
- 200 కోట్ల టన్నులకు పైనే నీరుగా మారింది
- తూర్పు గ్రీన్ లాండ్ లోని ఎక్కువ ఒత్తిడి ఉన్న గొయ్యి వల్లే
- భారీగా వేడిని లాగేసుకుంటున్న గొయ్యి
- 2012 రికార్డులు బద్దలుకొడుతుందంటున్న సైంటిస్టులు
- మొత్తం కరిగితే సముద్ర మట్టా లు 23 అడుగులు పెరుగుదల
- ఆపలేమంటున్న సైంటిస్టులు..తీర ప్రాంత జనాలకు నష్టం
గ్రీన్లాండ్.. ఓ మంచు దీవి. ఉత్తర అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల మధ్య ఉంటుందది. డెన్మార్క్ దేశంలో అంతర్భాగం. అలాంటి మంచు దీవి ఒక్క రోజులో 40 శాతం ఆవిరైపోయింది. 200 కోట్ల టన్నులకుపైగా మంచు గడ్డలు కరిగి పోయాయి. ఇప్పుడు ఇదే సైంటిస్టులను కలవరపెడుతోంది. జూన్ మధ్యలో ఇంతలా ఐస్ కరిగిన దాఖలాలు లేవని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. నిజానికి జూన్ నుంచి ఆగస్టు మధ్యలో గ్రీన్లాండ్ ఐస్ కరుగుతుందని, ఎక్కువగా జులై మధ్యలో మాత్రమే మంచు ఆవిరవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పుడు, జూన్ మధ్యలోనే ఇంత మంచు కరగడం మామూలు విషయం కాదంటున్నారు. ఆ మంచుతో అమెరికాలోని వాషింగ్టన్లో 3 కిలోమీటర్లకు పైనే విస్తరించి ఉన్న నేషనల్ మాల్ (పార్కు లాంటిది)ను కప్పేయొచ్చట. ఎంతలా అంటే ఆ పార్కులో ఉన్న 555 అడుగులు ఎత్తైన వాషింగ్టన్ మాన్యుమెంట్ (టవర్)కు 8 రెట్లు ఎక్కువ ఎత్తులో ఆ మంచు నిలబడుతుందట. అంటే మూడు కిలోమీటర్లు వైశాల్యంలో 4,440 అడుగుల ఎత్తైన మంచు కొండ అన్నమాట. గ్రీన్లాండ్లోని మొత్తం ఐస్ షీట్లు కరిగిపోతే భూమ్మీద ఉన్న సముద్ర మట్టాలు 23 అడుగులు పెరిగిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
ఊహించనిది.. ఆపలేనిది
ఇంతలా మంచు కరగడం ఎప్పుడూ ఊహించనిదని గ్రీన్లాండ్ ఐస్‌పై స్టడీ చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియా రీసెర్చ్ సైంటిస్ట్ థామస్ మోటే అన్నారు. అయినా కూడా ఆ కరగడాన్ని ఆపలేమని ఆందోళన వ్యక్తం చేశారు. 2012 జూన్‌లో చరిత్రలో తొలిసారి 97 శాతం మంచు మొత్తం కరిగిపోయిందని, ఇప్పుడూ అదే జరుగుతోందని అన్నారు. ఇప్పుడు వేసవి ప్రారంభంలోనే ఇంత మంచు కరిగిపోవడం వల్ల దాని ప్రభావం ఎండా కాలం తర్వాతా కొనసాగుతుందని చెబుతున్నారు. 2012 రికార్డును 2019 తుడిచిపెట్టేయడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. మామూలుగా మంచు తెల్లగా ఉండడం వల్ల సూర్యుడి కిరణాలు పడినా తిరిగి ఆకాశంలోకి వెళ్లిపోతాయని (పరావర్తనం), మంచు మొత్తం కరిగిపోవడం వల్ల ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని, నీళ్లు వేడిని గ్రహించుకుంటాయని చెప్పారు. దాని వల్ల మంచుపై మరింత ప్రభావం ఉంటుందని వివరించారు. కాబట్టి ఈ ఏడాది గ్రీన్లాండ్ మంచు కరగడంలో రికార్డు కొట్టేస్తుందన్నారు. గ్రీన్లాండ్లో భారీగా ఐస్ కరగడం ఖాయమని మేలోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ మంచు వాతావరణ నిపుణుడు జాసన్ బాక్స్ చెప్పారు. ఏప్రిల్‌లోనే మంచు కరగడం మొదలైందని, ఎప్పుడూ జరిగేదాని కన్నా మూడు వారాల ముందే అది ఎంటరైందని చెప్పారు.
ఎందుకంత స్పీడ్?
మంచు ఎందుకంత స్పీడ్‌గా కరుగుతోంది? అంటే స్థిరంగా కొనసాగుతున్న వాతావరణ మార్పులేనని మోటే చెబుతున్నారు. ‘‘గ్రీన్లాండ్ తూర్పు ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి (రిడ్జ్) మంచు కరగడానికి కారణమవుతోంది. దాని వల్లే ఏప్రిల్ నుంచే మంచు కరగడం మొదలైంది” అని చెప్పారు. సెంట్రల్ అట్లాంటిక్ నుంచి వేడిని, తేమను ఆ గొయ్యి లాగేస్తోందని, దానిని తిరిగి గ్రీన్లాండ్ మొత్తానికి వ్యాపింపజేస్తోందని చెప్పారు. దాని వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మంచు కరుగుతోందన్నారు. దాని వల్ల అధిక పీడనం ఏర్పడి మేఘాలు రావని, వర్షాలు కురవవని చెప్పారు. తూర్పు అమెరికా నుంచి మరో అధిక పీడనం (జూన్ ప్రారంభంలో ఆగ్నేయ అమెరికాలో వేడి బాగా ఉంది) గ్రీన్లాండ్వైపు రావడంతో గత రెండు వారాలుగా ఆ అధికపీడన గొయ్యి మరింత ప్రభావవంతమైందని చెప్పారు. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగి మంచు మొత్తం కరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రాల్లో నీటి మట్టాలు పెరుగుతాయని, తీర ప్రాంతాల్లోని జనాలకు తీరని నష్టం జరుగుతుందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా కనిపిస్తున్న సముద్ర మట్టాల పెరుగుదలలో గ్రీన్లాండ్ ఐస్దే పెద్ద వాటా అని చెప్పారు. 2007లో గ్రీన్లాండ్ ఐస్ కరగడంలో భారీ మార్పులు వచ్చాయని, 2010, 2012లో తీవ్రమైందని, ఇప్పుడు అది మరింత తీవ్ర రూపు దాల్చిందని వివరించారు. 1990లతో పోలిస్తే పరిస్థితి చేయి దాటిపోయిందన్నారు.
ఇదీ కరిగిపోయిన గ్రీన్లాండ్ ఐస్ చిత్రం. ఎరుపు రంగు మార్క్ చేసిన ప్రాంతమంతా మంచు కరిగిపోయింది. 1981–2010 మధ్య జూన్ టైంలో కరిగిన దానితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఎక్కువగా కరిగింది. అదీ ఒక్క రోజులోనే 40 శాతం.