కాంగ్రెస్​లో తారస్థాయికి గ్రూపు రాజకీయాలు

కాంగ్రెస్​లో తారస్థాయికి గ్రూపు రాజకీయాలు

మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్​లో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. జిల్లాలోని సీనియర్​ లీడర్లు టీపీసీసీ చీఫ్​ రేవంత్​ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనంతటికి మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్​సాగర్​రావు ఒంటెత్తు పోకడలే కారణమని ఆరోపిస్తున్నారు. పదేండ్ల కిందట ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో చక్రం తిప్పిన ఆయన నేటికీ 'ఏక్​ నిరంజన్​'గా వ్యవహరించడాన్ని మిగతా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారంతా పీఎస్సార్​కు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారు. అసలే ఇది ఎలక్షన్​ సీజన్​. నేతలంతా విభేదాలు మర్చిపోయి ఏకతాటిపై ముందుకు సాగాల్సిన సమయం. అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి గ్రూపు రాజకీయాలతో మరింత దిగజార్చుతున్నారని ఆ పార్టీ కేడర్​​ వాపోతున్నారు. ఓవైపు కాంగ్రెస్​ బలోపేతం కోసం టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి రాష్ర్టంలో హాత్​ సే హాత్​ జోడో యాత్ర చేస్తుంటే... మరోవైపు జిల్లా నాయకులు ఎవరికి వారే అన్న తీరుగా రచ్చ చేయడం కార్యకర్తలకు, అభిమానులకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. 

కోవర్ట్​ పాలి'ట్రిక్స్​'​ రచ్చ....

జిల్లా కాంగ్రెస్​లో కోవర్ట్ పాలి'ట్రిక్స్​' రచ్చ ఆ పార్టీ కేడర్​​ను గందరగోళానికి గురిచేస్తోంది. రేవంత్​తో పీఎస్సార్​కు పొసగకపోవడంతో కొంతకాలంగా పార్టీ మారాలని యోచిస్తున్నారు. ప్రజల కోసం అవసరమైతే పార్టీ మారడానికి సిద్ధమేనని ఆయన గతంలో ప్రకటించారు. అంతేగాకుండా ఉమ్మడి జిల్లాలోని తన ఫాలోవర్స్​తో వేంపల్లిలో మీటింగ్​ పెట్టి రేవంత్​కు ఐదు డిమాండ్లతో అల్టిమేటం​ జారీచేశారు. ఉత్తర తెలంగాణలో కొత్త పార్టీ పెడుతానని హెచ్చరించారు. దీంతో పీఎస్సార్​ తీరుపై ఆయన వ్యతిరేక వర్గం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్లతో టచ్​లో ఉంటూ కోవర్ట్ పాలిటిక్స్​ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మంచిర్యాలలో తన సీటును కాపాడుకొంటూ మిగతా రెండు సెగ్మెంట్లలో కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకు వందల కోట్ల విలువైన భారీ డీల్ జరిగిందని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే సీనియర్లతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడని, పార్టీలోకి వలసలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 

ఆరోపణలకు బలం చేకూర్చేలా.... 

 పీఎస్సార్​ ధోరణి సైతం అందుకు బలం చేకూర్చేవిధంగా ఉండడం గమనార్హం. గతంలో జరిగిన మండల పరిషత్​, మున్సిపల్​ ఎలక్షన్లలో, లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ప్యాకేజీలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపించాయి. బెల్లంపల్లి, చెన్నూర్ ఎస్సీ, బోథ్​, ఆసిఫాబాద్​ ఎస్టీ రిజర్వుడ్​ సెగ్మెంట్లలో బలమైన లీడర్లు ఉన్నప్పటికీ అక్కడ తన అనుచరులే బరిలో ఉంటారని ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. గతంలో కాంగ్రెస్​ నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టిన వినోద్​ కిందటి ఎలక్షన్లలో ఏనుగు గుర్తుపై పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆయన తిరిగి సొంత గూటికి చేరి మరోసారి బెల్లంపల్లి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. కానీ పీఎస్సార్​ తన అనుచరుడైన చిలుముల శంకర్​ బరిలో ఉంటారని ప్రకటించారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సిట్టింగ్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​తో పొసగక కాంగ్రెస్​లో చేరారు. నల్లాల దంపతులను రేవంతే స్వయంగా ఢిల్లీ తీసుకెళ్లి ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పించారు. దీంతో చెన్నూర్​ కేడర్​​లో ఒక్కసారిగా జోష్​ కనిపించింది. కానీ... పీఎస్సార్​ ఆయనను పొమ్మనలేక పొగపెట్టి నాలుగు నెలల్లోనే సొంత గూటికి తరిమేశారన్న అపవాదు ఉంది. సుమన్​ అనుచరుడైన ఓ యువనేతను కాంగ్రెస్​లో చేర్చుకొని పెద్ద పీట వేయడంపైనా అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే చెన్నూర్​లో నూకల రమేష్​, ఆసిఫాబాద్​లో డాక్టర్​ గణేష్​ రాథోడ్​, బోథ్​లో డాక్టర్​ వెన్నెల అశోక్​లకే టికెట్లు అని పీఎస్సార్​ ప్రకటించడాన్ని అక్కడి ఆశావహులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్లలో ఒక్కరికీ బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎమ్మెల్యేలను ఢీకొనే సత్తా లేదని, కోవర్ట్​ పాలి'ట్రిక్స్​'లో 'డమ్మీ క్యాండిడేట్లు' అని రేవంత్​ వర్గం నేతలు వాదిస్తున్నారు. కాంగ్రెస్​లో క్యాండిడేట్లను ఏఐసీసీ డిసైడ్​ చేస్తుందని, ఎవరికి వారు ఇచ్చుకోవడానికి ఇవేమైనా సినిమా టికెట్లా? అని ఫైర్​ అవుతున్నారు.

