సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో మండల కమిటీల చిచ్చు

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో  మండల కమిటీల చిచ్చు
  • ముఖ్య నేతలకు ఫిర్యాదుల వెల్లువ
  • డీసీసీ అధ్యక్షుడి తొలగింపునకు డిమాండ్
  • గాంధీ భవన్ ముందు సిద్దిపేట, గజ్వేల్ ​కాంగ్రెస్  నేతల  ధర్నా

సిద్దిపేట, వెలుగు : ఎన్నికల సమయంలో ఐక్యంగా ముందుకు సాగాల్సిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి.  మండల కమిటీల ఏర్పాటు ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలో మండల కాంగ్రెస్ పదవులు ఆశిస్తున్న వారు డీసీసీ అధ్యక్షుడి వ్యవహార శైలిని తప్పు బడుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మండల కమిటీలను ఇప్పటికే  ప్రకటించగా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల కమిటీలను ప్రకటించాల్సి వుంది. 

ఈ రెండు నియోజకవర్గాల్లో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి వర్గానికి చెందిన  వారికే పదవులు కట్టబెట్టారని ఆయన వ్యతిరేకవర్గం ఆరోపిస్తోంది. టీపీసీసీ నేడో, రేపో ఈ లిస్ట్​ను ప్రకటించనుడడంతో పదవులు ఆశిస్తున్న వారంతా గాంధీ భవన్​కు వెళ్లి నర్సారెడ్డిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ టికెట్లు ఆశిస్తున్న నేతలు మండల కమిటీల్లో తమకు అనుకూలమైన వారు కోరుకోవడంతో చిచ్చురగులుతోంది.  

సిద్దిపేట, గజ్వేల్ జాబితాలకు బ్రేక్

దీంతో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల మండల కమిటీ ప్రకటనకు బ్రేక్ పడింది. ఈ రెండు నియోజకవర్గాల్లో నర్సారెడ్డి మనుషుల పేర్లే ప్రతిపాదించారని  కొందరు నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సిద్దిపేట, గజ్వేల్ మండల కమిటీల ప్రకటను ఆపేలా వారు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. సిద్దిపేట నియోజకవర్గంలోని  నాలుగు మండలాలతో పాటు పట్టణ కమిటీలు పాత వాటినే కొనసాగించాలని నిర్ణయించారు. 

ఈ నిర్ణయాన్ని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అంగీకరించడంతో  టీపీసీసీ ఆమోదానికి పంపారు. ఇదే సమయంలో చిన్నకోడూరు మండల అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మీసం నాగరాజు పదవి దక్కే పరిస్థితి లేకపోవడంతో ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారు.  గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత జశ్వంత్ రెడ్డి కూడా కంప్లైంట్​ చేశారు. 

డీసీసీ అధ్యక్షుడు  నర్సారెడ్డి హఠావో..  సిద్దిపేట కాంగ్రెస్ బచావో!

‘డీసీసీ  అధ్యక్షుడు  నర్సారెడ్డి హఠావో.. సిద్దిపేట కాంగ్రెస్ బచావో’ అంటూ  సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన నేతలు శుక్రవారం గాంధీ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. చిన్నకోడూరు మండలానికి చెందిన మీసం నాగరాజు మద్దతుదారులతోపాటు గజ్వేల్ నుంచి వచ్చిన నేతలు గాంధీ భవన్ కు వద్ద ఆందోళన చేశారు. డీసీసీ  ప్రెసిడెంట్ నర్సారెడ్డి ని వెంటనే  పదవి నుంచి  తొలగించాలని డిమాండ్ చేస్తూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్, ముఖ్య నేత  మల్లు రవికి వినతి పత్రం అందజేసి ఎఐసీసీకి ఫిర్యాదు చేశారు.  

బీఆర్ఎ స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో  చేరిన తూముకుంట నర్సారెడ్డి కోవర్ట్ గా పని చేస్తూ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. నిన్న, మొన్నటి దాకా అంతర్గతంగా సాగిన గ్రూపు రాజకీయాలు ఇప్పుడు బహిర్గతం కావడంతో జిల్లాలోని పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. 

ఆయనపై ఆదినుంచి ఆరోపణలే!

డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గజ్వేల్ నుంచి పోటీ చేసిన నర్సారెడ్డి  కేసీఆర్ కు అమ్ముడు పోయి ప్రచారానికి దూరంగా ఉన్నాడని, కనీసం పోలింగ్ బూత్​ల్లో ఏజెంట్లను పెట్టకుండా కేసీఆర్ గెలుపునకు పరోక్షంగా సహకరించాడని ప్రత్యర్థి వర్గం ఆరోపణలు గుప్పిస్తూ వస్తోంది. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి నర్సారెడ్డి వ్యవహార తీరు అనుమానాస్పదంగా వుందని, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జడ్పీటీసీ టికెట్ల కేటాయించే విషయంలో  కాంగ్రెస్ పార్టీ లో ఉన్న వాళ్లకు కాకుండా బీఆర్ఎస్ నుంచి  పార్టీలోకి  వచ్చిన వారికి బీ ఫామ్ లు ఇవ్వడమే కాకుండా ప్రచారం చేయకపోవడంతో పార్టీకి నష్టం జరిగిందని  జిల్లా లీడర్లు రాష్ట్ర  నేతల దృష్టికి తీసుకెళ్లారు.