మీ బాల్కనీలో పూలకుండిలోనే వీటిని పెంచొచ్చు: నెలల తరబడి పండే 8 అద్భుతమైన మొక్కలు!

మీ బాల్కనీలో పూలకుండిలోనే వీటిని పెంచొచ్చు: నెలల తరబడి పండే 8 అద్భుతమైన మొక్కలు!

ఫ్రెష్‌గా ఉండే సలాడ్/  ఆకుకూరలు/ కూరగాయలు  తినాలంటే ప్రతిసారీ బజారుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల మొక్కలను ఏడాది పొడవునా మన ఇంటి బాల్కనీలోనే ఫ్రెష్ ఆకుకూరలను, కూరగాయలను పెంచుకోవచ్చు. ఇందులో ఉండే గొప్ప విషయం ఏంటంటే.. ఈ మొక్కలను ఒకసారి కోసినా కూడా అవి మళ్లీ మళ్లీ పెరుగుతూనే ఉంటాయి. స్థలం తక్కువగా ఉన్న బాల్కనీల్లో చిన్న కుండీలలో వీటిని చాలా ఈజీగా పెంచొచ్చు. సలాడ్ ఇష్టపడేవారికి బాగా ఉపయోగపడే ఈ మొక్కలు ఏంటో ఇప్పుడు చూద్దామా.....

లెట్యూస్
ఇంట్లో సలాడ్స్ పెంచాలనుకునే వారికి మొదటగా గుర్తుకొచ్చే   లెట్యూస్. దీనివల్ల పెద్ద లాభం ఏంటంటే.. ఈ మొక్కను ఒకసారి కోసి పారేయాల్సిన అవసరం లేదు. చుట్టూ ఉన్న బయటి ఆకులను మాత్రం కోసుకుని, మధ్య భాగాన్ని అలాగే వదిలేస్తే చాలు.. అది మళ్లీ కొత్త ఆకులతో చక్కగా పెరుగుతుంది. ఇది తక్కువ స్థలంలో, చిన్న కుండీల్లో కూడా చాలా వేగంగా పెరుగుతుంది.

 పాలకూర 
సలాడ్లలో పాలకూరను వాడటం చాలా మంచిది. ఇందులో ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూర చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. ఎన్నిసార్లు కోసినా మళ్లీ మళ్లీ చిగురిస్తుంది. బాల్కనీలో కాస్త ఎండ, కాస్త నీడ ఉన్నా కూడా ఇది కుండీల్లో సులభంగా బ్రతుకుతుంది. దీన్ని సలాడ్స్‌లోనే కాకుండా జ్యూస్‌లలో, వంటల్లో కూడా వాడుకోవచ్చు.

 రాకెట్ & కేల్ (Rocket & Kale) 
ఈ రెండు ఆకుకూరల్లో పోషకాలు చాలా ఎక్కువ. 'రాకెట్' ఆకులు సలాడ్‌కు కాస్త ఘాటైన రుచిని ఇస్తే, 'కేల్' ఆకులు మంచి ఫైబర్ (పీచుపదార్థం), విటమిన్లను ఇస్తాయి. ఈ మొక్కల బయటి ఆకులను కోసుకుంటూ ఉంటే, లోపలి నుండి కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. బాల్కనీ తోటకి ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి.

 కొత్తిమీర & పార్స్లీ (Coriander & Parsley)
మనం తినే సాదాసీదా సలాడ్లకు మంచి రుచిని, సువాసనను, రంగును ఇవ్వడానికి ఇవి బాగా పనికొస్తాయి. వీటిని కుండీల్లో సులభంగా పెంచవచ్చు. అయితే ఒక చిన్న చిట్కా.. ఈ మొక్కలు ఎప్పుడూ చక్కగా పెరగాలంటే, కోసేటప్పుడు మొక్కలో సగానికి కంటే ఎక్కువ భాగం కత్తిరించకూడదు. కొన్ని కొమ్మలను మాత్రమే కోస్తే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.

ఉల్లికాడలు & సెలెరీ (Spring Onions & Celery)  
సలాడ్ తినేటప్పుడు కరకరలాడుతూ తగలాలంటే ఉల్లికాడలు, సెలెరీ ఉండాల్సిందే. ముఖ్యంగా ఉల్లికాడలు చాలా ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. పైన కత్తిరించిన ప్రతిసారీ కింద నుండి కొత్త కాడలు వస్తూనే ఉంటాయి. సెలెరీని మాత్రం కోసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కోయాలి. ఇవి పెరగడానికి చాలా తక్కువ స్థలం చాలు.

 పుదీనా & స్విస్ చార్డ్ (Mint & Swiss Chard) 
పుదీనా ఎంత వేగంగా పెరుగుతుందో మనందరికీ తెలుసు. ఒక్క చిన్న కొమ్మ నాటినా చాలు.. కోసిన ప్రతిసారీ కొత్త ఆకులతో కుండీ నిండిపోతుంది. ఇక 'స్విస్ చార్డ్' విషయానికి వస్తే, దీని ఆకులు పెద్దగా, రంగురంగుల కాడలతో చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఆకులను విడివిడిగా కోసుకున్నా కూడా ఈ మొక్క పెరుగుతూనే ఉంటుంది.

 ఆవాల ఆకుకూర (Mustard Greens)  
చాలామంది సలాడ్ మొక్కల లిస్టులో ఆవాల ఆకుకూరను మర్చిపోతుంటారు. కానీ ఇది సలాడ్స్, శాండ్‌విచ్‌లకు మంచి ఘాటైన, కారపు రుచిని ఇస్తుంది. ఇది కూడా చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. పాలకూర లాగే దీని ఆకులను కూడా ప్రతిసారి కోసుకోవచ్చు. దీన్ని పెంచడం, చూసుకోవడం చాలా ఈజీ.

 చెర్రీ టమోటాలు (Cherry Tomatoes)  
ఇవి ఆకుకూరలు కాకపోయినా సలాడ్‌లో మెయిన్ ఐటమ్. చెర్రీ టమాటా మొక్కలు చిన్నగా ఉన్నా.. గుత్తులు గుత్తులుగా చాల టమాటాలను కాస్తాయి. మొక్కను కాస్త జాగ్రత్తగా చూసుకుంటే, చాలా నెలల పాటు మనకు ఫ్రెష్ టమాటాలను అందిస్తూనే ఉంటుంది.