వ్యతిరేక గ్రూపులుగా.... 

పీసీసీ చీఫ్​ రేవంత్​ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నట్లుగానే జిల్లా స్థాయిలో కూడా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్​బాబు గ్రూపులో ప్రేమ్​సాగర్​రావు కొనసాగుతున్నారు. మాజీ మంత్రి గడ్డం వినోద్​, పీసీసీ జనరల్​ సెక్రటరీ గోమాస శ్రీనివాస్​, సీనియర్​ లీడర్లు కేవీ.ప్రతాప్​, వంగల దయానంద్​,ఐఎన్​టీయూసీ ప్రెసిడెంట్​ జనక్​ప్రసాద్​, లక్సెట్టిపేట జడ్పీటీసీ మెంబర్ ముత్తె సత్తయ్య, బెల్లంపల్లి మాజీ జడ్పీటీసీ కారుకూరి రాంచందర్​ తదితరులు రేవంత్​ వర్గంలో ఉన్నారు. ఆ మధ్య పీఎస్సార్​, వినోద్​ కలిసినట్టే కనిపించినా వారిద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది. బెల్లంపల్లిలో వినోద్​కు వ్యతిరేకంగా పీఎస్సార్​ కుంపటి రగిలిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ సీటును ఆశిస్తున్న గోమాస శ్రీనివాస్​కు, పీఎస్సార్​కు మధ్య ఉప్పూ నిప్పు అన్నట్టుంది పరిస్థితి. ఇక కేవీ.ప్రతాప్​ డీసీసీ పగ్గాల కోసం ఎదురుచూస్తున్నారు. చాన్స్​ వస్తే మంచిర్యాల నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. వీళ్లంతా తరచూ రేవంత్​ను కలుస్తూ తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు ఆయన చెవిలో వేస్తున్నారని సమాచారం. రేవంత్​ ఆశీస్సులతోనే పీఎస్సార్​తో ఢీకొంటున్నారని సొంత పార్టీలో ప్రచారం జరుగుతుండడం గమనార్హం. 

విమర్శలు, భౌతిక దాడులు.... 

కాంగ్రెస్​లో పీఎస్సార్​ గ్రూప్​ వర్సెస్​ రేవంత్​ గ్రూప్​ అన్నట్టుగా పరిస్థితి మారింది. మొదటినుంచి కాంగ్రెస్​ జెండా మోస్తున్నానని, కష్టకాలంలో పార్టీని కాపాడుకున్నానని, వీళ్లంతా ఇంతకాలం ఎక్కడపోయారని పీఎస్సార్​ ప్రశ్నిస్తున్నారు. వాళ్లే కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తుండగా, కాదు ఆయనే కోవర్టని ఇతర నేతలు అంటున్నారు. ప్రేమ్​సాగర్​రావు తన భార్య సురేఖను రెండోసారి డీసీసీ చైర్మన్​ను చేసి ఆ పోస్టును అడ్డం పెట్టుకొని అందరిపైనా అజమాయిషీ చేస్తున్నాడని చెప్తున్నారు. డీసీసీకి సమాచారం లేదనే సాకుతో అనుచరులను తమపైకి ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. రైతు చైతన్య యాత్ర సందర్భంగా కలెక్టరేట్​ వద్ద రాజ్యసభ మాజీ ఎంపీ వీహెచ్​పై దాడి, ఇటీవల శ్రీరాంపూర్​లో గోమాస శ్రీనివాస్​ ర్యాలీపై దాడి, మొన్న బెల్లంపల్లిలో కేవీ.ప్రతాప్​పై దాడి వంటి ఘటనలను ప్రస్తావిస్తున్నారు. రెండు వర్గాల నాయకులు ప్రెస్​మీట్లు పెట్టి ఒకరినొకరు తిడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెంత దూరం వెళ్తుందోనని కేడర్​​లో ఆందోళన నెలకొంది.