ఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు

ఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
  • మార్మోగుతున్న గోవింద నామస్మరణ
  • పాల్గొన్న మినిస్టర్​ కమలాకర్, ఎంపీ బండి సంజయ్​

కరీంనగర్ టౌన్, వెలుగు: నమో వేంకటేశా.. నమో తిరుమలేశా.. అంటూ కరీంనగర్​పట్టణం మార్కెట్​రోడ్డులో ఉన్న వేంకటేశ్వర దేవాలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. శనివారం దేవాలయంలో వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏర్పాట్లను బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఉదయం ఆలయంలో యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, పూర్ణాహుతి, ధ్వజారోహణ, సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. రాత్రి వీధుల్లో బస్టాండ్ మీదుగా చంద్రప్రభ వాహనంలో స్వామి వారిని ఊరేగించారు. కరీంనగర్ సిటీ నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్ని మంత్రి భక్తులకు భోజనం వడ్డించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ ఏడాదిలోగా రాంనగర్ లోని 10 ఎకరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకుందామని, వచ్చేఏడాది బ్రహ్మోత్సవాలు అక్కడే జరుపుకుందామని తెలిపారు. అందుకు సంబంధించి నిధులను ఇప్పటికే సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు. తన శక్తి ఉన్నంత వరకు కరీంనగర్ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ సంజయ్.. 

వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఎంపీ బండి సంజయ్ పాల్గొని పూజలు చేశారు. అనంతరం స్వామివారు ఊరేగుతున్న చంద్రప్రభ పల్లకీని ఎంపీ మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారు అందరినీ చల్లగా చూడాలని కోరారు.

వైభవంగా రథ సప్తమి  

కోరుట్ల,వెలుగు: మండలకేంద్రంలో అతిపురాతన వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య ప్రభ వాహనంపై పురవీధుల గుండా వేంకటేశ్వరస్వామి  రథోత్సవం జరిపారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ నర్సయ్య, అర్చకులు నర్సింహాచారి, శ్రీనివాసాచారి, భక్తులు పాల్గొన్నారు.