GST రేట్లు మారలే..లాటరీలపై ఇక ఒకే జీఎస్‌‌టీ

GST రేట్లు మారలే..లాటరీలపై ఇక ఒకే జీఎస్‌‌టీ

న్యూఢిల్లీ: ఎలాంటి సంచలనాలూ లేకుండానే జీఎస్‌‌టీ కౌన్సిల్‌‌ 38 వ మీటింగ్‌‌ ముగిసింది. రెవెన్యూ పెంచుకునేందుకు జీఎస్‌‌టీ రేట్లు పెంచుతారనే ఊహాగానాలకు దీంతో తెరపడింది. లాటరీలపై ఒకే రేటుతో జీఎస్‌‌టీ విధింపు, ఓవెన్‌‌ శాక్స్‌‌–నాన్‌‌ ఓవెన్‌‌ శాక్స్‌‌లపైనా ఒకే రేటు జీఎస్‌‌టీ, పరిశ్రమలకు దీర్ఘకాలిక లీజుకిచ్చే స్థలాలపై జీఎస్‌‌టీ మినహాయింపు మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు. జీఎస్‌‌టీ రిటర్న్‌‌లు దాఖలు చేయనివారిపై విధిస్తున్న పెనాల్టీ మినహాయింపు, ఇన్వాయిస్‌‌లు అప్‌‌లోడ్‌‌ చేయకపోతే ఇన్‌‌పుట్‌‌ ట్యాక్స్‌‌ క్రెడిట్‌‌ (ఐటీసీ)ని 10 శాతానికి పరిమితం చేయాలని కూడా జీఎస్‌‌టీ కౌన్సిల్‌‌ నిర్ణయించింది. జీఎస్‌‌టీ రేట్ల పెంపుపై వస్తున్న రూమర్లను మొదటి నుంచీ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌‌ తోసిపుచ్చుతూనే ఉన్నారు. రెవెన్యూ పెంచుకునేందుకు అనుసరించాల్సిన మార్గాల మీద మాత్రం మీటింగ్లో చర్చించినట్లు తెలుస్తోంది. కాంపెన్సేషన్‌‌ చెల్లింపులో జాప్యంపై పలు రాష్ట్రాల మంత్రులు ఈ మీటింగ్లో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రాల పరిస్థితిని అర్ధం చేసుకుని, సహకరిస్తామని ఆర్థిక మంత్రి వారికి హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

లాటరీలపై ఇక ఒకే జీఎస్‌‌టీ

లాటరీలపై ఒకటే రేటుతో జీఎస్‌‌టీ విధించాలని జీఎస్‌‌టీ కౌన్సిల్‌‌ నిర్ణయించింది. ఐతే, కౌన్సిల్‌‌ ఏర్పడిన తర్వాత ఏకాభిప్రాయం కోసం మొదటిసారిగా ఓటింగ్‌‌ నిర్వహించారు. లాటరీలపై  మార్చి1, 2020 నుంచి ఒకటే రేటు అమలులోకి వస్తుంది. జీఎస్‌‌టీ కౌన్సిల్‌‌ 38 వ మీటింగ్‌‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల అధ్యక్షతన బుధవారం జరిగింది. లాటరీలపై ప్రస్తుతం రాష్ట్రాలు 12 శాతం జీఎస్‌‌టీ విధిస్తుండగా, ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్రం బయట  అమ్మేవాటిపై మాత్రం 28 శాతం జీఎస్‌‌టీ విధిస్తున్నారు. అన్ని చోట్లా ఒకే రేటు ఉంటే మేలని భావించిన కౌన్సిల్‌‌ తొలిసారిగా ఓటింగ్‌‌ నిర్వహించింది.