
హైదరాబాద్ : నిషేధిత కాల్షియం కార్బైడ్, ఎథిలిన్ పౌడర్ తో మామిడి పండ్లను మాగపెడుతున్న వ్యాపారుల గోడౌన్లపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గడిచిన 15 రోజుల్లో మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేశారు. ఇథిలిన్ పౌడర్ ప్యాకెట్స్ ను, మాగ పెట్టిన పండ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలువురు పండ్ల వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రసాయనాలు వాడి మామిడికాయలను మాగపెడుతున్నారు. రసాయనాలు విరివిగా వాడడం వల్ల మామిడి కాయలు త్వరగా పక్వానికి వస్తున్నాయి. ఇవే పండ్లను రోడ్లపై, మార్కెట్లలో అమ్ముతున్నారు వ్యాపారులు.
మామిడికాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు పలువురు వ్యాపారులు చట్ట విరుద్ధంగా ఎథిలిన్, క్యాల్షియం కార్బైడ్లను వినియోగిస్తున్నారని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ఇవి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాదాపూర్ జోన్ లో 3, రాజేంద్ర నగర్, బాలానగర్ జోన్ లో రెండు కేసులు, మేడ్చల్ జోన్ లో 4 కేసులు నమోదు చేశారు.
సమ్మర్ లో మామిడి పండ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. మార్కెట్, రోడ్లపై ఎక్కడ చూసినా అనేక రకాల జాతుల మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. పండ్ల రారాజుగా పేరొందిన మామిడి విషతుల్యంగా మారుతోంది. గతంలో పండ్లను సహజంగా పండించి మార్కెట్‌కు తరలించేవారు. ఇప్పుడు మాత్రం మార్కెట్‌లోకి వచ్చే కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వ్యాపారులు విరివిగా వినియోగిస్తున్నారు. వీటి వినియోగం వలన ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మామిడి పండ్లు మేలిమి పండులా కనిపించేందుకు పరిమితికి మించి కార్బైడ్‌ను వినియోగిస్తుండడంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పడంలేదు. పక్వానికి రాకముందే మార్కెట్‌కు తీసుకొచ్చి, మందులు మాకులతో వ్యాపారులు పండ్లను మాగబెడుతున్నారు. ఇదంతా తెలియక కొంటున్న జనం.. పండ్లు పచ్చిగా ఉంటున్నాయని లేదా అసలు రుచి ఉండటం లేదని చెబుతున్నారు. మరోవైపు నిషేధిత కార్బైడ్‌తో మాగబెడుతున్న వాటిని తింటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్‌ను వ్యాపారులు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
మామిడి కాయలను మగ్గబెట్టేందుకు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ లాంటి విష రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వీటివల్ల క్యాన్సర్ తోపాటు కిడ్నీ, లివర్ సమస్యలు తలెత్తే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్‌తో కృతిమంగా తయారు చేసిన పండ్లను తీసుకోవడం చాలా డేంజర్ అని, ఊబకాయం, గ్యాస్ర్టిక్ సమస్యలు వస్తాయని, మలబద్ధకం,చర్మ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. కెమికల్స్‌తో మాగబెట్టిన పండ్లను తింటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లేనని స్పష్టం చేస్తున్నారు.