
వెల్లడించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: జీఎస్టీ కలెక్షన్లు వరుసగా రెండో నెల కూడా లక్ష కోట్ల మార్క్‌ను క్రాస్ చేశాయి. డిసెంబర్ నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.03 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూలను వసూలు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఓ వైపు ఎకానమీ నెమ్మదించడంతో, మార్కెట్‌లో వినియోగాన్ని, లిక్విడిటీని పెంచుతోన్న ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్లు పెరగడం కాస్త ఊరటనిచ్చినట్టయింది. అంతకుముందు ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే, 2019 డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 9 శాతానికి పైగా పెరిగాయి. దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన జీఎస్టీ రెవెన్యూలు 2018తో పోలిస్తే 2019లో 16 శాతం గ్రోత్‌ను నమోదు చేశాయి. దిగుమతుల నుంచి వసూలైన ఐజీఎస్టీని కూడా పరిగణలోకి తీసుకుంటే, మొత్తంగా జీఎస్టీ రెవెన్యూలు 2019 డిసెంబర్‌లో 9 శాతం పెరిగినట్టని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ నెలలో దిగుమతి చేసిన వస్తువులపై ఐజీఎస్టీ (–)10 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ గత నెలతో(–13 శాతంతో) పోలిస్తే కాస్త మెరుగుపడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తంగా డిసెంబర్ నెలలో వసూలైన రూ.1,03,184 కోట్ల వసూళ్లలో… సీజీఎస్టీ రూ.19,962 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.26,792 కోట్లు, ఐజీఎస్టీ రూ.48,099 కోట్లు, సెస్ రూ.8,331 కోట్లు ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి 81 లక్షల సమ్మరీ ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేశారని తెలిపింది.
జీఎస్టీ రిసీప్ట్స్ గత కొన్ని నెలలు నుంచి తగ్గడంతో, కేంద్ర, రాష్ట్రాల మధ్య టెన్షన్స్ నెలకొన్నాయి. కేంద్రం నుంచి కొన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాల చెల్లింపు కూడా జాప్యమైంది. దీంతో జీఎస్టీ పరిహారాలను త్వరగా చెల్లించాలని రాష్ట్రాలు, కేంద్రాన్ని కోరాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం పలుమార్లు రేట్లకోతను, మినహాయింపులను చేపట్టింది. కన్జూమర్ గూడ్స్‌పై ఎక్కువగా పన్ను కోతలను చేపట్టడంతో, వ్యాపార సంస్థలు తమ ఫినిష్డ్ ప్రొడక్ట్‌లపై కంటే ముడిసరుకులపై ఎక్కువ పన్నులను చెల్లించాల్సి వచ్చేది. దీంతో కంపెనీలు ఎక్కువ రీఫండ్స్‌ను కోరేవి. గత నెల 18న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ట్యాక్స్ రేట్లను, శ్లాబులను మార్చడంపై, మార్చిన తర్వాత రెవెన్యూలు వసూళ్లు ఎలా ఉంటాయి అనే దానిపై పలు సూచనలను స్వీకరించింది. అయితే ఎకానమీలో ప్రస్తుతం స్లోడౌన్ ఉన్న నేపథ్యంలో, కౌన్సిల్ ట్యాక్స్ రేట్ల మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 28 శాతం శ్లాబులో ఉన్న కొన్ని ఉత్పత్తులపైనే సెస్‌ను కౌన్సిల్ పెంచింది. జీఎస్టీ శ్లాబులు, రేట్లను మార్చడంపై బడ్జెట్ తర్వాతే కేంద్రం, రాష్ట్రాలు నిర్ణయం తీసుకోనున్నాయి. జీఎస్టీ కారణంగా తమ రెవెన్యూలు పడిపోయాయని, కేంద్రం సహాయం చేయాలని రాష్ట్రాలు కోరుతున్న విషయం తెలిసిందే.