ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​ టౌన్​, వెలుగు:  పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 నుంచి రూ.19,500 కు  వేతనాలు పెంచాలని డిమాండ్​ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మెదక్​ కలెక్టరేట్​ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ట్రెజరర్​నర్సమ్మ, పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఆసిఫ్ మాట్లాడుతూ.. మున్సిపల్​ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్- 60 ప్రకారం వేతనాలను పెంచి అమలు చేస్తోందని.. పంచాయతీ కార్మికులు కూడా పీఆర్​సీని పెంచి వేతనాలివ్వాలని డిమాండ్​చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో సాయిరామ్​కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్,  ప్రవీణ్, సిద్ధిరాములు, కిషన్ యాదయ్య , రమేశ్, ఎల్లయ్య, నవీన్, నర్సింహులు, రాజయ్య, యాదగిరి, శ్యామల, పద్మారావు,  చంద్రం పాల్గొన్నారు.

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు

సదాశివపేట, వెలుగు: ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను సీఎం కేసీఆర్​అప్పుల రాష్ట్రంగా మార్చారని, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్​ కుటుంబం దోచుకున్న సొమ్మును కక్కించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్​ శ్రీనివాస్​ అన్నారు. సోమవారం సదాశివపేట పట్టణంలో ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’  బైక్ ర్యాలీ నిర్వహించారు. సోమవారం సదాశివపేట బస్టాండ్​వద్ద బీజేపీ జెండా ఆవిష్కరణలో శ్రీనివాస్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.  8 ఏండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి,  కుటుంబ పాలనకు తెలంగాణను వేదికగా మార్చిందని   విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా  అధ్యక్షుడు నరేందర్ రెడ్డి,  మెదక్ పార్లమెంట్ కో కన్వీనర్ సంగమేశ్వర్, జగిత్యాల జిల్లా ఇన్​చార్జి చంద్రశేఖర్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ నర్సారెడ్డి,  జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యరావు, జిల్లా కార్యదర్శి సార కృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ లీడర్ల విభేదాలు 

సంగారెడ్డి బీజేపీ లీడర్ల  మధ్య కొంత కాలంగా ఉన్న విభేదాలు ప్రజా గోస యాత్ర సందర్భంగా బహిర్గతమయ్యాయి. .  ఆదివారం మద్దికుంట చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కొంత మంది లీడర్ల ఫొటోలు లేకపోవడంపై ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. సోమవారం సదాశివపేట బస్టాండ్​ వద్ద జెండా ఎగురేవేసే కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్​చార్జి దేశ్​పాండే, సీనియర్​ నాయకులు వేణుమాధవ్​పరస్పర 
విమర్శలకు దిగారు. 

మహిళలు, విద్యార్థుల రక్షణకు షీ టీమ్స్

సిద్దిపేట రూరల్, వెలుగు: మహిళలు, విద్యార్థుల రక్షణ కోసం షీటీమ్స్ పోలీసులు కృషి చేస్తున్నారని, ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్ ఇన్​స్పెక్టర్​ఏబీ దుర్గ అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జడ్పీ హై స్కూల్ లో పిల్లలు, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, పోక్సో, బాల్య వివాహాలు, యాంటీ హ్యూమన్  ట్రాఫికింగ్ తదితర అంశాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా వెంబడించిన వెంటనే 100 కు గాని, సీపీ ఆఫీస్​ కంట్రోల్ రూమ్ 8333998699,  షీటీమ్ ​వాట్సప్ నెంబర్ 7901640473 లకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి, షీటీం డివిజన్ ఇన్​చార్జి ముజీబ్ హైమద్ పాల్గొన్నారు. 

రైతులకు న్యాయం చేయండి

సంగారెడ్డి టౌన్, వెలుగు: వంశపారంపర్యంగా వస్తున్న భూములను ఉన్నఫలంగా వక్ఫ్ బోర్డు భూములు అంటూ ఆగం చేయడం సరికాదని, క్షేత్రస్థాయి ఆధారాలను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు కోదండరామ్ రెడ్డి డిమాండ్​ చేశారు. సోమవారం సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలతో కలిసి కలెక్టర్ శరత్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్​2018లో ఆదరాబాదరగా కొత్త పాస్ బుక్​లు ఇచ్చి లక్షలాది మంది రైతులను ఆగం చేశారన్నారు. జహీరాబాద్ ప్రాంతాల్లోని పేద, సన్న చిన్నకారు రైతులకు ఇప్పటికీ కొత్త పాస్ బుక్​లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరణి వెబ్​సైట్​ తో భూములను విదేశీ కంపెనీల ద్వారా తన అనుయాయులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దీనిపై సీఎంకు లెటర్ ​రాసినా స్పందన లేదన్నారు. కలెక్టర్​కు పూర్తి ఆధారాలతో పట్టాదారుల క్లాజ్​లో ఉన్న వారి వివరాలతో నివేదిక అందజేశామని... 15 రోజుల్లోగా సత్వార్ గ్రామస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లీడర్లు జూలకంటి ఆంజనేయులు, జార్జ్, సంతోష్​,  రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సమైక్యతా వజ్రోత్సవాలను సక్సెస్ ​చేయాలి

