గుడ్డు ముస్లిం కోసం  పోలీసుల వేట

గుడ్డు ముస్లిం కోసం  పోలీసుల వేట

ప్రయాగ్ రాజ్:  ఉత్తరప్రదేశ్​ గ్యాంగ్​స్టర్, మాజీ ఎంపీ అతీక్  అహ్మద్ ప్రధాన అనుచరులలో ఒకడైన గుడ్డు ముస్లిం కోసం ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు. చివరిసారిగా కర్నాటకలో గుడ్డు కదలికలను గుర్తించడంతో ఆ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. అతీక్, అష్రఫ్​లు  జైలుకెళ్లాక గ్యాంగ్​లో గుడ్డు కీలకంగా వ్యవహరించాడని సమాచారం. అసద్​ ఎన్​కౌంటర్​లో చనిపోవడం, అతీక్ సోదరులు హత్యకు గురవడంతో అతీక్  భార్య షైస్తా పర్వీన్‌‌‌‌‌‌‌‌ పరారీలో ఉంది. దీంతో అతీక్​ గ్యాంగ్​ లో గుడ్డు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుడ్డును పట్టుకుంటే అతీక్​ కు ఐఎస్​ఐ, టెర్రర్ సంస్థలకు ఉన్న సంబంధం బయటపడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అతీక్  హత్య కేసు తేలాలంటే గుడ్డును పట్టుకోవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గుడ్డు కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, అతీక్, అష్రఫ్​ హత్యకు గురయ్యాక కనిపించకుండా పోయిన షైస్తా పర్వీన్​.. భర్త అతీక్ అంత్యక్రియలకూ హాజరు కాలేదు. భర్త, పిల్లలు జైలులో ఉన్న సమయంలో మాఫియా వ్యవహారాలను పర్వీన్​ చూసుకున్నారని పోలీసులు ఆరోపించారు. మరోవైపు, అతీక్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌, అతడి సోదరుడు అష్రాఫ్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ను కాల్చి చంపిన లవ్లేశ్‌‌‌‌‌‌‌‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌‌‌‌‌‌‌‌ మౌర్యలను భద్రతా కారణాల దృష్ట్యా ప్రతాప్‌‌‌‌‌‌‌‌గఢ్ జిల్లా జైలుకు తరలించారు.

మిగిలింది నలుగురే..

ఉమేశ్ పాల్ హత్యపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​లో మొత్తం పదిమందిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ లిస్టులో కేవలం నలుగురు మాత్రమే మిగిలారని, అందులో గుడ్డు ముస్లిం కూడా ఒకడని చెప్పారు. 

అతీక్​ మర్డర్​ కేసుపై ‘సిట్’ ఏర్పాటు

అతీక్​ హత్య కేసును విచారించేందుకు ఉత్తరప్రదేశ్​పోలీసు విభాగం స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్ (సిట్)ను ఏర్పాటుచేసింది. అడిషనల్​డిప్యూటీ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​సతీశ్​ చంద్ర సారథ్యంలో ఏర్పాటైన ఈ టీమ్​లో అసిస్టెంట్​ కమిషనర్​ ఆఫ్​ పోలీస్ (కొత్వాలీ) సతేంద్ర ప్రసాద్​ తివారీ, ప్రయాగ్​రాజ్ పోలీస్​ క్రైం బ్రాంచ్​ ఇన్​స్పెక్టర్​ ఓం ప్రకాశ్​ సభ్యులుగా ఉన్నారు.  ఇక ఈ సిట్​ దర్యాప్తు ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు గైడ్​ చేసేందుకు ఒక సూపర్​విజన్​టీమ్​ ను యూపీ డీజీపీ ఆర్​.కె.విశ్వకర్మ ఏర్పాటు చేశారు. ప్రయాగ్​ రాజ్​ జోన్​ అడిషనల్​ డీజీపీ భాను భాస్కర్ సారథ్యంలో ఏర్పాటుచేసిన ఈ టీమ్​లో రమిత్​ శర్మ, యూపీ ఫోరెన్సిక్​ సైన్స్​ లేబొరేటరీ డైరెక్టర్​లు సభ్యులుగా ఉంటారని ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ కేసుపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్​ కమిషన్​ను ఆదివారమే నియమించింది.

అతీక్​ బాడీలోకి 9.. అష్రఫ్​ బాడీలోకి 5 బుల్లెట్లు

ఐదుగురు వైద్య నిపుణుల బృందం విడుదల చేసిన అతీక్​అహ్మద్​ పోస్టుమార్టం రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. అతీక్​పై ముగ్గురు నిందితులు పలు రౌండ్లు తుపాకీతో కాల్పులు జరిపారని వెల్లడైంది. అతీక్​ శరీరంపై తొమ్మిది చోట్ల  బుల్లెట్​ గాయాలను వైద్యులు గుర్తించారు. తలలోకి ఒక బుల్లెట్​, ఛాతీ, వీపులలోకి 8 బుల్లెట్లు చొచ్చుకెళ్లాయని పోస్టుమార్టం రిపోర్టులో ప్రస్తావించారు. అతీక్​సోదరుడు అష్రఫ్​బాడీ నుంచి 5 బుల్లెట్లను రికవర్​ చేశారు. వీటిలో ఒక బుల్లెట్​ ముఖంలోకి, మరో నాలుగు బుల్లెట్లు వీపులోకి చొచ్చుకెళ్లాయని పేర్కొన్నారు.