అచ్చంపేట, వెలుగు: వేరుశనగకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు శుక్రవారం అచ్చంపేట పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఇటీవల క్వింటాల్‌కు రూ.13 వేల వరకు ధర పలికిన వేరుశనగకు ప్రస్తుతం రూ.6 వేల వరకు మాత్రమే ధర నిర్ణయించడంపై రైతులు భగ్గుమన్నారు. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌కు పంటను అమ్మడానికి వచ్చిన రైతులకు వ్యాపారులు క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.7,200 వరకు మాత్రమే ధర చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారని, మార్కెట్ చైర్మన్ కూడా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సుమారు గంటపాటు కొనసాగిన ఆందోళనను రైతు నాయకుడు నాగరాజు సముదాయించి విరమింపజేశారు. అనంతరం రైతులను మార్కెట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. మార్కెట్ చైర్పర్సన్ రజిత మల్లేశ్, మార్కెట్ సెక్రటరీ నరసింహులతో రైతులు చర్చలు జరిపినా సఫలం కాలేదు. మద్దతు ధర కల్పించినప్పుడే పంటను విక్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు.