మెదక్​ టౌన్​, వెలుగు: తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలను మెదక్​ జిల్లావ్యాప్తంగా సక్సెస్​చేయాలని కలెక్టర్​ హరీశ్​ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్​లో ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించనున్న  జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్​కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్​లతో కలిసి అధికారులతో రివ్యూ చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ సెప్టెంబర్ 16న  మెదక్,  నర్సాపూర్​ నియోజకవర్గాల్లో 15 వేల మందితో ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సెప్టెంబర్ 17 న  కలెక్టరేట్​లో జాతీయ పతాకావిష్కరణ, 18న కలెక్టరేట్​లోని ఆడిటోరియంలో కవి సమ్మేళనం, సాంస్కృతిక, సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ...  ట్రాఫిక్ అంతరాయం లేకుండా ర్యాలీ సాగేలా చూడాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్​వో వెంకటేశ్వర్​రావు, ఆర్డీవోలు సాయిరామ్​, వెంకట ఉపేందర్ రెడ్డి, డీఎస్పీలు సైదులు, యాదగిరిరెడ్డి, జడ్పీ సీఈవో వెంకట శైలేష్​,  డీఈవో రమేశ్​కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

భవిష్యత్​ పిల్లలదే..

మెదక్​ టౌన్​, వెలుగు:  భవిష్యత్​ పిల్లలదేనని.. వారి భద్రత, రక్షణ, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్​ హరీశ్​ అన్నారు.  జిల్లాలో చేపట్టిన స్వచ్ఛ గురుకులం సక్సెస్​అయిందని, ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్నారు. సోమవారం జిల్లాలోని గురుకులాల  హెచ్ఎంలతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ​మాట్లాడుతూ రోజువారీగా నిర్దేశించిన  మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం, స్నాక్స్, పండ్లు అందించాలన్నారు.  

వంట గదిలో తాజా కూరగాయలను షెల్ఫ్ లలో భద్రపరచకుండా కింద  పోయడం వల్ల  బొద్దింకలు, బల్లులు, ఇతర కీటకాలు చేరి  ఫుడ్​పాయిజన్​ అయ్యే అవకాశముందని కలెక్టర్​ పేర్కొన్నారు. ఇప్పటి నుంచి ప్రతి నెలా మండల ప్రత్యేకాధికారులు హాస్టళ్లను తనిఖీ  చేస్తారని, ఏవైనా లోటుపాట్లు ఉంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.  అనంతరం జిల్లాలోని సీడీపీవోలు, అంగన్​వాడీ సూపర్​వైజర్లతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. జిల్లాలో 5 ఏండ్ల లోపు  52,300 మంది ఉన్నారని, వారిలో 2,559 మంది తీవ్ర పోషణలోపంతో  బాధపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా పోషణ మాసోత్సవ పోస్టర్​ను కలెక్టర్​ ఆవిష్కరించారు. 

పెట్రోల్​లో నీళ్లు వచ్చాయంటూ బంక్​వద్ద ఆందోళన

కోహెడ(హుస్నాబాద్), వెలుగు: పెట్రోల్​లో నీళ్లు వచ్చాయంటూ ఓ బంక్​వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు.  సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని ఓ బంకులో లింగాల రమేశ్​అనే వ్యక్తి పెట్రోల్​ కొట్టించుకొని కొద్దిదూరం వెళ్లగానే బైక్​ ఆగిపోయింది. బైక్​నుంచి బాటిల్​లో పెట్రోల్​తీసి చూడగా కిందిభాగంలో నీరు కనిపించింది. దీంతో ఇతర వాహనదారులు కూడా వారి వాహనాల్లో పెట్రోల్​ చెక్​చేసుకోగా నీరు ఉన్నట్లు గుర్తించారు. అంతా కలిసి పెట్రోల్​బంక్​ఎదుట ఆందోళన చేశారు. ఈ విషయమై బంక్ యజమాని రెస్పాండ్​ కాలేదు. వర్షాలు పడుతున్నందున భూమి లోపల ట్యాంకులోకి నీరు చేరి ఉంటుందని బంక్  నిర్వాహకులు చెప్పారు. 

