బీఆర్ఎస్​ పార్టీలో జోరుగా గ్రూపు రాజకీయాలు

బీఆర్ఎస్​ పార్టీలో జోరుగా గ్రూపు రాజకీయాలు

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలోని ఎమ్మెల్యేలపై నాలుగేండ్లలో అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఇసుక, మట్టి దందాలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్​రెడ్డి పాత్రపై ప్రతిపక్ష నేత విజయరమణారెడ్డి పోరాడుతూ ఈ అంశాన్ని ప్రజల్లో చల్లారకుండా చూస్తున్నారు. దళితబంధు, డబుల్  ఇండ్లను అనుచరులకు ఇప్పించుకోవడం లాంటి ఆరోపణలు కూడా మనోహర్​రెడ్డి ప్రతిష్టను మసకబార్చాయి. ఇక ఆర్ఎఫ్​సీఎల్​లో ఉద్యోగాలను ఎమ్మెల్యే చందర్​అనుచరులు అమ్ముకున్నారని ఆరోపణలు రావడం, నలుగురు బాధితులు ఆత్మహత్యకు యత్నించడం, అందులో ఒకరు చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రూ.14 కోట్ల మేర వసూళ్లకు పాల్పడ్డారని తెలుస్తున్నా నేటికీ బాధితులకు  పైసలు వెనక్కి ఇప్పించకపోవడం చందర్​కు మైనస్​గా మారింది. ప్రజల్లో ఈ ఇద్దరి గ్రాఫ్​ పడిపోయినట్లు రూలింగ్​ పార్టీ సర్వేల్లో తేలడంతో  రెండు చోట్లా అసమ్మతి నేతలు  యాక్టివ్​ అయ్యారు. అటు మంథనిలో కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీధర్​బాబు స్థానికంగా ఉండకపోవడం, బీఆర్ఎస్ ​నుంచి పుట్టమధుకు, హైకమాండ్​కు గ్యాప్​ పెరగడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ నేత చందుపట్ల సునీల్​రెడ్డి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 

బీఆర్ఎస్​కు ప్రతికూలంగా మారనున్న కాళేశ్వరం 

పెద్దపల్లి జిల్లా తలాపునే గోదావరి ఉన్నా ప్రజలకు సాగు, తాగునీరు కరువైంది.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లాలో ప్రతి ఎకరా సాగవుతుందని చెప్పినా రామగిరి, ముత్తారం, మంథని మండలాల్లో 20వేల ఎకరాలకు యాసంగిలో  సాగునీరందడం లేదు.  ఇందుకోసం సరస్వతి బ్యారేజ్​ వద్ద పోతారం లిఫ్టు ఏర్పాటు చేయాలని రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదు. ఇది చాలదన్నట్లు ఏటా కాళేశ్వరం బ్యాక్​వాటర్​లో 20వేల ఎకరాలు నీటమునుగుతోంది. ఈ భూములను తీసుకునేందుకు, నష్టపరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారుకు చేతులు రావడం లేదు.  మంచిర్యాల–అంతర్గాం గోదావరి బ్రిడ్జికి నేటికీ మోక్షం కలగడం లేదు. పోడు, ఫారెస్ట్ – రెవెన్యూ భూములు పంచాయితీ ఎలాగూ ఉంది. రామగుండం నియోజకవర్గంలో సింగరేణి ఏరియాల్లో ఇండ్ల పట్టాలు, కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. పెద్దపల్లి నియోజవర్గంలోని గుంటిమడుగు రిజర్వాయర్ మొదలుకాలేదు.  పెద్దపల్లి పట్టణంలో ఇప్పటి వరకు భగీరథ స్కీం పూర్తికాకపోవడంతో జనం అరిగోసపడ్తున్నారు. డబుల్​ ఇండ్లు పూర్తికాకపోవడం కూడా బీఆర్ఎస్​కు ప్రతికూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

దాసరికి పోటీగా మరో ఇద్దరు.. 

