
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9 వేల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరిచి.. డేటా వినియోగం పెంచాలని ఆలోచన
- టెలికం కంపెనీల ఆర్పూ ఊపందుకుంటుంది: క్రిసిల్
న్యూఢిల్లీ: ఇండియాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారానికి బోలెడు అవకాశాలు ఉన్నాయని టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో రూరల్ ఏరియాల్లో మరింతగా విస్తరించాలని చూస్తున్నాయి. ఇందుకోసం రూ.9 వేల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తాయని అంచనా. ఇది వీటి గ్రోత్ స్ట్రాటజీలో కీలకంగా మారింది. మెట్రో సిటీలకు అవతల మొబైల్ డేటా డిమాండ్ పెరుగుతోంది. రూరల్ సబ్‌స్క్రయిబర్ల యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఆర్పూ) కూడా ఊపందుకుంటోంది. రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం, రూరల్ ఏరియాల్లో ఇంటర్నెట్ వాడకం పట్టణాలతో పోలిస్తే తక్కువగా ఉంది.
ఇంటర్నెట్ వాడకం పెరిగే కొద్దీ, సబ్‌స్క్రయిబర్లు డేటా ప్లాన్స్‌కి మారడం ఎక్కువవుతుంది. ‘‘డేటా వాడకం పెరిగే కొద్దీ యూజర్లు హయ్యర్ ప్లాన్స్‌కి అప్‌గ్రేడ్ అవ్వడం పెరుగుతుంది. ఫలితంగా కంపెనీల ఆర్పూ వృద్ధి చెందుతుంది. మెట్రోల్లో యూజర్లకి వై-ఫై వంటి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. కానీ రూరల్‌లో మొబైల్ ఫోనే ప్రధానమైనది" అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి అన్నారు. టెలికం కంపెనీలు రూరల్, సెమీ-అర్బన్ ఏరియాల్లో నెట్‌వర్క్ విస్తరణ కొనసాగిస్తే, వచ్చే కొన్ని క్వార్టర్లలో ఆర్పూ గ్రోత్ కొనసాగుతుందని పేర్కొన్నారు. క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం, నెట్‌వర్క్, స్పెక్ట్రమ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఆర్పూ గ్రోత్ వల్ల టెలికం కంపెనీల రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ (పెట్టుబడిపై లాభం) ఈ ఫిస్కల్‌లో 10 శాతం నుంచి 12 శాతానికి పెరుగుతుందని అంచనా.
కాగా, టెలికం కంపెనీల పనితీరును కొలవడానికి ఆర్పూను బెంచ్‌మార్క్‌గా చూస్తారు. టారిఫ్ రేట్లలో మార్పులేకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి టెలికం కంపెనీల సగటు ఆర్పూ రూ.20–-25 పెరిగి రూ.225–-230 కి చేరుకుంటుంది. ఈ పెరిగిన ఆర్పూలో 55–-60 శాతం వాటా రూరల్ యూజర్ల నుంచి వస్తుంది.
గ్రామాల్లో పెరుగుతున్న డేటా వాడకం
గ్రామీణ ప్రాంతాల్లో డేటా వాడకం పెరుగుతోంది. సిగ్నల్స్ బాగుండడం, తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్స్, అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్స్ ఉండడం ఇందుకు కారణం. గ్రామీణ ప్రాంతాల్లోని సబ్‌స్క్రయిబర్లలో సర్కిల్ బీ, సీలకు చెందిన వారే 70 శాతం మంది ఉన్నారు. ఈ జోన్స్‌లో డేటా వాడకం గత నాలుగేళ్లలో ఏడాదికి 19–-22 శాతం వృద్ధి చెందింది. ఈ గ్రోత్ మెట్రోల్లో 17–-19 శాతంగా ఉంది. "ఇంకా నెట్‌వర్క్ లేని ఏరియాల్లో 4జీ విస్తరిస్తోంది. ఫలితంగా కంపెనీల ఆర్పూ మరింత పెరుగుతుంది" అని క్రిసిల్ వివరించింది.2020 నుంచి 2024 వరకు రూరల్ ఇండియాలో ఇంటర్నెట్ వ్యాప్తి 59 శాతం నుంచి 78 శాతానికి పెరిగింది. అంటే రూరల్ ఏరియాల్లోని సబ్‌స్క్రయిబర్లలో 78 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారని అర్థం.
పట్ణణాల్లోని నమోదైన గ్రోత్ రేట్ (77శాతం నుంచి 90 శాతం) కంటే వేగంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూరల్ ఏరియాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి మరో 4-5 శాతం పెరుగుతుందని అంచనా. డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, ఈ–కామర్స్, డిజిటల్ పేమెంట్స్ వాడకం పెరుగుతుండడమే ఇందుకు కారణం. 2024 మధ్యలో టారిఫ్ హైక్స్ ఉన్నప్పటికీ, రూరల్ ప్రాంతాల్లో డేటా వాడకం తగ్గలేదు. మరోవైపు టెలికం కంపెనీలు కూడా ఎక్కువ డేటా- ఆధారిత ప్లాన్స్‌ను ఆఫర్స్ చేస్తున్నాయి. రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
జూన్ 2024 స్పెక్ట్రమ్ ఆక్షన్‌లో చాలా కొనుగోళ్లు బీ, సీ సర్కిల్స్‌లో జరిగాయి. అంతేకాకుండా, టవర్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూరల్ ఏరియాల్లో నెట్‌వర్క్ విస్తరణ కోసం రూ.8,000 కోట్లు–9,000 కోట్లను ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తున్నాయి."ఇందులో సుమారు 75 శాతం ఖర్చు ఫిక్స్‌డ్ కాస్ట్‌గా ఉంటుంది. కాబట్టి, ఆర్పూలో కొంచెం పెరిగినా ఈ కంపెనీల ఆదాయాలు బాగా పెరుగుతాయి" అని క్రిసిల్ రేటింగ్స్ టీమ్ లీడర్ మోహినీ చటర్జీ అన్నారు. రూరల్ డేటా సబ్‌స్క్రయిబర్లను ఆకర్షించాలంటే తక్కువ రేట్లలో ప్లాన్స్ అందుబాటులో ఉండాలని తెలిపారు.