ఒకే పార్టీలో ఉంటూ గొడవలు పడొద్దు

తూప్రాన్, వెలుగు: రాజకీయాల్లో లీడర్లు అంతా కలిసి పనిచేయాలని.. ఒకే పార్టీలో ఉంటూ గొడవలు పెట్టుకోవద్దని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు అన్నారు. సోమవారం మనోహరాబాద్, తూప్రాన్ మండలంలో హన్మంత్​రావు పర్యటించారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తూప్రాన్  లోని  స్టాల్​వాల్ట్స్  యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడి నిమజ్జనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తూప్రాన్ మున్సిపల్  చైర్మన్  రవీందర్ గౌడ, స్టేట్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు  మహిపాల్ రెడ్డి మధ్య కొన్ని నెలలుగా సఖ్యత ఉండకపోవడం సరికాదన్నారు.  

ఒకే పార్టీలో ఉంటూ వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు తిట్టుకోవద్దన్నారు. తాను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు లేవని, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయన్నారు. ఇలా గొడవలు పెట్టుకోవడం వలన నాయకులు, కార్యకర్తలు  ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం వినాయకుడి పూజలో పాల్గొని,  చైర్మన్​ రవీందర్ గౌడ్, మహిపాల్ రెడ్డి లు  కలిసిమెలిసి ఉండాలని వారితో వినాయకుడి మీద ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో తూప్రాన్​ వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

ప్రజా సంగ్రామ యాత్రకు తరలిన నాయకులు

కోహెడ,వెలుగు: బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హుస్నాబాద్, కోహెడ మండలాల నుంచి నాయకులు తరలివెళ్లారు. సోమవారం యాత్రకు మద్దతుగా సంజయ్​తో కలిసి పాదయాత్ర చేసినట్లు తెలిపారు. వెళ్లిన వారిలో లీడర్లు జన్నపురెడ్డి సురేందర్​రెడ్డి, వెంకటేశం, నర్సయ్య, సురేందర్, చంద్రశేఖర్​రెడ్డి, శ్రీనివాస్​, శంకర్​బాబు ఉన్నారు.

రెండు బైక్​లు ఢీకొని వృద్ధుడు మృతి

దుబ్బాక, వెలుగు: రెండు బైక్​లు ఢీకొని ఓ వృద్ధుడు చనిపోయాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం దుబ్బాక మున్సిపాలిటీ చెల్లాపూర్​ కు చెందిన సంగోజు బాలయ్య(75)  టౌన్ నుంచి టీవీఎస్​ ఎక్సెల్​పై ఇంటికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్​ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన బాలయ్యను దుబ్బాక హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేందర్​తెలిపారు.

బిల్లుల చెల్లింపులో జాప్యంపై నిరసన

పాపన్నపేట, వెలుగు: అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులో జాప్యంపై సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాపన్నపేట మండల పరిషత్​ జనరల్​ బాడీ మీటింగ్​ సోమవారం ఎంపీపీ చందన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండలంలో రూర్బన్ ఫండ్స్​పాటు, ఇతర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు తెలిపారు. ఇటు అభివృద్ధి పనులు బిల్లులు రాక, అటు గ్రామాల్లో పనులు చేయలేక రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందని పలువురు సర్పంచ్​లు వాపోయారు. ఎంపీపీ మాట్లాడుతూ బిల్లుల జాప్యం విషయాన్ని  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మీటింగ్​లో ఎంపీడీవో శ్రీనివాస్, ఏడుపాయల పాలక మండలి చైర్మన్ బాలాగౌడ్, వైస్ ఎంపీపీ విష్ణువర్దన్​ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు కుబేరుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అధికారులు పనితీరు మార్చుకోవాలి  

మెదక్​ (పెద్దశంకరంపేట), వెలుగు:  అధికారులు పనితీరు మార్చుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల పరిషత్​ జనరల్ బాడీ మీటింగ్​ జరిగింది. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి మీటింగ్​కు హాజరుకాకపోవడంపై ఎంపీపీ శ్రీనివాస్ తో పాటు, ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై డీఎంహెచ్​వోతో ఎంపీపీ ఫోన్​లో మాట్లాడారు. కమలాపూర్, చీలపల్లి, శివాయిపల్లి, మూసాపేట గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరారు. మీటింగ్​లో వైస్ ఎంపీపీ లక్ష్మీ,  రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సురేశ్​గౌడ్, ఎంపీడీవో రియాజుద్దీన్ పాల్గొన్నారు.

