
- మేడ్చల్ కు 28, హైదరాబాద్ కు 30, రంగారెడ్డికి 31 స్థానాలు
- 33వ స్థానంతో చిట్టచివరన నిలిచిన వికారాబాద్
హైదరాబాద్ సిటీ, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో గ్రేటర్ మళ్లీ డీలా పడింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్జిల్లాలు చివరి స్థానాల్లో నిలిచాయి. గతేడాదితో పోలిస్తే వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లో పాస్ పర్సంటేజ్ తగ్గింది. హైదరాబాద్ జిల్లాలో కాస్త పెరిగినా.. గతంలో సాధించిన స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో మొత్తం 1,72,817 మంది పరీక్షలు రాయగా, 1,53,692 మంది పాసయ్యారు. 88.93 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. పాస్ పర్సంటేజ్ పెంచేందుకు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు.
పాస్ పర్సంటేజ్ పెరిగినా..
హైదరాబాద్ జిల్లా ఏటా పాస్ పర్సంటేజ్ పెంచుకుంటున్నా రాష్ట్ర స్థాయిలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడం లేదు. 2022–-23లో 80.92 పాస్ పర్సంటేజ్ తో 28వ స్థానంలో నిలవగా, గతేడాది 86.76 శాతంతో 30వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది 79,911 మంది పరీక్షలు రాయగా, 65,436 మంది పాసయ్యారు. ఈసారి 88.53 శాతం పాసైనా మళ్లీ 30 స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. పదిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ అనుదీప్ పలు కార్యక్రమాలు చేపట్టారు. కాఫీ విత్ కలెక్టర్‌తో పాటు స్కూళ్లను రెగ్యులర్‌గా తనిఖీ చేయడం, షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవడం, తొందరగా రివిజన్ ప్రారంభించేలా టీచర్లను మోటివేట్చేశారు. కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాలేదు.
తీరు మారని రంగారెడ్డి..
రాష్ట్రంలో అత్యధిక స్కూళ్లు, కాలేజీలు ఉన్న జిల్లాగా పేరొందిన రంగారెడ్డి జిల్లా ఏటా తన స్థానాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. 2022–-23 లో 87.25 శాతం ఉత్తీర్ణతతో 20వ స్థానంలో నిలవగా, 2023–-24 లో 91.01 శాతంతో 24వ స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఈ ఏడాది 51,671 మంది పరీక్షలు రాయగా, 45,386 మంది పాస్‌అయ్యారు. దీంతో 87.84 శాతం ఉత్తీర్ణతతో 31వ స్థానానికి పడిపోయింది.
మేడ్చల్–మల్కాజిగిరి అంతంతే..
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా ఫలితాల తీరు రంగారెడ్డి జిల్లా మాదిరిగానే ఉంది. 2022-–23లో 90.72 శాతంతో 14వ స్థానంలో నిలవగా, గతేడాది 89.61 శాతంతో 27వ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది 47,235 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 42,870 మంది పాసయ్యారు. 90.76 శాతం ఉత్తీర్ణతతో 28వ స్థానానికి పడిపోయింది.
మళ్లీ చివరి స్థానంలోనే వికారాబాద్
సిటీకి 50 కి.మీ దూరంలో ఉండే వికారాబాద్ జిల్లా పది ఫలితాల్లో నిరాశజనక ఫలితాలు సాధిస్తున్నది. ప్రతిసారి చివరి స్థానంలోనే నిలుస్తున్నది. గతేడాది12,905 మంది పరీక్షలకు హాజరుకాగా 9,502 మంది మాత్రమే పాస్‌అయ్యారు. పాస్ పర్సంటేజ్ 65.10 శాతంగా నమోదైంది. ఈ ఏడాది 12,846 మంది పరీక్షలు రాయగా, 9,502 మంది మాత్రమే పాసయ్యారు. 73.97 ఉత్తీర్ణత శాతంతో 33వ స్థానంలో నిలిచింది. అయితే గతేడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజ్ 8.87 శాతం పెరగడం విశేషం.
ఎప్పటిలాగే అమ్మాయిలదే హవా..
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పది ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. హైదరాబాద్ జిల్లాలో 37,906 మంది అమ్మాయిలు పది పరీక్షలకు హాజరుకాగా, 34,634 మంది పాస్ అయ్యారు. 36,005 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 30802 మంది అబ్బాయిలు పాసయ్యారు. అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 91.37 ఉండగా, అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 85.55 శాతంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలోనూ అమ్మాయిలదే హవా నడిచింది. 27,013 మంది అబ్బాయిలు, 24,658 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 23,281 మంది అబ్బాయిలు, 22,105 అమ్మాయిలు పాసయ్యారు. అబ్బాయిలు పాస్ పర్సంటేజ్ 86.18 ఉండగా, అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 89.65 శాతంగా ఉంది.
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోనూ అమ్మాయిల హవానే కనిపించింది. 24,487 మంది అబ్బాయిలు, 22,748 అమ్మాయిలు పరీక్షలు రాయగా, 21,808 మంది అబ్బాయిలు, 21,062 మంది అమ్మాయిలు పాసయ్యారు. అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 89.06 శాతం ఉండగా, అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 92.59 శాతం నమోదయింది. ఇక చివరి స్థానంలో ఉన్న వికారాబాద్ జిల్లాలోనూ అమ్మాయిలే ముందున్నారు. అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 69.77గా ఉండగా, అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 78.14గా ఉంది.