ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అహ్మదాబాద్ CGST కమిషనర్ రూ. 57 కోట్లకు జీఎస్టీ పెనాల్టీ నోటీసు జారీ అయ్యింది. జూలై 2017 నుంచి జనవరి 2018 మధ్య ఆసియాలో వెస్సెల్ హయ్యరింగ్ సర్వీసులపై తక్కువ జీఎస్టీ చెల్లించినందున జీఎస్టీ నోటీసులు పంపినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ వ్యాపార కార్యకలాపాలు ప్రభావితం కాలేదని వెల్లడించింది.
జీఎస్టీ అధికారులు ఇచ్చిన నోటీసులపై అప్పీలుకు వెళ్లాలని రిలయన్స్ గ్రూప్ భావిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ఈ సమాచారాన్ని వెల్లడించింది. 2025 మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.10లక్షల 71వేల174 కోట్లు ఏకీకృత ఆదాయం, రూ.లక్షా 46వేల 917 కోట్లు ఆపరేటింగ్ లాభం, రూ.81వేల309 కోట్లు నికర లాభం నమోదు చేసింది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ పన్ను చెల్లింపులో కూడా ముందుంది.
జీఎస్టీ జరిమానా నోటీసులను సంస్థ సవాలు చేస్తూ.. ఈ కేసులో తన పక్షాన్ని వాదించాలని నిర్ణయించుకుంది. వినియోగదారులకు ఎలాంటి ప్రభావం లేకుండా.. కంపెనీ ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుగా చర్యలు తీసుకుంటోంది. ఇటీవల మరికొన్ని ప్రముఖ సంస్థలకు కూడా జీఎస్టీ నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే.
