మేడారం మాస్టర్ ప్లాన్ కు అంకురార్పణ

మేడారం మాస్టర్  ప్లాన్ కు అంకురార్పణ
  • వనదేవతల గద్దెల పునర్నిర్మాణానికి భూమిపూజ

తాడ్వాయి, వెలుగు: మేడారం మహాజాతర మాస్టర్  ప్లాన్ అమలుకు అంకురార్పణ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో కలిసి మాస్టర్  ప్లాన్  ఏవీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా సోమవారం వనదేవతల గద్దెల వద్ద మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు, పూజారులతో కలిసి భూమిపూజ చేశారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరలో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.150 కోట్లు కేటాయించింది. 

కోటి మందికి పైగా భక్తులు మేడారం తరలివచ్చి వనదేవతలను దర్శనం చేసుకోనుండగా, మిగిలిన రోజుల్లోనూ భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఒకే వరుసలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. 

వంద రోజుల్లో గద్దెల పునర్నిర్మాణ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. గద్దెల ప్రాంగణంలో పనులు ప్రారంభించేందుకు మార్కింగ్  పూర్తి చేశారు. ఇందులో భాగంగానే సోమవారం దేవతలకు పూజారులు ప్రత్యేక పూజలు చేసి గద్దెల పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఈవో మేకల వీరస్వామి, పూజారులు పాల్గొన్నారు.