మళ్లీ సమ్మెలోకి గ్రామ పంచాయతీ కార్మికులు

మళ్లీ సమ్మెలోకి గ్రామ పంచాయతీ కార్మికులు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు మళ్లీ సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. గత నెల 8వ తేదీ వరకు రాష్ర్టంలో పని చేస్తున్న 43 వేల మంది కార్మికులు 33 రోజుల పాటు సమ్మె చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాపించే  టైమ్ లో కార్మికులు స్ట్రైక్ లో ఉంటే ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం రెండు సార్లు చర్చలకు పిలిచింది. పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో కార్మికులు సమ్మె విరమించారు. 

కానీ 45 రోజులు అవుతున్నా సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ప్రభుత్వ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు కనీసం చర్చలకు కూడా పిలవకపోవటంపై మండిపడుతున్నారు. రెగ్యులరైజ్​, కనీస వేతనాలు వంటి అంశాలు ఆర్థిక పరమైనవి కావటంతో సీఎంతో చర్చించి వారంలో పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమ్మె విరమణ టైమ్ లో హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు వాటిపై ఎలాంటి పురోగతి లేదని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2 నుంచి సమ్మె చేస్తున్నట్లు 8 సంఘాల గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. సమ్మె స్టార్ట్ అయ్యే వరకు మంత్రి తమను చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీలు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  

కొన్ని హామీలు పరిష్కారం 

ఇచ్చిన హామీలలో కొన్నింటిని ప్రభుత్వం పరిష్కరించింది. విధి నిర్వహణలో కార్మికుడు చనిపోతే దహన సంస్కారాలకు రూ.30 వేలు ఇవ్వాలని జేఏసీ కోరింది. ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తామని నిర్ణయించి, సర్క్యులర్ జారీ చేసింది. గతంలో రూ.5 వేలు ఇస్తుండగా దీనిని రూ.10 వేలకు పెంచింది. వీటిని కూడా జీపీ నిధుల నుంచే చెల్లించాలని పేర్కొంది. ఇక ఇన్సూరెన్స్ రూ.5 లక్షలపై కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రీమియం చెల్లింపు విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

45 రోజులైనాప్రభుత్వంలో చలనం లేదు  

సమ్మె విరమించి 45 రోజులు అవుతున్నా మా సమస్యలపై ప్రభుత్వంలో చలనం లేదు. ఒక్కసారి కూడా మంత్రి దయాకర్ రావు, హరీష్ రావు మమ్మల్ని చర్చలకు పిలవలేదు. కార్మికులను పర్మినెంట్ చేయటం, కనీస వేతనం వంటి సమస్యలపై సీఎం తో మాట్లాడి వారంలోగా పరిష్కరిస్తమని మంత్రులు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు పురోగతి లేదు. మా సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన లేనందుకే మళ్లీ సమ్మెబాట పడుతున్నాం.
- పాలడుగు భాస్కర్,  చైర్మన్, జీపీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