డీజే సౌండ్ తట్టుకుకోలేక పెళ్లికొడుకు మృతి

డీజే  సౌండ్ తట్టుకుకోలేక పెళ్లికొడుకు మృతి

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్ఞాపకం. ఆ రోజున వధువరూలిద్దరూ ఎంతో సంతోషంగా గడపాలని కోరుకుంటారు. అయితే ఆనందోత్సాహాల మధ్య కళకళలాడుతున్న ఓ పెళ్లింట విషాదం నెలకొంది. డీజే సౌండ్ తట్టుకుకోలేక పెళ్లికొడుకు గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది.

బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో మణితార గ్రామానికి చెందిన సురేంద్రకుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఇందర్వాలో పెళ్లి జరుగుతోంది. దంపతులు దండలు మార్చుకున్నారు. సాంప్రదాయం ప్రకారం పూజలు చేశారు.  

అనంతరం పెళ్లి ఊరేగింపులో ప్లే అవుతున్న  డీజే  సౌండ్ ను  తగ్గించండంటూ పెళ్లికొడుకు సురేంద్రకుమార్ చాలాసార్లు  చెప్పాడు. అయినప్పటికీ అతని మాటను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఒక్కసారిగా వేదికపై సురేంద్రకుమార్ కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని వెంటనే చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే సురేంద్రకుమార్ మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే స్థానిక యంత్రాంగం డీజేపై కఠిన నిషేధం విధించింది. ఆయినప్పటికీ ఎవరూ కూడా దీనిని పట్టించుకోలేదు. సామాజిక కార్యకర్త డాక్టర్ రాజీవ్ కుమార్ మిశ్రా కూడా డీజే లపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని స్థానికులను కోరారు.