కాలేజీల అఫిలియేషన్ ఫీజుపై జీఎస్టీ

కాలేజీల అఫిలియేషన్ ఫీజుపై జీఎస్టీ

హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్మీడియెట్ కాలేజీలకు అఫిలియేషన్ నోటిఫికేషన్​ను ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది. ఈసారి బోర్డు నిర్ణయించిన ఫీజులతో పాటు దానిపై 18శాతం జీఎస్టీని వసూలు చేయనున్నది. ఈనెల25 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రకటించారు. మార్చి31 వరకూ కాలేజీలు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కాలేజీలు acadtsble.cgg.gov.in లేదా tsbie.cgg.gov.in వెబ్ సైట్ల ద్వారా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలన్నారు. బిల్డింగ్ సెఫ్టీ రూల్స్ పాటించాలనీ, ఎఫ్డీఆర్, బిల్డింగ్, ప్లే గ్రౌండ్ రిజిస్ట్రేషన్ లీజ్ డీడ్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, శానిటరీ సర్టిఫికెట్, స్ట్రక్చరల్ సౌండ్ నెస్ సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలని సూచించారు. కాలేజీల అఫిలియేషన్​తో పాటు అడిషనల్ సెక్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చనీ, అయితే దానికి అనుగుణంగా అడిషనల్ అకామిడేషన్ ఉంటేనే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. సొసైటీ మార్పు, కాలేజీ పేరు మార్పు, కోఎడ్యుకేషన్/గర్ల్స్ కేటగిరీల మార్పు తదితర వాటికీ అప్లై చేసుకోవాలన్నారు. ఒకే మండలంలోని కాలేజీలకు మాత్రమే షిఫ్టింగ్​కు అవకాశమిస్తామనీ, నాన్ లోకల్ షిఫ్టింగ్​కు పర్మిషన్ లేదని పేర్కొన్నారు. కాలేజీలు ఎలాంటి ఫైన్ లేకుండా ఫిబ్రవరి 21 వరకూ అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. రూ.వెయ్యి ఫైన్​తో 28 వరకూ, రూ.5వేల ఫైన్​తో మార్చి 7 వరకూ, పదివేల ఫైన్​తో మార్చి 14 వరకూ, 15వేల ఫైన్​తో 21 వరకూ, రూ.20 వేల ఫైన్​తో మార్చి31 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్30న గుర్తింపు పొందిన కాలేజీల లిస్టును రిలీజ్ చేస్తామన్నారు. కార్పొరేషన్ పరిధిలోని కాలేజీల తనిఖీ ఫీజు రూ.65వేలు, సెక్షన్ ఫీజు రూ.16వేలు ఉండగా, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆ ఫీజు రూ.50వేలు, రూ.14వేలుగా ఉంది. పంచాయతీ పరిధిలో రూ.20వేల తనిఖీ ఫీజు, రూ.5వేలు సెక్షన్ ఫీజూ ఉంటుందని వెల్లడించారు.

ప్రైవేటు కాలేజీలకు హరిత ఫీజు

అఫిలియేషన్ ఫీజుతో పాటు ఈ ఏడాది కొత్తగా హరిత ఫీజునూ ప్రైవేటు మేనేజ్​మెంట్లు చెల్లించాలని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని కాలేజీలు రూ.500, మున్సిపాలిటీ పరిధిలోని కాలేజీలు రూ.వెయ్యి, కార్పొరేషన్, జీహెచ్ఎంసీ పరిధిలోని కాలేజీలకు రూ.1500 చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. జీవో నంబర్17 ప్రకారం హరిత ఫీజు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఆ జీవోలో వివిధ కేటగిరిల్లోని స్టూడెంట్లు చెల్లించాలని మాత్రమే ఉందనీ, మేనేజ్​మెంట్ల ప్రస్తావన లేదని కాలేజీల ప్రతినిధులు చెప్తున్నారు. ఆ జీవోలో రూ.1500 చెల్లించాలని ఎక్కడా లేకున్నా ఇంటర్ బోర్డు వసూలు చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

జీఎస్టీ ఎత్తెయ్యాలె

అఫిలియేషన్ ఫీజుపై జీఎస్టీ వేయడం సరికాదు. ఇలాంటి కొత్త నిర్ణయాలతో ప్రైవే టు కాలేజీలన్నీ ఇబ్బందులు పడుతాయి. జీఎస్టీ పేరుతో మేనేజ్ మెంట్ల నుంచి డబ్బు లు వసూలు చేసే ఆలోచన మానుకోవాలి.  

- గౌరీ సతీశ్, టీపీజేఎంఏ స్టేట్ ప్రెసిడెంట్