొరకక గ్రామీణ వలసలు పెరిగాయి. ప్రాథమిక విద్య సదుపాయాలు అందుబాటులో లేవు. ప్లాస్టిక్ చెత్త పేరుకుపోతున్నది.
డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్