జిల్లా నాయకత్వంలో గ్రూపు రాజకీయాలు

జిల్లా నాయకత్వంలో గ్రూపు రాజకీయాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డీసీసీ పదవి కోసం లీడర్లు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. ఎవరికి వారే పదవి దక్కించుకొనే ప్రయత్నాలు స్పీడప్ ​​చేశారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కొనసాగుతున్నారు. త్వరలో డీసీసీల మార్పు ఉంటుందనే ప్రచారంతో జిల్లాలోని కాంగ్రెస్​ నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు జిల్లా కాంగ్రెస్​లో మూడు గ్రూపులు ఉండడం, వేర్వేరుగా ప్రోగ్రామ్స్ చేస్తుండడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్ర స్థాయిలో పైరవీలు..

జిల్లాలోని చోటా మోటా నాయకులతో పాటు బడా లీడర్లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య రాష్ట్ర కమిటీలో ముఖ్యమైన పదవిలో ఉండడంతో ఆయనను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్​ అభ్యర్థులు నాలుగు చోట్ల, టీడీపీ అభ్యర్థి ఒక చోట గెలిచారు. టీఆర్ఎస్​కు ఒక్క స్థానం దక్కలేదు. ఇప్పుడు కూడా జిల్లాలో టీఆర్ఎస్​కు వ్యతిరేకత ఉందని పలు సర్వేలు వెల్లడించడంతో డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు మోత్కూరి ధర్మారావు, లక్కినేని సురేందర్, నాగ సీతారాములు, నల్లపు దుర్గాప్రసాద్, మంగీలాల్​ నాయక్​ వంటి వారు డీసీసీ రేసులో ఉన్నారు. సీనియర్​ నేత, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గం టికెట్​ఆశిస్తూ ఇక్కడే మకాం వేశారు. మరో నేత ఎడవల్లి కృష్ణ నిన్నటి వరకు డీసీసీ పదవి కోసం యత్నించగా, ఇప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్​ రేసులో ఉన్నారు. నాగ సీతారాములు ఎమ్మెల్యే టికెట్​తో పాటు డీసీసీ కోసం యత్నిస్తున్నారు. నీకు 
డీసీసీ.. నాకు ఎమ్మెల్యే సీటు.. అనేలా లక్కినేని సురేందర్, ఎడవల్లి కృష్ణ తెర వెనక ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, పోరిక బలరాం నాయక్, సీతక్క, ఉత్తమ్​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సంభాని చంద్రశేఖర్, రాములు నాయక్​ వంటి నాయకులతో సన్నిహితంగా ఉంటూ డీసీసీ పదవి దక్కించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంత మంది చోటా మోటా నాయకులు డీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు డీసీసీ పదవిలో తానే కొనసాగుతానని పొదెం వీరయ్య అనుచరులతో స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. 

నిత్యం గ్రూపుల లొల్లి..

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్​ కలిసి పోటీ చేశాయి. కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ గెలిచింది. అశ్వారావుపేటలో టీడీపీ గెలిచింది. అంతకుముందు ఎన్నికల్లోనూ కొత్తగూడెం సీటు మాత్రమే టీఆర్ఎస్​ గెలుచుకుంది. జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాల్సిన జిల్లా నేతలు గ్రూపు రాజకీయాలు చేయడం కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. కొత్తగూడెంలోని బస్టాండ్​ సెంటర్, రైటర్​ బస్తీ, విద్యానగర్​ కాలనీల్లో మూడు ఆఫీస్ లు ఉన్నాయి. జిల్లా నేతలు తమ పార్టీ ఆఫీస్​లలో ప్రోగ్రామ్స్​​నిర్వహిస్తుండడంతో ఏ ఆఫీస్​కు వెళ్తే ఎవరేమనుకుంటారోనని పలువురు కార్యకర్తలు వాపోతున్నారు. గ్రూపుల లొల్లితో మహిళా కాంగ్రెస్​ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు నాయకులెవరినీ పిలవడం లేదు. కొత్తగూడెంలో ఒకే ప్రోగ్రామ్​ను ఏ గ్రూప్​నకు ఆ గ్రూప్​ విడిగా చేయడం పట్ల కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

కేంద్ర వైఖరికి నిరసనగా ఇటీవల పోట్ల నాగేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు పక్కపక్కనే వేర్వేరుగా టెంట్లు వేసుకుని ఆందోళన చేశారు. ఈ విషయం తెలిసినా డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య సమన్వయం చేయడం లేదని పార్టీ శ్రేణులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అధ్యక్షుడిగా రెండున్నరేండ్లు పూర్తి చేసుకున్నా జిల్లా కమిటీ ఏర్పాటు చేయకపోవడంపై నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిపత్యాన్ని చూపించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా వ్యవహరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా మండలాల్లోనూ గ్రూపులు ఉండడం గమనార్హం.