కేబుల్ బ్రిడ్జి ప్రమాదం: ఇంకా బురదలోనే మరిన్ని మృతదేహాలు

కేబుల్  బ్రిడ్జి ప్రమాదం:  ఇంకా బురదలోనే మరిన్ని మృతదేహాలు

మోర్బి బ్రిడ్జి ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి

కొనసాగుతున్న సహాయక చర్యలు

9 మందిని అరెస్టు చేసిన పోలీసులు

మోర్బి/న్యూఢిల్లీ: గుజరాత్‌‌లోని మోర్బిలో జరిగిన ఘోర ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 141కి చేరింది. సహాయక చర్యలు సోమవారం కూడా కొనసాగాయి. గల్లంతైన వారి కోసం గాలింపు సాగుతున్నది. ఆదివారం సాయంత్రం పరిమితికి మించి భారీగా జనం వెళ్లడంతో మచ్చు నదిపై కట్టిన తీగల వంతెన కుప్పకూలిపోయింది. దీంతో వంతెనపై ఉన్న వందలాది మంది సందర్శకులు మచ్చు నదిలో పడిపోయారు.

వారిలో కొంతమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. మరో వందమంది ఆచూకీ తెలియట్లేదని అధికారులు చెప్పారు. రాత్రంతా మోర్బిలోనే ఉన్న సీఎం భూపేంద్ర పటేల్, మంత్రి హర్ష సంఘావి.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆరు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్‌‌, ఒక ఎయిర్ ఫోర్స్ టీమ్, రెండు ఆర్మీ టీమ్స్, రెండు నేవీ టీమ్స్, స్థానిక పోలీసు బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బ్రిడ్జి కూలిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆధ్యాత్మిక గురువు దలైలామా సంతాపం ప్రకటించారు.

9 మంది అరెస్టు!

తీగల వంతెన నిర్వహణ చూస్తున్న ఏజెన్సీపై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘సిటీకి చెందిన ఒరెవా గ్రూప్‌‌నకు.. బ్రిడ్జి రినొవేషన్, నిర్వహణ బాధ్యతలను అప్పగించాం. ఈ కంపెనీ గడియారాలు, ఈ బైక్‌‌లు తయారు చేస్తుంది” అని మోర్బి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలా చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పలువురిని ప్రశ్నించేందుకు పిలిపించినట్లు ఎస్పీ రాహుల్ త్రిపాఠి చెప్పారు.

ఒరెవా గ్రూపునకు చెందిన నలుగురు ఉద్యోగులు సహా 9 మందిని అరెస్టు చేశారు. వారిపై 304, 308 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ‘‘ఒరెవా కంపెనీకి చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టికెట్ బుకింగ్ క్లర్క్‌‌లతోపాటు ఇద్దరు రిపైరింగ్ కాంట్రాక్టర్లను, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని అరెస్టు చేశాం. లోతైన దర్యాప్తు చేస్తాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోం” అని ఐజీ అశోక్ కుమార్ యాదవ్ చెప్పారు. బ్రిడ్జిని ఓపెన్ చేసేందుకు మున్సిపాలిటీ నుంచి 
ఇంకా ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేదని స్థానిక అధికారులు చెప్పారు.

జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలి: కాంగ్రెస్

తీగల వంతెన కూలిన ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రమాదానికి నిర్లక్ష్యం, నిర్వహణా లోపమే కారణంగా కనిపిస్తోందని చెప్పింది. బాధితులందరికీ ఆర్థిక, వైద్య సాయాన్ని అందించాలని డిమాండ్ చేసింది. ‘‘బ్రిడ్జి కూలడానికి కారణాలు ఏంటో తెలియాలి. అంతమందిని ఎందుకు అనుమతించారు. సుప్రీం కోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి” అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.

తీరని శోకంలో ఎంపీ కుటుంబం

మోర్బి దుర్ఘటన.. రాజ్‌‌కోట్ ఎంపీ మోహన్ కుందరీయ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ప్రమాదంలో తన బంధువులు 12 మంది చనిపోయినట్లు మోహన్ తెలిపారు. అందులో ఐదుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారని.. అందరూ తన సోదరుడికి చాలా కావాల్సిన వాళ్లని చెప్పారు.

మరో వంద మృతదేహాలు బురదలో..!

బ్రిడ్జి కూలిన ప్రమాదంలో గల్లంతైన వారి కోసం మచ్చు నదిలో రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. సోమవారం సాయంత్రం రెస్క్యూ ఆపరేషన్​ ఆపేశారు. మంగళవారం ఉదయం మళ్లీ రెస్క్యూ పనులు చేపడతామని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ ఇంకా వంద మందికి పైగా జాడ తెలియట్లేదని తెలిపారు. దీంతో నదిలోని బురదలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు చిక్కుకుని ఉండొచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మృతులలో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది పిల్లలేనని అధికారులు వెల్లడించారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఘటనాస్థలాన్ని సందర్శించనున్నట్లు గుజరాత్ సీఎంవో పేర్కొంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ప్రధాని ఎక్స్‌‌గ్రేషియా ప్రకటించారు. గుజరాత్ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ఎక్స్‌‌గ్రేషియా ప్రకటించింది.