ఉట్నూర్‌‌‌‌ మండలంలో చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ఉట్నూర్‌‌‌‌ మండలంలో చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ఆదిలాబాద్, వెలుగు : కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో అమ్మమ్మ, మనవడు చనిపోయారు. ఈ ప్రమాదం ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా ఉట్నూర్‌‌‌‌ మండలంలో సోమవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్‌‌‌‌ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ఈర్ల రాజు తన భార్య సృజన, కూతురు ఆద్య, కుమారుడు సహర్ష్‌‌‌‌ (14), అత్త గంట విజయ (55)తో కలిసి కారులో బెల్లంపల్లి నుంచి ఆదిలాబాద్‌‌‌‌కు వస్తున్నాడు. ఉట్నూర్‌‌‌‌ సమీపంలోని బీర్సాయిపేట గండిపోచమ్మ ఆలయం వద్దకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.

 ప్రమాదంలో సహర్ష్‌‌‌‌, విజయ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన రాజు, సృజన, ఆద్యను 108లో ఉట్నూర్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు, అక్కడి నుంచి ఆదిలాబాద్‌‌‌‌లోని రిమ్స్‌‌‌‌కు తరలించారు. ఆద్య పరిస్థితి సీరియస్‌‌‌‌గా ఉండడంతో నిజామాబాద్‌‌‌‌లోని ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేసుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.