రాష్ట్రపతి చేతుల మీదుగా వీర్ చక్ర అందుకున్న అభినందన్

రాష్ట్రపతి చేతుల మీదుగా వీర్ చక్ర అందుకున్న అభినందన్

యుద్ధంలో వీరోచితంగా పోరాడి.. శత్రుదేశాలకు పట్టుబడినా.. ఏ మాత్రం బెదరకుండా దైర్యసాహసాలను ప్రదర్శించిన గ్రూప్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‎కు వీర్ చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్‎లో వీర్ చక్ర, శౌర్య పురస్కాల ప్రదానోత్సవం జరిగింది. ఉగ్రవాదుల దాడుల్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‎నాథ్ కోవింద్ పతకాలు అందజేశారు. వైమానిక దళ గ్రూప్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‎కు వీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు. బాలాకోట్ వైమానిక దాడుల్లో పాల్గొన్న అభినందన్.. పాకిస్తాన్‎కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేశాడు. యుద్ధ సమయాల్లో సాహసాలు ప్రదర్శించిన సైనికులకు భారత ప్రభుత్వం అత్యున్నత వీర్ చక్రతో సన్మానిస్తోంది. 

ప్రస్తుతం భారత సైన్యంలో సేవలందిస్తున్న అభినందన్ వర్ధమాన్.. బాలాకోట్ వైమానిక దాడుల్లో పాక్ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. 2018 ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ హోదాలో పాకిస్థాన్‎కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‎ను కూల్చేశారు. శత్రుదేశాలకు పట్టుబడిన సమయంలోనూ ఆయన అసాధారణ దైర్యసాహసాలు ప్రదర్శించారు.

అదేవిధంగా.. వివిధ ఆపరేషన్లలో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి, 200 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న మేజర్ విభూతి శంకర్‎కు శౌర్య చక్ర ప్రదానం చేశారు. ఈ అవార్డును ఆయన భార్య లెఫ్టినెంట్ నితికా కౌల్ అందుకున్నారు. జమ్మూకాశ్మీర్‎లో జరిగిన ఓ ఆపరేషన్‎లో పలువురు ఉగ్రవాదులను అంతమొందించి.. కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‎కు చెందిన సాపర్ ప్రకాశ్ జాదవ్‎కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన సతీమణి, తల్లి ఈ అవార్డును అందుకున్నారు.