అధిష్టానం చేయించిన సర్వేలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయినట్టు తేలడంతో ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి రెండు సార్లు గెలిచారు. మరో సారి బీఆర్ఎస్​తరఫున పోటీలో ఉంటానన్న నమ్మకంతో ఉండగా, మరో ఇద్దరు లీడర్లు నల్ల మనోహర్​రెడ్డి, బొద్దుల లక్ష్మణ్​ కూడా ​రేసులోకి వచ్చారు. వీరిద్దరూ కేటీఆర్​కు సన్నిహితులు కావడం గమనార్హం. బొద్దుల లక్ష్మణ్​పద్మశాలీ సంఘం రాష్ట్ర నాయకుడు కాగా, ఆయన సంఘం లీడర్లతో ఇటీవల కేటీఆర్​ను కలిశారు. పద్మశాలీలకు రెండు సీట్లివ్వాలని, అందులో పెద్దపల్లిని కన్సిడర్ చేయాలని వినతిపత్రం ఇచ్చారు. టికెట్​తనకే వస్తుందన్న ధీమాతో ప్రచారం చేసుకుంటున్నారు. నల్ల మనోహర్​రెడ్డి ఐదేండ్లుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుతున్నారు. మనోహర్​రెడ్డి పై వస్తున్న అవినీతి ఆరోపణలు వచ్చే ఎన్నికల్లో ఆయనకు నష్టం కలిగించే అవకాశం ఉంది. మానేరు ఇసుక దందా, మట్టి దందాలో ఎమ్మెల్యే ప్రధాన పాత్ర పోషించారని కాంగ్రెస్​ లీడర్​ విజయరమణారావు ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు డబుల్ ఇండ్లు ఎవరికీ ఇవ్వలేదు. దళితబంధు ను ఎమ్మెల్యే అనుచరులకే ఇప్పించుకున్నారన్న వార్తల నేపథ్యంలో దళితుల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. 

కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈసారి టికెట్ ​కోసం పోటీ పడే వారి సంఖ్య పెరిగిపోయింది. విజయరమణరావుతో పాటు గంట రాములు, ఈర్ల కొమురయ్య  టికెట్​ఆశిస్తున్నారు. రేవంత్​రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరున్న విజయరమణారావుకే టికెట్​వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడుగా నియామకమైన మక్కాన్​సింగ్​కు..విజయరమణారావు మధ్య సఖ్యత ఉండడంతో ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. బీజేపీ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్, గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎన్ఆర్ఐ గొట్టిముక్కుల సురేశ్​రెడ్డి టికెట్​ఆశిస్తున్నారు.  

కోరుకంటి మెడకు ​ఆర్ఎఫ్​సీఎల్ ఉద్యోగాల ఉచ్చు​

పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం రామగుండం. పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారి సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కూడా ఆయనే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆల్‌ ‌ఇండియా ఫార్వర్డ్‌ ‌బ్లాక్‌ ‌అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకంటి చందర్‌‌ గెలిచారు. వెంటనే టీఆర్ఎస్​లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అంతర్గాంలో ఐటీ పార్క్‌‌ ఏర్పాటు కాకపోవడం, ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో ఉద్యోగాలు పెట్టిస్తామని ఆయన అనుచరులు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు చందర్​ కు ప్రతికూలంగా మారాయి. నియోజకవర్గంలో అసమ్మతి సెగ కోరుకంటిని ఇబ్బంది పెడుతున్నది. బీఆర్‌‌ఎస్‌కే చెందిన పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, గోదావరిఖనికి చెందిన మాజీ కౌన్సిలర్‌‌, హమాలీ  కార్మిక సంఘ నాయకుడు పాతపెల్లి ఎల్లయ్య, సింగరేణిలో టీబీజీకేఎస్‌ ‌యూనియన్‌‌ జనరల్‌ ‌సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌ ‌కెంగెర్ల మల్లయ్య, పోలీస్‌ ‌హౌసింగ్​‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌కోలేటి దామోదర్‌, 26వ డివిజన్‌‌ కార్పొరేటర్‌‌, వ్యాపారవేత్త మంచికట్ల దయాకర్‌‌‌ వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం సీరియస్​గా ట్రై చేస్తున్నారు. వీరు ఎమ్మెల్యే చందర్‌‌లాగానే క్యాలెండర్లు ముద్రించి గనులపై, కార్మిక వాడల్లో పంచుతున్నారు. సంక్రాంతికి పోటాపోటీగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పుట్టిన రోజులు, పూజ కార్యక్రమాలు, అయ్యప్పలకు భిక్ష పెట్టడం, చావు కార్యక్రమాల్లో పాల్గొంటూ తాము పోటీలో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో చందర్​కు టికెట్ వచ్చే అవకాశం లేదని, ఒకవేళ పోటీ చేసినా గెలవడని అభిప్రాయపడుతున్నారు. 

