భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి నదికి ఆదివారం రాత్రి ఘనంగా హారతిని సమర్పించారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆధ్వర్యంలో అర్చకులు రామావఝ్జుల రవికుమార్ పర్యవేక్షణలో గోదావరి నది హారతి వేడుక వైభవంగా జరిగింది. అర్చకులు ముందుగా గోదావరి నదీ హారతి విశిష్టతను వివరించారు.
గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం, గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన, శ్రీరామ అష్టోత్తరం పఠించి ముందుగా సీతారామచంద్రస్వామికి 12 సార్లు హారతి ఇచ్చారు. అనంతరం గోదావరి నదికి 21 సార్లు హారతి సమర్పించారు. తర్వాత శాంతి మంత్రం పఠించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఈవో దామోదర్‌రావు కూడా పాల్గొన్నారు.
