నెలకో ఘటన వెలుగులోకి.. ముదురుతున్న వివాదం

నెలకో ఘటన వెలుగులోకి.. ముదురుతున్న వివాదం
  • అంతర్గత కుమ్ములాటలో సిబ్బంది
  • తూతూ మంత్రంగా చర్యలు 

సిద్దిపేట, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలోని సిబ్బంది మధ్య గ్రూపుల గొడవలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.  ఈ క్రమంలో నెలకో అవకతవక వెలుగులోకి వస్తుండటంతో ఇరువర్గాల  మధ్య వివాదం ముదురుతోంది. ఓ వైపు ఆలయ పాలక మండలి నియామకంపై సస్పెన్స్​ కొనసాగుతుండగా, మరోవైపు ఆలయ సిబ్బంది మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. ఏటా కోట్ల ఆదాయం వచ్చే ఆలయంలో ఈ తరహా వ్యవహారం భక్తులను నివ్వెరపొయ్యేలా చేస్తోంది. 

దారి మళ్లిన టీడీఎస్ వడ్డీ డబ్బులు!

ఆలయానికి రావాల్సిన టీడీఎస్ వడ్డీ డబ్బులు వేరొక అకౌంట్​లోకి దారి మళ్లిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దేవాలయ అకౌంట్​లో జమ కావాల్సిన టీడీఎస్​ వడ్డీ దాదాపు రూ.7 లక్షలు గతంలో ఈవోగా పనిచేసిన రామకృష్ణరావు వ్యక్తిగత అకౌంట్​లో జమ అయ్యింది. ఆలయానికి సంబంధించిన పాన్ కార్డు లేదని  చెబుతూ ఈవో పాన్ కార్డును బ్యాంకు అధికారులకు సమర్పించడంతో  ఆలయానికి రావాల్సిన వడ్డీ డబ్బులు అతడి అకౌంట్​లో జమ అయ్యింది. విషయాన్ని రామకృష్ణరావు అధికారులకు చెప్పడంతో విచారణ జరిపారు. ఈ  సమయంలో  దేవస్థాన నికర ఆదాయాన్ని తక్కువగా చూపి ప్రభుత్వానికి తక్కువ పన్నులు చెల్లించారనే విషయం వెల్లడైంది. దీంతో ఆలయ సూపరింటెండెంట్ కు ఈవో బాలాజీ  ఛార్జీ మెమో జారీ చేసి మూడు రోజుల్లో  సమాధానం ఇవ్వాలని కోరారు. ఇదిలా వుండగా ఆలయ సిబ్బందిలో గ్రూపు రాజకీయాల మూలంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

రశీదు పుస్తకాలు ఏమైనట్టు..? 

కొమురవెల్లి ఆలయ రుద్రాభిషేక రశీదు 10 పుస్తకాల మాయం ఇప్పటికీ  అంతుచిక్కని మిస్టరీగా మారింది. రెండు నెలల కింద ఈ విషయం బయటకొచ్చినా ఇప్పటి వరకు ఆ పుస్తకాలు ఏమయ్యాన్నది తేలకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దాదాపు రూ.2 లక్షల విలువైన ఈ పుస్తకాలు మాయం కావడంతో ఇద్దరు ఉద్యోగులకు మెమో జారీ చేశారు. అధికారులు వారి నుంచి రూ.25 వేలు జరిమానాను వసూలు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ అసలు రశీదు పుస్తకాలు మాయం కావడానికి కారణమేంటి? ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉందనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు అధికారుల తీరుపై 
మండిపడుతున్నారు. 

అంతర్గత కుమ్ములాటలతోనే కరపత్రాల విడుదల!

కొమురవెల్లి ఆలయంలో ఉద్యోగుల మధ్య అంతర్గత కుమ్ములాటల కారణంగానే ఇటీవల ఓ మాజీ చైర్మన్ అవినీతి ఇదిగో అంటూ రోడ్లపై కరపపత్రాలు దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది. ఆలయంలో పనిచేసే సిబ్బందిలో మాజీ చైర్మన్ కు కొందరు  మద్దతునిస్తుండగా,  మరి కొందరు అతడిని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రెండు గ్రూపులుగా విడిపోయి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటంతో పలు అవకతవకలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణా లోపంతో పాటు ఆలయ పాలక మండలి లేకపోవడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కమిటీ ఏర్పాటుపై ప్రతిష్టంభన

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పాలక మండలి ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడినట్టు తెలుస్తోంది.   ఆలయ పాలక మండలి లో మొత్తం 14 మంది సభ్యులకు గాను, ఇటీవల 85 దరఖాస్తు చేసుకున్నారు. పాలక మండలిలో అవకాశం కోసం పలువురు ఆశావహులు కొంత కాలంగా ఎవరికివారు పైరవీలు చేసుకుంటున్నారు. చైర్మన్ పదవి కోసం గీస భిక్షపతితో పాటు సిద్దిపేటకు చెందిన మర్పల్లి శ్రీనివాస్ గౌడ్ మధ్య తీవ్ర మైన పోటీ ఏర్పడింది. భిక్షపతికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మద్దతిస్తుండగా, శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి హరీశ్​రావు అండదండలున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగానే మంత్రి  మద్దతిస్తున్న  మర్పల్లి శ్రీనివాస్ గౌడ్ పేరు లేకుండా  చైర్మన్ గా గీస భిక్షపతితో పాటు మరో ఎనిమిది మంది పేర్ల తో ఉన్న జాబితాను ఇటీవలే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దేవాదాయ శాఖ అధికారులకు పంపినట్టు తెలిసింది. ఈ విషయం తెలియడంతో ముఖ్య నేత ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ఆ జాబితాను నిలిపివేయాలని ఆదేశించడంతో  దేవాదాయ శాఖ అధికారులు  ఆ లిస్టును పక్కన పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో  పాలక మండలి  చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోననే అంశం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే ఆలయ సిబ్బంది మధ్య గ్రూపు తగాదాలతో అవకతవకల విషయం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండగా ఇదే సమయంలో చైర్మన్ పదవి విషయంపై ప్రతిష్టంభన నెలకొనడం పాలన వ్యవహారాలకు ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమాలకు పాల్పడితే చర్యలు

కొమురవెల్లి ఆలయ సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో పలు ఘటనలతో సంబంధం ఉన్న సిబ్బందికి ఇంక్రిమెంట్లు కట్ చేశాం. టీడీఎస్ వడ్డీ డబ్బులు మాజీ  ఈవో రామకృష్ణరావు అకౌంట్​లో జమైన విషయంపై ఆడిటర్ తో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తుండటమే కాకుండా సూపరింటెండెంట్​కు  మెమో జారీ అయ్యింది. దేవస్థానం వ్యవహారాల్లో  ఎలాంటి అవకతవకలు జరుగకుండా అన్ని విభాగాలపై దృష్టి సారించాం. - బాలాజీ,  ఆలయం ఈవో