
- మిగిలిన కంపెనీల్లోనూ ఆడిట్ చేస్తే మరో 500 కోట్లు ఉంటుందని అంచనా
- వచ్చే నెలలో పూర్తి స్థాయి రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధమైన హైలెవల్ కమిటీ
- అడ్డంగా బుక్కయిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్రావు
- మాజీ సీఎస్ సోమేశ్‌పైనా ఆధారాలు.. గత ప్రభుత్వ పెద్దల హస్తం?
- ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వాట్సాప్ ఆధారాలు ఇవ్వడంలో సీఐడీ జాప్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరిగిన జీఎస్టీ కుంభకోణం ఊహించిన దానికంటే భారీగా ఉందని తాజా ఆడిట్‌లో తేలింది. 75 బడా కంపెనీల్లో కేవలం 45 కంపెనీలను పరిశీలించగా రూ.3 వేల కోట్లపైనే అక్రమాలు బయటపడ్డాయి. గతంలో 30 కంపెనీల ఆడిట్‌లో రూ.1,757 కోట్లు, మొత్తం 75 కంపెనీల్లో రూ.2,648 కోట్ల అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.
అయితే ఇప్పుడు తాజా లెక్కలతో ఈ మొత్తం మరింత పెరిగింది. ఈ కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎస్ సోమేశ్‌పై ఆధారాలు లభించగా, ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్రావు అడ్డంగా బుక్కయ్యారు. దీనిపై హైలెవెల్ కమిటీ వచ్చే నెలలో సమగ్ర నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. గత సర్కార్ హయాంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులను ప్రసన్నం చేసుకొని జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డ 75 బడా కంపెనీల బాగోతం బయటపడుతున్నది.
ఇప్పుడు 45 కంపెనీల లెక్కలు తేల్చగా, మిగిలిన కంపెనీల్లోనూ ఆడిట్చేస్తే ఇంకో రూ.500 కోట్లు అక్రమాలు బయటపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు ఉండటంతో అసలు సూత్రధారులను తేల్చే పనిలో సర్కార్ నిమగ్నమైంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ఆధారాలను సేకరిస్తున్న హైలెవెల్ కమిటీ.. క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నది.
అవసరమైతే ఆయా కంపెనీల నుంచి పూర్తి సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అయితే ఈ వ్యవహారంలో ఫోరెన్సిక్ఆడిట్కు సంబంధించి ఆధారాలను ఇవ్వడంలో సీఐడీ జాప్యం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే జీఎంఆర్, జియో ఫైబర్లిమిటెడ్, ఒలెక్ట్రా గ్రీన్టెక్లిమిటెడ్, మంగళ్యా షాపింగ్‌మాల్, ఎల్అండ్ టీ, ఐటీసీ లిమిటెడ్ లాంటి పెద్ద కంపెనీలు ఇన్‌పుట్ ట్యాక్స్క్రెడిట్ స్కామ్‌లో ఉన్నట్టు తేలింది.
7 కంపెనీల్లో జరిగిందిదీ..
జీఎస్టీ విభాగంలో జరిగిన భారీ ఆర్థిక మోసాన్ని హైలెవెల్కమిటీ వెలికితీసింది. ఈ కమిటీ మధ్యంతర నివేదిక ప్రకారం.. బ్లూనైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా ఏడు కంపెనీలు సర్క్యూలర్ బిల్ ట్రేడింగ్‌లో పాల్గొని రూ.735 కోట్ల టర్నోవర్‌తో రూ.129.50 కోట్ల జీఎస్టీ కట్టాల్సి ఉన్నట్లు ప్రకటించాయి. అయితే ఇందులో కేవలం 1.66% (రూ.2.15 కోట్లు) మాత్రమే నగదు రూపంలో చెల్లించగా, మిగిలిన 98.34% ఫ్రాడ్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో సర్దుబాటు చేశారు. బ్లూనైన్ టెక్నాలజీస్ సహా ఏడు కంపెనీలు ఒకదానికొకటి నకిలీ బిల్లులు జారీ చేసి, లేని లావాదేవీలతో జీఎస్టీ మోసం చేశాయి.
ఈ ఐటీసీపైన పేర్కొన్న ఏడు వ్యాపార సంస్థల మధ్యే బదిలీ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పైగా ఇ-వే బిల్లుల (వస్తువుల రవాణాకు అవసరమైన బిల్లులు) డేటా ప్రకారం 15 వాహనాలను ఈ అన్ని జీఎస్టీ నంబర్లలో నకిలీ వ్యాపారం కోసం పదేపదే ఉపయోగించినట్లు గుర్తించారు. కొన్ని ఇ–-వే బిల్లులలో పేర్కొన్న వాహనాలు స్కూటీలు, మోటార్ సైకిళ్లు, ప్యాసింజర్ ఆటోలు, ప్యాసింజర్ బస్సులు, ట్రాక్టర్లు, కార్లు వంటివి ఉన్నాయి. ఉదాహరణకు స్కూటీ పైన ల్యాప్ టాప్‌లను ట్రాన్స్‌పోర్టు చేసినట్లు పేర్కొన్నారు.
