ఫ్రెంచ్​ గయానాలో ప్రయోగించిన జీశాట్​–11

 ఫ్రెంచ్​ గయానాలో ప్రయోగించిన జీశాట్​–11

ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన అత్యంత బరువైన (5,854 కిలోలు) అధునాతన హైథ్రోపుట్​ కమ్యూనికేషన్​ ఉపగ్రహం జీశాట్​–11. ఇది దేశంలో బ్రాడ్​ బ్యాండ్​ సేవలకు మరింత ఊతం లభించనుంది. ఇంటర్నెట్​ వేగం భారీగా పెరగనుంది. ఫ్రెంచ్​ గయానాలోని కౌరులో ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియాన్​–5 రాకెట్​ ద్వారా జీశాట్​–11ను ప్రయోగించారు. భారత అంతరిక్ష సంస్థకు చెందిన అత్యంత శక్తిమంతమైన జీఎస్​ఎల్​వీ మార్క్​ రాకెట్​ కేవలం నాలుగు టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే మోసుకెళ్లగలదు. జీశాట్​–11 బరువు 5,854 కిలోలు ఉండటంతో ఏరియాన్​–5 రాకెట్​ సేవలను ఇస్రో ఉపయోగించుకుంది.

జీశాట్​–11 ఉపగ్రహం ఏరియాన్​–5 రాకెట్​ నుంచి నింగిలోకి లేచిన 33 నిమిషాల తర్వాత విడిపోయి భూ అనువర్తిత బదిలీ కక్ష్యలోకి చేరింది. అనంతరం కర్ణాటకలోని హసన్​లో ఉన్న ఇస్రో మాస్టర్​ కంట్రోల్​ ఫెసిలిటీ ఉపగ్రహ నియంత్రణ బాధ్యతలను తీసుకుంది. ఈ ఉపగ్రహంలోని ఇంజిన్​ను మండించడం ద్వారా దీని కక్ష్యను దశల వారీగా పెంచి, భూమధ్య రేఖకు ఎగువన 36 వేల కిలో మీటర్లు ఎత్తులో భూస్థిర కక్ష్యలోకి ప్రవేశ పెడతారు. తుది కక్ష్యలోకి ఉపగ్రహాన్ని వినియోగంలోకి తీసుకొస్తారు. భారత్​ డిజిటల్​ ఇండియా కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా సెకనుకు 100 గిగా బైట్ల వేగాన్ని అందించేందుకు 4 హెచ్​టీఎస్​ ఉపగ్రహాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జీశాట్​–19, జీశాట్​–29 కక్ష్యలోకి చేరగా, జీశాట్​–11 ప్రస్తుతం చేరింది. జీశాట్​–20ని త్వరలో ప్రయోగిస్తారు. జీశాట్​–11  జీవిత కాలం 15 సంవత్సరాలు. దీని ట్రాన్స్​ పాండర్లు 40 (కేయూ, కేఐ బ్యాండ్లలో). దీని వ్యయం 1200 కోట్లు. జీశాట్​–11 ఇస్రో రూపొందించిన 34వ కమ్యూనికేషన్​ ఉపగ్రహం. దీని సామర్థ్యం పాతతరం వాటితో పోలిస్తే 30 ఉపగ్రహాలకు సమానం...