
- లైఫ్, హెల్త్ పాలసీలు, మందులు, మెడికల్ డివైస్‌లకు మినహాయింపులు
- కొన్నింటిని 12%, 18% నుంచి 5 శాతానికి, మరికొన్ని జీరో శాతానికి తగ్గించిన కేంద్రం
- క్యాన్సర్, డయాబెటీస్, జెనెటిక్ తదితర రోగులకు తగ్గనున్న భారం
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ స్లాబుల తగ్గింపు హెల్త్ కేర్ రంగానికి ఊతం ఇచ్చింది. ప్రాణాధార మందులు, మెడికల్ డివైజెస్, హెల్త్ పాలసీలకు సంబంధించి స్లాబుల సంస్కరణల వల్ల ప్రజలు ఆరోగ్యంపై చేసే ఖర్చులు తగ్గనున్నాయి. ఈ నిర్ణయాలు క్యాన్సర్, డయాబెటిస్, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే రోగులకు ఆర్థిక ఉపశమనం కలగనుంది. ప్రస్తుతం మెడికల్ ప్రొడక్ట్స్, మందులు, మెడికల్ ఎక్విప్మెంట్స్‌పై 12% నుంచి 18% వరకు జీఎస్టీ విధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించగా, మరికొన్నింటిపై పూర్తిగా మినహాయించింది. ఉదాహరణకు, థర్మామీటర్లపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించారు. అత్యవసర వైద్య సేవల్లో ఉపయోగించే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నస్టిక్ కిట్లు, రీఏజెంట్లు, గ్లూకోమీటర్లు, టెస్ట్ స్ట్రిప్‌లు, కరెక్టివ్ గ్లాసులపై జీఎస్టీ 12% నుంచి 5 శాతానికి తగ్గింది. స్టెరైల్ సర్జికల్ కాట్‌గుట్, గాజ్ ప్యాడ్స్ తదితరాలపై కూడా జీఎస్టీని తగ్గించారు. ఈ తగ్గింపుల వల్ల రోగుల నెలవారి ఆస్పత్రి ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే, 33 రకాల ప్రాణాధార మందులపై 12 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించారు. మూడు రేర్ డిసీజెస్‌కు సంబంధించిన మందులపై 5 శాతం నుంచి జీరో శాతానికి తగ్గించారు. వాక్సిన్లు, ఇన్సులిన్, ఓఆర్ఎస్, డయాబెటిస్ తదితర మందులపై 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో ప్రజలపై మందుల భారం చాలా వరకు తగ్గనుంది.
పెరగనున్న ఇన్సూరెన్స్‌పై పాలసీలు..
-హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రస్తుతం 18% జీఎస్టీ విధిస్తున్నారు. తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లో హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. ప్రభుత్వ నిర్ణయంతో భవిష్యత్తులో ఎక్కువ మంది ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి వారు హెల్త్ పాలసీలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇన్సూరెన్స్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు పెరిగితే ప్రభుత్వంపై వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గనుంది. సరుకుల రవాణాకు సంబంధించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సేవలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)తో 12 శాతం జీఎస్టీ విధించగా, ఇకపై ఐటీసీతో కలిపి కేవలం 5 శాతం జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. హెల్త్ క్లబ్‌లు, సెలూన్‌లు, బార్బర్ షాప్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, యోగా సెంటర్లపై ఇప్పటివరకు 18 శాతం జీఎస్టీ విధించగా.. ఈ నెల 22 నుంచి ఐటీసీ లేకుండా కేవలం 5 శాతం జీఎస్టీ విధించనున్నారు. ప్రస్తుత నిర్ణయం వల్ల జీఎస్టీ చెల్లించే అవసరం ఉండదని, దీంతో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదని, దీంతో పాలసీదారులకు పూర్తి లబ్ధి చేకూరదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.