
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. 14 జిల్లాల్లోని 93 సీట్లకు సోమవారం జరిగిన రెండో విడత పోలింగ్‌లో 61 శాతం మంది ఓటు వేశారు. ఉదయం 8 గంటలకు 14,975 స్టేషన్లలో మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా కొనసాగింది. చాలా పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఇంకా క్యూలో ఉండటంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాధ్వీ, కాంగ్రెస్ నేత సుఖ్రామ్ రథ్వా తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అహ్మదాబాద్‌లోని రాణిప్ ఏరియాలో నిషాన్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ప్రధాని, నారాణ్‌పురాలో అమిత్ షా ఓటు వేశారు. మోడీ తల్లి హీరా బెన్.. గాంధీనగర్ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలయ్యాక ట్వీట్ చేసిన మోడీ.. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు వేయాలని కోరారు. మరోవైపు భూపేంద్ర పటేల్, బీజేపీ లీడర్ హార్దిక్ పటేల్, కాంగ్రెస్ నేత జిగ్నేశ్ మేవానీ సహా రెండో విడతలో 832 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓటింగ్ మొదలైన తొలి 3 గంటల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 41 బ్యాలెట్ యూనిట్లు, 40 కంట్రోల్ యూనిట్లు, 109 వీవీపాట్స్‌ను మార్చినట్లు ఈసీ తెలిపింది.
ఆరు అసెంబ్లీ, ఒక లోక్‌సభ సీటుకు బైపోల్స్
ఐదు రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ సీట్లకు, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓ మోస్తరు పోలింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 5 గంటల దాకా యూపీలోని రామ్‌పూర్ సదర్‌లో 31.22%, ఖటౌలీలో 54.5%.. మెయిన్‌పురి పార్లమెంట్ స్థానంలో 51.89%, ఒడిశాలోని పాదమ్‌పూర్‌లో 76%, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్‌లో 70%, బీహార్‌లోని కుర్హానీలో 60%, చత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్‌లో 64.86% మంది ఓటు వేశారు.