
2019 డిసెంబర్లో రూ. 3,420 కోట్లు
(అంతకుముందు ఏడాదితో పోలిస్తే 13% అదనం)
2020 జనవరిలో రూ. 3,787 కోట్లు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఎఫెక్ట్ కనిపించడం లేదు. జీఎస్టీ (వస్తుసేవల పన్ను) ద్వారా వచ్చే ఆదాయం నిరుటితో పోలిస్తే బాగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే జనవరి నెలలో 19 శాతం పెరుగుదల నమోదైంది. ఇంతగా పెరగడం రికార్డుగా చెప్పుకోవచ్చని అధికారవర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జీఎస్టీ లెక్కల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు జాతీయస్థాయిలో సగటున 12 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో అంతకు ఏడు శాతం ఎక్కువగా 19 శాతం ఆదాయం పెరిగింది. గత ఏడాది జనవరిలో జీఎస్టీ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.3,195 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రూ. 3,787 కోట్లు జమ అయ్యాయి. నిరుటితో పోలిస్తే రూ.597 కోట్ల ఆదాయం పెరిగింది.
రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు
మన రాష్ట్రంతో పాటు గుజరాత్, మహారాష్ట్రలోనూ 19 శాతం వృద్ధి నమోదైంది. చండీఘడ్, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో జీఎస్టీ వృద్ధి ఎక్కువగా కనిపించినా.. ఎక్కువ ఆదాయం వచ్చిన పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కింది. గతేడాది డిసెంబర్‌లోనూ జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. అంతకుముందు ఏడాది డిసెంబర్ కంటే.. ఈసారి 13 శాతం వృద్ధితో రూ.3,420 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల పాటు సాధారణంగానే ఉన్న జీఎస్టీ వసూళ్లు.. ఒక్కసారిగా పుంజుకోవడం ఆర్థిక సంవత్సరం చివర్లో ఖజానాకు కలిసొచ్చినట్టు అయిందని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వర్గాలు చెప్తున్నాయి. డిసెంబర్ వరకు స్టేట్ జీఎస్టీ ద్వారా ఖజానాకు రూ.20,348 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 31 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.