క్యాబ్​ డ్రైవర్ల చూపు.. ఐటీ కంపెనీల వైపు

క్యాబ్​ డ్రైవర్ల చూపు.. ఐటీ కంపెనీల వైపు

ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతుండడంతో పెరిగిన డిమాండ్

హైదరాబాద్, వెలుగు : ఐటీ కంపెనీలు ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతుండడంతో గ్రేటర్​లోని క్యాబ్​లకు డిమాండ్ ఏర్పడింది. అవసరాన్ని బట్టి తీసుకుంటుండడంతో కార్లను పెట్టేందుకు డ్రైవర్లు కూడా పోటీ పడుతున్నారు. కరోనాకు ముందు ఐటీ సెక్టార్‌ పరిధిలో 36 వేల క్యాబ్‌లు హైరింగ్‌లో ఉండేవి. వీటిలోనే ఐటీ ఎంప్లాయీస్​ ఆఫీసులకు వెళ్లి వచ్చేవారు. కరోనా ఎంటర్​అయ్యాక ఆఫీసులు క్లోజ్​అవడం, వర్క్​ఫ్రమ్​హోమ్ పెట్టడంతో అన్ని కంపెనీలు క్యాబ్​లను తొలగించాయి. లాక్​డౌన్ ఎత్తేశాక కేవలం కొన్ని మాత్రమే ఓపెన్​అయ్యాయి. వాటిలోనూ పదుల సంఖ్యలోనే క్యాబ్​లు నడిచాయి. సెప్టెంబర్ నుంచి ఒక్కొక్కటిగా కంపెనీలు ఓపెన్​అవుతున్నాయి.

ప్రస్తుతం వాటి పరిధిలో10 వేల వరకు క్యాబ్​లు నడుస్తున్నాయి. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగగా, ఉబర్, ఓలా సంస్థలు కమీషన్ ఎక్కువ తీసుకుని డ్రైవర్లకు తక్కువ ఇస్తున్నాయని క్యాబ్​ డ్రైవర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఐటీ కంపెనీల నుంచి పిలుపు రావడంతో వాటిలో తిప్పేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఐటీ సెక్టార్ లో క్యాబ్​లను కిలోమీటర్ లెక్కన, షీట్ లెక్కన, నెలవారీగా పెట్టుకుంటున్నారు. కరోనాకి ముందు ఏ కంపెనీలో క్యాబ్​లను నడిపారో.. డ్రైవర్లు తిరిగి అదే కంపెనీల్లోకి వెళ్తున్నారు. కంపెనీలు కూడా ముందు పనిచేసిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి.  

కిలో మీటరుకి రూ.15 – 20
ఐటీ కంపెనీల్లో క్యాబ్​లకు వివిధ రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచాయి. పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ వర్క్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కిలోమీటరుకు రూ.15 నుంచి రూ.20 ఇస్తుండగా, షీట్ లెక్కన ఒక్కో డ్రాప్, పికప్​కి రూ.700 నుంచి రూ.800 ఇస్తున్నాయి. అలాగే నెలకి 22 రోజులు పనిచేసే ప్యాకేజీ ఉంది. ఇందుకుగాను రూ.51 వేలు ఇస్తున్నాయి. డీజిల్, పెట్రోలు పోను నెలకి రూ.30 వేలకుపైన మిగులుతున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. ఐటీ కంపెనీల్లో రిస్క్ ఉండదని, డైలీ100 నుంచి 150 కిలోమీటర్లు తిరిగితే చాలని అంటున్నారు. అంతకు మించి తిరిగితే అదనంగా చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఉబర్, ఓలాలో నడిపితే  30 శాతం కమీషన్ తీసుకుంటూ, డ్రైవర్లకు కిలోమీటర్​కి రూ.10 నుంచి 12 రూపాయలు మాత్రమే ఇస్తున్నాయని అంటున్నారు. 

వచ్చే నెల నాటికి డబుల్
అక్టోబర్ ​నెలాఖరుకు ఐటీ కంపెనీల్లో క్యాబ్​ల సంఖ్య డబుల్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఓపెన్ అయిన కంపెనీలు 30 నుంచి 50 శాతం ఎంప్లాయీస్​తో నడుస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో కొన్ని కంపెనీలు వంద శాతం మందిని ఆఫీసులకు రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో ఉన్న 10 వేల క్యాబ్​లకు మరో 10 వేలు యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారానికి 5 రోజులు ఐటీ కంపెనీల్లో క్యాబ్​లను నడిపిస్తూ, వీకెండ్​లో ఉబర్, ఓలాలో నడిపిస్తున్నట్లు కొందరు క్యాబ్​ డ్రైవర్లు చెబుతున్నారు.

మొన్ననే కారును ఐటీ కంపెనీలో పెట్టిన
నెల కిందటి వరకు నా కారును ఉబర్, ఓలాలో నడిపా. ఎక్కువ టైం పనిచేసినా కూడా బుకింగ్స్ పెద్దగా వచ్చేవి కాదు. ఐటీ కంపెనీలు ఓపెన్ కావడంతో డిమాండ్ ​పెరిగింది. మొన్ననే నా కారును కూడా ఓ ఐటీ కంపెనీలో పెట్టా. వారానికి 5 రోజులు కంపెనీలో, మిగిలిన రెండ్రోజులు ఆన్ లైన్ బుక్కింగ్స్ తీసుకుని నడిపిస్తున్నా. ఆదాయం మంచిగుంది.
– గుడాడి సంతోష్ రెడ్డి, క్యాబ్ ఓనర్

సబ్సిడీపైన ఎలక్ట్రిక్ కార్లులు ఇప్పించాలి
కరోనాకి ముందు గ్రేటర్​లో లక్షా 25 వేల క్యాబ్​లు నడిచేవి. లాక్​డౌన్​టైంలో కిస్తీలు చెల్లించకపోవడంతో సగం కార్లను ఫైనాన్స్​కంపెనీలు తీసేసుకున్నాయి. అలా ఉపాధి కోల్పోయిన వారందరిని గుర్తించి ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై కార్లు ఇప్పించాలి. బ్యాంకులు లోన్లు ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం స్పందిస్తే 60 వేల మందికి ఉపాధి కలుగుతుంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఓపెన్ అవుతుండడంతో క్యాబ్​లకు డిమాండ్ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల క్యాబ్ లు సిటీలో నడుస్తున్నాయి. 
 – షేక్ సలావుద్దీన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్