ఓటర్​కార్డుకు ఆధార్​లింకేజీని పూర్తి చేయాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: ఓటరు కార్డుకు ఆధార్ లింకేజీని రెండు వారాల్లోగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఓటరు నమోదు కార్యక్రమంపై స్వీప్ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపిక్ కార్డుకు ఆధార్ లింకేజీలో జిల్లా 60 శాతానికి పైగా పూర్తయి రాష్ట్రంలో ఫస్ట్​ప్లేస్​లో ఉందన్నారు. ఈ సందర్భంగా ఎపిక్​కార్డు ఆధార్ లింకేజీ, కొత్త ఓటర్ నమోదు పై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్వో చెన్నయ్య, డీఆర్డీవో గోపాలరావు, డీడబ్ల్యూవో రామ్ గోపాల్ రెడ్డి, డీఎంహెచ్​వో కాశీనాథ్, డీపీఆర్వో రవికుమార్, మెప్మా పీడీ హనుమంత రెడ్డి పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలపై చర్యలు తీసుకోవాలి.

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని అడిషనల్​కలెక్టర్ ముజామిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో జిల్లా అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు.. తదితర సమస్యలపై 63  వినతులు వచ్చాయన్నారు. 

ఈనెల 22న మెదక్​ జడ్పీ జనరల్​బాడీ మీటింగ్

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్​ను ఈనెల 22న కలెక్టరేట్​లోనిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో వెంకట శైలేశ్​సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్​పర్సన్​ హేమలత అధ్యక్షతన జరిగే సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారంతో  సకాలంలో హాజరు కావాలని కోరారు.  

చరిత్ర తెలుసుకునేందుకు నాణేలు కీలకం

సిద్దిపేట, వెలుగు: దేశ చరిత్ర తెలుసుకోవడంలో నాటి నాణేలు కీలక పాత్ర వహించాయని హైదరాబాద్​ మింట్ కాంపౌండ్ చీఫ్​ జనరల్ మేనేజర్ జ్యోతి ప్రకాశ్​ అన్నారు.  సోమవారం  సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో  ‘న్యూమిస్టిమాటిక్ అండ్ ఎగ్జిబిషన్ ’పై  రెండు రోజుల సెమినార్ ను ప్రారంభించి మాట్లాడారు. దక్కన్ పీఠభూమిలోని  సామ్రాజ్యాల చరిత్రను తెలుసుకోవడానికి నాణాలు ఎంతగానో తోడ్పడ్డాయని  వివరించారు.. ప్రాచీన నాణేల వల్ల దేశ భాష, సంస్కృతి, చిహ్నాలతో పాటు లోహాల గురించి  ఎన్నో విషయాలు తెలుస్తాయన్నారు. అడిషనల్ కలెక్టర్ ముజమిల్​​ ఖాన్, ప్రిన్సిపల్ సీహెచ్ ప్రసాద్ , వైస్ ప్రిన్సిపల్ హుస్సేన్ , అకాడమిక్ కోఆర్డినేటర్ సుదర్శనం పాల్గొన్నారు.  అనంతరం కాలేజీలో పాత నాణేలను ప్రదర్శించారు.

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్​ యూనియన్​ కొత్త కార్యవర్గం

మెదక్​ టౌన్​, వెలుగు : తెలంగాణ స్టేట్​ యునైటెడ్​ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్​ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) మెదక్​ జిల్లా కొత్త కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకొన్నారు. గౌరవ అధ్యక్షుడిగా మహేందర్​రెడ్డి, ప్రెసిడెంట్​గా నర్సింలు, జనరల్​ సెక్రటరీగా రవీంద్రప్రసాద్, ట్రెజరర్​గా రాజునాయక్​, శ్రీశైలంతో పాటు మరో 25 మందితో కమిటీని  ఎన్నుకున్నారు. మెదక్​ పట్టణంలోని కిషన్​ భవన్​లో జరిగిన కార్యక్రమంలో కార్యక్రమంలో యూనియన్ ( సీఐటీయూ) వైస్​ ప్రెసిడెంట్​ చంద్రారెడ్డి, కంపెనీ ప్రెసిడెంట్​ కాటం మధు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను నిర్వహించారు.