
- ఈ నష్టాన్ని కేంద్రమే భరించాలి:ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు
న్యూఢిల్లీ: కేంద్రం జీఎస్‌టీ రేట్లను తగ్గిస్తే రాష్ట్రాలు నష్టపోయే ఆదాయాన్ని కేంద్రం ఇవ్వాలని ప్రతిపక్ష పాలిత 8 రాష్ట్రాల మంత్రులు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు కలిపి ఏడాదికి రూ.2 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతాయని , ఇంతే అమౌంట్‌ను 5 సంవత్సరాల పాటు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మంత్రులు, సెప్టెంబర్ 3–4న జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో తమ ప్రతిపాదనలు సమర్పించనున్నారు. కేంద్రం 5శాతం, 18శాతం రెండు స్థాయిలతో కొత్త జీఎస్‌టీ విధానాన్ని ప్రతిపాదించింది.
ఆల్కహాల్, సిగరెట్లు వంటి సిన్ గూడ్స్, లగ్జరీ వస్తువులకు 40శాతం రేటు పడుతుంది. ‘‘జీఎస్‌టీ రేట్ల కోతతో రాష్ట్ర ఆదాయాలు 15–20శాతం తగ్గుతాయి. ప్రతి రేటు తగ్గింపు రాష్ట్రాలకు నష్టమే తెచ్చింది” అని కర్ణాటక మంత్రి బైరె గౌడ అన్నారు. తెలంగాణ ఏడాదికి రూ.7 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
పంజాబ్, కేరళ, తమిళనాడు మంత్రులు కూడా తమ రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోతాయని పేర్కొన్నారు. 2024–25ను బేస్ ఇయర్‌గా తీసుకుని రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోకుండా చూసుకోవాలని వీరు కోరుతున్నారు. అదనపు లెవీ ద్వారా నష్టాలు భర్తీ కాకపోతే, కేంద్రం భవిష్యత్ ఆదాయాలపై రుణాలు తీసుకోవాలని సూచించారు.