బ్లూనైన్ టెక్నాలజీస్, అమరావతి గ్లోబల్ సొల్యూషన్స్, లెజెండ్ టెక్నాలజీస్, ఏసీఎస్ టెక్నాలజీస్, టాప్‌నాచ్ కార్పొరేట్ సర్వీసెస్, వీసీఆర్8 మీడియా, కోవిడ్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఈ స్కామ్‌లో ఉన్నాయి. ఈ కంపెనీలలో కోటయ్య అలోకం, ప్రభాకర రావు అలోకం, అనిత అలోకం వంటి వేర్వేరు వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్నప్పటికీ వారి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ఒకటే ఉన్నది.
అన్ని కంపెనీలు ఒకే ఫోన్ నంబర్‌ను ఉపయోగించాయి. ఇక బ్లూనైన్ టెక్నాలజీస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఈ ఏడాది జనవరిలో రద్దు చేశారు. జెండ్ టెక్నాలజీస్, టాప్‌నాచ్ కార్పొరేట్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేశారు. కానీ కొన్ని సందర్భాల్లో రద్దును ఉపసంహరించుకోని, ఆ తరువాత మళ్లీ రద్దు చేయడం లాంటివి చేశారు. కేవలం లావాదేవీల కోసమే ఇలా చేసినట్టు గుర్తించారు.
బేగంపేట్ డివిజన్‌లోని కొందరు జీఎస్టీ అధికారులు ఈ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షో-కాజ్ నోటీసులు జారీ చేసినా వాటిని వెనక్కి తీసుకోవడం, రిజిస్ట్రేషన్ రద్దులను తిరిగి పునరుద్ధరించడం వంటివి చేసినట్టు గుర్తించారు. ఉదాహరణకు బ్లూనైన్ టెక్నాలజీస్‌పై 2017–18 నుంచి 2020–21 వరకు రూ.7.62 కోట్ల ట్యాక్స్ డిమాండ్ ప్రతిపాదించినా ఆ మొత్తాన్ని క్యాన్సిల్చేశారు.
ఇక బ్లూనైన్ టెక్నాలజీస్ ఒక్కటే రూ.104.94 కోట్ల టర్నోవర్‌తో రూ.18.85 కోట్ల ట్యాక్స్ కట్టాల్సి ఉన్నట్లు ప్రకటించింది. కానీ కేవలం రూ.20.2 లక్షలు మాత్రమే నగదులో చెల్లించింది. మిగిలినది నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తో సర్దుబాటు చేసింది. లెజెండ్ టెక్నాలజీస్, టాప్‌నాచ్ సర్వీసెస్ నుంచి రూ.15.93 కోట్ల నకిలీ ఐటీసీ తీసుకుంది.
సీఐడీ రిపోర్ట్ ఆలస్యం..
జీఎస్టీ కుంభకోణంలో కీలకమైన ఫోరెన్సిక్ ఆడిట్ చేసి, వాట్సాప్ ఆధారాలను సమర్పించడంలో సీఐడీ జాప్యం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి హైదరాబాద్‌సిటీ పోలీసు కమిషనర్‌తో తొలుత ఫోరెన్సిక్ఆడిట్చేసి, ఎంక్వైరీ కంప్లిట్చేయించాలని భావించారు. ఆ తరువాత దాన్ని సీఐడీకి అప్పగించారు. అయితే సీఐడీ నుంచి అనుకున్నంత సపోర్ట్హైలెవెల్ కమిటీకి అందడం లేదని తెలుస్తోంది.
‘స్పెషల్ ఇనిషియేటివ్స్’ వాట్సాప్ గ్రూప్‌లో జరిగిన చాట్స్ ఆధారంగానే మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఆ గ్రూప్‌లోని సంభాషణలు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాలు. ఈ ఆధారాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసి, వాటి విశ్వసనీయతను నిర్ధారించి, కమిటీకి సమర్పించడంలో సీఐడీ నిర్లక్ష్యం వహిస్తున్నట్టు తెలుస్తోంది. సీఐడీ నుంచి సరైన సహకారం అందకపోవడంతో హైలెవెల్ కమిటీ దర్యాప్తు కొంత వెనుకబడినట్టు సమాచారం.
ఈ జాప్యం కారణంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్టీ అక్రమాల్లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పేరుతో భారీగా ఎగవేత జరిగినట్టు ఆడిట్‌లో తేలింది. జీఎస్టీ సాఫ్ట్‌వేర్ తయారీలోనూ మతలబులు జరిగాయి. ప్రభుత్వం ఈ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది.
అసలు సూత్రధారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, ఎగవేసిన మొత్తాన్ని పూర్తిగా రికవరీ చేసే దిశగా హైలెవెల్ కమిటీ పనిచేస్తోంది. వచ్చే నెలలో సమగ్ర నివేదిక రాగానే ఈ కుంభకోణంలోని అసలు ముఖ్యులు ఎవరనేది స్పష్టమవుతుందని అధికారులు చెప్తున్నారు.