కొత్త రేషన్ కార్డుకు రూ.400, పహానీకి రూ.2000.. అవినీతికి అడ్డాగా మోత్కూర్ తహసీల్దార్ కార్యాలయం

కొత్త రేషన్ కార్డుకు రూ.400,  పహానీకి రూ.2000..  అవినీతికి అడ్డాగా మోత్కూర్ తహసీల్దార్ కార్యాలయం

అవినీతి నిరోధక శాఖ ఎన్ని దాడులు చేసినా ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మారటం లేదు. చిన్న పనికి కూడా వందలు, వేలల్లో లంచాలు వసూలు చేస్తూ సమాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ ఎమ్మార్వో ఆఫీసు అవినీతికి అడ్డాగా మారింది. కొత్త రేషన్ కార్డు, పహానీ మొదలైన ఏ పనైనా వందల వేల్లల్లో సమర్పించుకుంటే తప్ప పని జరగటం లేదు. 

మోత్కూర్ తహసీల్దార్ కార్యాలయంలో క్యాష్ కానీ, ఫోన్ ద్వారా కానీ డబ్బులు ముట్టిన తర్వాతనే సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. అధికారుల ఆగడాలను వీడియో రికార్డు చేసి బయటపెట్టారు బాధితులు. సోమవారం (ఆగస్టు 25) డబ్బులు వసూలు చేస్తుండగా వీడియో తీశారు.  

కొత్త రేషన్ కార్డుకు రూ.400, పహానీ నకలుకు రెండు వేల రూపాయలు  డిమాండు చేస్తుండటంతో.. ఫోన్ ద్వారా వీడియో రికార్డ్ చేశారు బాధితులు. ఫోన్ పే చేస్తుండగా వీడియో తీసి బయటపెట్టారు. డబ్బులు ఎవరెవరికి వెళ్తున్నాయో రికార్డు అసిస్టెంట్ల నుంచి డిప్యూటీ తహసిల్దార్ వరకు పేర్లు ప్రస్తావించాడు బాధితుడు .  అవినీతి అధికారులపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇదే ఆఫీసులో కళ్యాణ లక్ష్మీ పథకంలో  అక్రమ వసూళ్లకు పాల్పడిన ఆర్ఐని గతంలో సస్పెండ్ చేశారు. అయినా ఎమ్మార్వో కార్యాలయంలో అధికారుల తీరు మారటం లేదు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.