కాంగ్రెస్‌‌ నుంచి రామగుండం టికెట్​ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌ ‌సింగ్‌ ‌రాజ్‌‌ ఠాకూర్‌ ‌ఆశిస్తున్నారు.  గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆయన మూడో స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో యాక్టివ్​గా ఉంటూ సమస్యలపై పోరాడుతున్నారనే పేరుంది. కాంగ్రెస్‌‌ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్‌‌టీయూసీకి సింగరేణిలో యూనియన్‌‌ లీడర్‌‌గా వ్యవహరిస్తున్న బి.జనక్‌‌ప్రసాద్‌‌ కూడా యూనియన్‌ ‌కోటాలో రామగుండం టికెట్​కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇదే పార్టీ నుంచి కాంగ్రెస్‌ ‌ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ప్రొటోకాల్‌‌ కమిటీ చైర్మన్‌‌, రామగుండం వాసి హర్కర వేణుగోపాల్‌‌రావు టికెట్​ ఆశిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌‌ లో గ్రూపులు తయారై ఎవరి కార్యక్రమాలను వారు నిర్వహించుకుంటున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌‌ సోమారపు సత్యనారాయణతో పాటు కార్మిక నాయకుడు, 2009లో పీఆర్‌‌పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సెకండ్‌‌ ప్లేస్‌‌లో నిలిచిన కౌశిక హరి టికెట్​రేసులో ఉన్నారు. తెలంగాణ లేబర్‌‌ పార్టీ అధ్యక్షుడు, గోదావరిఖనికి చెందిన హైకోర్టు అడ్వకేట్‌ ‌గొర్రె రమేశ్‌ ‌కూడా రామగుండం బరిలో తాను ఉంటానని ప్రకటించుకుని ప్రచారం చేస్తున్నారు.   

హైదరాబాద్​లోనే మంథని ఎమ్మెల్యే  

మంథని నియోజకవర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ ​ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్థానికంగా ఉండరని, ఎప్పటికీ హైదరాబాద్ లోనే ఉంటారనే ఆరోపణలున్నాయి. కేవలం కొంతమంది నాయకులకు మాత్రమే ఆయన టచ్ లో ఉంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్​ నుంచి జడ్పీ చైర్మన్​ పుట్ట మధు  టికెట్​ఆశిస్తున్నప్పటికీ సీనియర్ లీడర్​చల్లా నారాయణ రెడ్డి ఆయనకు పోటీగా నిలుస్తున్నారు. నారాయణరెడ్డి.. ఎంపీ సంతోష్ రావుకు సన్నిహితుడు కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. మరోవైపు ద్వితీయ శ్రేణి లీడర్ల ఆగడాలు, వర్గ పోరు మధుకు తలనొప్పిగా పరిణమించాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అడ్వొకేట్​వామన్ రావు దంపతుల హత్య కేసు లో పుట్ట మధు ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. పట్టపగలు నడి రోడ్డుపై జరిగిన ఈ హత్యతో మధుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయింది.  దీనిని హైకమాండ్ కూడా సీరియస్​గా తీసుకుంది. డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళిత బంధును తన అనుచరులకే ఇప్పించుకున్నాడని ప్రచారం జరగడంతో మధు కొంత ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గంలో వ్యక్తిగత ఎజెండాతో బహుజనవాదం  పేర కార్యక్రమాలు నిర్వహించడంపై బీఆర్ఎస్ ​కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్టీ టికెట్ ఇవ్వకపోతే సొంతంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన రెండ్ల సనత్ కుమార్, రాష్ట్ర లీడర్లు చందుపట్ల సునీల్ రెడ్డి మంథని నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. సునీల్ రెడ్డి ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. అమెరికాలో ఉద్యోగం వదులుకొని తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారుడని ప్రజల్లో సానుభూతి ఉంది.  ఇది తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.