భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్!

భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్!
  • గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా తగ్గిన లెవల్స్
  • వానలు పడకపోతే మే నెలలో కష్టాలు తప్పవంటున్న ఆఫీసర్లు
  • అత్యధికంగా శేరిలింగంపల్లిలో16.60 మీటర్లకు పడిపోయిన నీరు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి మూడు జిల్లాల్లో బోర్లు ఎండిపోతున్నాయి. వానలు పడకపోతే మే నెలలో సిటీతోపాటు శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. గతేడాది తక్కువ వర్షపాతం నమోదుకావడంతో భూగర్భజలాలు పడిపోవడానికి కారణమని గ్రౌండ్ వాటర్ విభాగం అధికారులు చెబుతున్నారు. గడిచిన రెండు, మూడేండ్లతో పోలిస్తే ఈసారి గ్రౌండ్ వాటర్ భారీగా తగ్గిందని అంటున్నారు. 

భూగర్భ జలాలు గతేడాది మార్చితో పోలిస్తే హైదరాబాద్ జిల్లాలో 1.13 మీటర్లు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 2.95 మీటర్లు కిందికి పడిపోయాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 3.68 మీటర్లు తగ్గాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లిలో 16.60 మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 9.78, హయత్ నగర్ లో 6.62 మీటర్ల లోతుకి గ్రౌండ్ వాటర్ పడిపోయింది. మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లిలో 10.46, కూకట్ పల్లిలో 6.90 మీటర్లు, హైదరాబాద్ జిల్లాలోని ఆసిఫ్​నగర్ లో 5.08, సైదాబాద్ లో 2.53 మీటర్లు, చార్మినార్ లో 2.34 మీటర్లు తగ్గాయి. వీటితోపాటు రాజేంద్రనగర్, బాలాపూర్, అబ్దుల్లాపూర్ మెట్, బాచుపల్లి, బాలానగర్, కాప్రా, ఉప్పల్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ తగ్గింది. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి ఎద్దడి కొనసాగుతోంది.

కోర్ సిటీలో కొంత బెటర్

రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజగిరి జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లాలో గ్రౌండ్ వాటర్ కాస్త బెటర్ గా ఉంది. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో పరిశీలించగా, అంతటా గ్రౌండ్ వాటర్ తగ్గింది. మేడ్చల్–మల్కాజిగిరిలోని 15 మండలాల్లో14 చోట్ల భూగర్భజలాలు పడిపోయాయి. ఒక్క అల్వాల్ మినహా అంతటా అడుగంటాయి. హైదరాబాద్ జిల్లాలోని 10 ప్రాంతాల్లో పరిశీలించగా, 5 చోట్ల మాత్రమే గ్రౌండ్ వాటర్ తగ్గింది. మాసబ్ ట్యాంక్, ఆసిఫ్ నగర్, బహదూర్ పురా, సైదాబాద్, చార్మినార్ ప్రాంతాల్లో గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి గ్రౌండ్ వాటర్ తగ్గినట్లు తేలింది. హుమాయున్ నగర్, చాంద్రాయణగుట్ట, నల్లకుంట, హిమాయత్ నగర్, నాంపల్లి ప్రాంతాల్లో 0.22 మీటర్ల నుంచి 4.65 మీటర్ల వరకు పెరిగింది. 

సగటున చూస్తే 1.13 మీటర్లు తగ్గినప్పటికీ ప్రాంతాల వారీగా చూస్తే కొన్నిచోట్ల భూగర్భ జలాలు పెరిగాయి. హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ ఎక్కువగా తగ్గకపోడానికి కారణాలు చాలా ఉన్నాయి. కోర్ సిటీలో ప్రధానంగా పెద్ద పెద్ద అపార్టమెంట్లు లేకపోవడం, ఇండివిడ్యువల్ ఇండ్లకు వాటర్​బోర్డు నుంచి సరఫరా జరుగుతుండడంతో బోరు వాటర్​వినియోగం తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజగిరి జిల్లాల్లో అపార్టుమెంట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం గ్రౌండ్ వాటర్ తగ్గింది. విచ్చల విడిగా బోర్లు వేసి గ్రౌండ్ వాటర్ ని తోడేస్తుండటంతో ఈ సమస్య ఏర్పడుతుందని ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.  

శివారులో డిమాండ్

గ్రౌండ్ వాటర్ పడిపోవడంతో సిటీ శివారు ప్రాంతాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి ఏర్పడింది. కొన్నిప్రాంతాల్లో పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. కొందరికి ఇండ్ల కిరాయి కంటే ట్యాంకర్ల ఖర్చు భారంగా మారుతోందని వాపోతున్నారు. శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వాషింగ్ మెషీన్లు బంద్ చేయాలని, బట్టలు ఉతికిన నీటిని వాష్ రూమ్ లో వాడుకోవాలని ఇండ్ల ఓనర్లు కండిషన్స్ పెడుతున్నారు. లేదంటే ఇండ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. 

నిజాంపేట, బండ్లగూడ జాగీర్, మణికొండ, నార్సింగి, శేరిలింగంపల్లి, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ ఇటువంటి సమస్య చూడలేదని స్థానికులు చెబుతున్నారు. చుట్టపక్కల అపార్టుమెంట్ల నిర్మాణం పెరిగినప్పటి నుంచి బోర్లు ఎండుముఖం పట్టాయని అంటున్నారు. వాటర్ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నామని చెబుతున్నారు. వాటర్​బోర్డు ట్యాంకర్ కోసం ఐదారు రోజులు వేచి చూస్తున్నామని వివరిస్తున్నారు. 5 వేల లీటర్ల ప్రైవేట్​ట్యాంకర్​కు రూ.1,500 ఖర్చు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.