ఇవాళ(సెప్టెంబర్3) జీఎస్టీ మండలి సమావేశం

ఇవాళ(సెప్టెంబర్3) జీఎస్టీ మండలి సమావేశం
  • నిత్యావసరాలపై పన్ను తగ్గింపుకు అవకాశం

న్యూఢిల్లీ:  జీఎస్టీ తగ్గింపు కోసం కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల గురించి చర్చించడానికి,  జీఎస్టీ మండలి బుధవారం సమావేశం కానుంది. జీఎస్టీ పన్ను రేట్లను రెండు శ్లాబులకు (5 శాతం, 18 శాతం) తగ్గించాలని కేంద్రం ఈ సమావేశంలో ప్రతిపాదించనుంది. ప్రస్తుతం ఉన్న 12 శాతం,  28 శాతం శ్లాబుల నుంచి నిత్యావసర వస్తువులను తక్కువ పన్ను రేటులోకి మార్చడం ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం.

 కొన్ని వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించాలని కూడా కేబినెట్​ సూచించింది.  ధరలను తగ్గించే ఈ నిర్ణయాన్ని చాలామంది స్వాగతించారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం ఈ మార్పుల వల్ల తమకు కలిగే ఆదాయ నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రస్తుతం 5, 12, 18  28 శాతం చొప్పున నాలుగు అంచెల జీఎస్టీ విధానం అమల్లో ఉంది. జీఎస్టీ అమలైన తొలి ఐదేళ్లకు, అంటే జూన్ 2022 వరకు, రాష్ట్రాలకు ఆదాయ నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇచ్చే వ్యవస్థ ఉంది.

  ప్రతిపక్ష రాష్ట్రాలు ఇప్పుడు కూడా పరిహారం కావాలని కోరుతున్నాయి. ఈ సంస్కరణల ప్రతిపాదనను  పరిశీలించడానికి ఒక మంత్రుల బృందం (జీఓఎం) ఏర్పాటు చేశారు. ఈ బృందం ప్రతిపాదనకు  కేంద్రం ఆమోదం తెలిపింది.  ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రేటు విషయంలో కేంద్రానికి, జీఓఎం మధ్య భేదాభిప్రాయం ఉంది.

 రూ.40 లక్షల వరకు ధర ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై 18 శాతం జీఎస్టీ విధించాలని జీఓఎం సూచించగా, కేంద్రం మాత్రం ఐదు శాతం జీఎస్టీని కొనసాగించాలని కోరుకుంటోంది. జీఎస్టీ 2.0 అమలైతే  నెయ్యి, నట్స్, మంచినీరు, చెప్పులు, దుస్తులు, మందులు,  వైద్య పరికరాల ధరలు తగ్గుతాయి.  టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి.