జీఎస్‌‌టీ వసూళ్లు రూ. 1.05 లక్షల కోట్లు

జీఎస్‌‌టీ వసూళ్లు రూ. 1.05 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్‌‌టీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో రూ. 1.05 లక్షల కోట్లని, అంతకు ముందు  ఫిబ్రవరితో పోలిస్తే ఇవి 8 శాతం ఎక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఈ ఏడాది జనవరి వసూళ్లు రూ. 1.10 లక్షల కోట్లతో పోలిస్తే ఫిబ్రవరి వసూళ్లు తక్కువేనని తెలిపింది. ఫిబ్రవరి నెలకు సీజీఎస్‌‌టీ రూ. 20,569 కోట్లు, ఎస్‌‌జీఎస్‌‌టీ రూ. 27,348 కోట్లు, ఐజీఎస్‌‌టీ రూ. 48,503 కోట్లు, సెస్‌‌ రూ. 8,947 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 29 దాకా జనవరికి సంబంధించిన జీఎస్‌‌టీఆర్‌‌ 3 రిటర్నులు మొత్తం 83 లక్షలు ఫైలయినట్లు పేర్కొంది. ఐజీఎస్‌‌టీ నుంచి రూ. 22,586 కోట్లను సీజీఎస్‌‌టీకి, రూ. 16,553 కోట్లను ఎస్‌‌జీఎస్‌‌టీకి సెటిల్‌‌ చేసినట్లు వివరించింది. సెటిల్‌‌మెంట్‌‌ తర్వాత ఫిబ్రవరి నెలకు కేంద్ర ప్రభుత్వానికి రూ. 43,155 కోట్ల రెవెన్యూ, రాష్ట్రాలకు రూ. 43,901 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు తెలిపింది. ఫిబ్రవరి నెలలో డొమెస్టిక్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌ జీఎస్‌‌టీ అంతకు ముందు ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 12 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఇంపోర్ట్స్‌‌తో కలిపితే మొత్తం మీద జీఎస్‌‌టీ రెవెన్యూ 8 శాతం పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో ఇంపోర్ట్స్‌‌పై జీఎస్‌‌టీ రెవెన్యూ అంతకు ముందు ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 2 శాతం తగ్గిపోయినట్లు పేర్కొంది. జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లను దాటడం వరసగా నాలుగో నెల.