నిజమైన చరిత్రను చెప్పాలని.. ఈ రజాకార్ : గూడూరు నారాయ‌‌ణ రెడ్డి

నిజమైన చరిత్రను చెప్పాలని.. ఈ రజాకార్ : గూడూరు నారాయ‌‌ణ రెడ్డి

బాబీ సింహా, వేదిక, అనసూయ, ప్రేమ‌‌, ఇంద్రజ, మ‌‌క‌‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయ‌‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. మార్చి 15న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలీని పరిస్థితి నెలకొంది. కొందరు ఇప్పటికీ 1947 ఆగస్టు 15న వచ్చింది అనుకుంటున్నారు. అది నిజం కాదు కదా. అందుకే నిజమైన చరిత్ర అందరికీ తెలియాలనే ఈ ‘రజాకార్’ సినిమాను తీశాను.

1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు జరిగిన ఘటనలు, రజాకార్ వ్యవస్థ పాల్పడిన దురాగతాలను చూపించాను. మా నిర్మాత ఓ రాజకీయ నాయకుడు కావడంతో కొందరు కాంట్రవర్సీ చేశారు.  కానీ నేను ఓ క్రియేటర్‌‌‌‌గా మన చరిత్ర చెప్పాలనుకున్నాను. కల్పితం చేసి చరిత్రను తప్పుగా చూపిస్తే నేను చరిత్ర హీనుడిగా మిగిలిపోతాను. ఉన్నది ఉన్నట్టుగా తీశాం. ఇందుకోసం ఎన్నో పుస్తకాలు చదివాను. ఎంతోమంది వ్యక్తుల్ని కలిశాను. అందరికీ  ఆమోదయోగ్యంగా ఉండేలా తెరకెక్కించాం. ఇలాంటి ఓ గొప్ప కథతో దర్శకుడిగా పరిచయం అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని చెప్పారు.